Telangana: ఇదేం పని మాస్టారూ.! పాఠాలు చెప్పాల్సిన మీరే.. ఒకేసారి 10 మంది స్కూల్ పిల్లలతో ఇలా
స్టూడెంట్ తన మాట వినకపోతే.. అతడ్ని మందలించడం లేదా రెండు దెబ్బలు కొట్టాలి. కానీ ఇక్కడ ఓ హెడ్‌మాస్టర్ తన బాధ్యతలు విస్మరించి.. ఏకంగా ఓ రౌడీ మాదిరిగా బిహేవ్ చేశాడు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న దారుణ ఘటన కలకలం రేపుతోంది. అదే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న సూర్య అనే విద్యార్థిపై, 10వ తరగతి విద్యార్థులతో తీవ్రంగా దాడి చేయించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు ప్రధానోపాధ్యాయుడు కృష్ణ కారణమని బాధిత విద్యార్థి కుటుంబం ఆరోపిస్తోంది. విద్యార్థి సూర్య తన మాట వినడంలేదనే నెపంతో ప్రధానోపాధ్యాయుడు కృష్ణ, అదే స్కూల్‌లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులను ప్రేరేపించి, సూర్యను తీవ్రంగా కొట్టించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో సూర్యకు శారీరకంగా, మానసికంగా తీవ్ర వేదనకు గురయ్యాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పాఠశాలలో విద్యార్థులను కాపాడాల్సిన హెడ్‌మాస్టరే ఈ తరహ చర్యలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి.
దుండిగల్ మండలంలో ఎంఈవోగా కూడా విధులు నిర్వహిస్తున్న కృష్ణ, కొంపల్లి ప్రభుత్వ పాఠశాలకు హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారని సమాచారం. ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి నుంచే ఈ తరహ వ్యవహారం వెలుగులోకి రావడం విద్యాశాఖ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. పాఠశాల వాతావరణం భద్రంగా ఉండాల్సిన సమయంలో, విద్యార్థులపై దాడులు జరగడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థి తండ్రి శివ రామకృష్ణ, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడికి న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పాఠశాల సిబ్బంది, విద్యార్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు ఎలా స్పందిస్తారు? హెడ్‌మాస్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బాధిత విద్యార్థికి న్యాయం జరుగుతుందా? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఉండాల్సిన సమయంలో, ఇలాంటి ఘటనలు జరగడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.




