కొత్త కారు కొనాలనుకునే వారికి షాక్..! ఆ కంపెనీ కార్లు ఇక మరింత ప్రియం!
కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్న వారికి మరో షాకింగ్ న్యూస్. ఇప్పటికే మారుతి సుజుకి, హ్యుందాయ్ కంపెనీ కార్ల ధరలు పెరిగాయి. జూలై 1, 2026 నుంచి కియా ఇండియా తన అన్ని మోడళ్ల కార్ల ధరలు కూడా పెరగనున్నాయి. తమ కంపెనీ కార్ల ధరలను గరిష్ఠంగా 2 శాతం వరకు పెంచనున్నట్లు కియా ఇండియా (Kia India) ప్రకటించింది.

ధరాఘాతం కార్ల ప్రియులను కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మారుతి సుజుకి, హ్యుందాయ్ కార్ల ధరలను పెంచుతున్నట్లు ఆ కంపెనీలు ప్రకటించాయి. తాజాగా కియా ఇండియా కూడా తమ కంపెనీ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జూలై 1, 2026 నుంచి కియా కంపెనీకి చెందిన అన్ని మోడళ్ల ధరలు గరిష్ఠంగా 2 శాతం వరకు పెరగనున్నాయి. ముడి పదార్థాల ధరలు, ఉత్పత్తి వ్యయాలు, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కియా ఇండియా సంస్థ వెల్లడించింది.
కియా ఇండియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ధరల పెంపు కంపెనీ మొత్తం మోడల్ శ్రేణికి వర్తిస్తుంది. అయితే ప్రతి మోడల్, వేరియంట్‌ను బట్టి పెరుగుదల శాతం మారుతుంది. వినియోగదారులపై భారం తగ్గించేందుకు పెరిగిన ఖర్చుల్లో గణనీయమైన భాగాన్ని కంపెనీ కూడా సొంత మేర భరిస్తోందని తెలిపింది.
ప్రస్తుతం భారత మార్కెట్లో కియా సంస్థ సోనెట్, సిరోస్, సెల్టోస్, కేరెన్స్, కేరెన్స్ క్లావిస్, కార్నివాల్, EV6, EV9 వంటి మోడళ్లను విక్రయిస్తోంది. వీటన్నింటిపైనా జూలై 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. గరిష్ఠంగా 2 శాతం మేర పెరగనున్నాయి.
కస్టమర్లకు వరుస షాక్‌లు
ఆటోమొబైల్ రంగంలో ఇటీవల అనేక కంపెనీలు కూడా ధరలను పెంచుతున్నాయి. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, సరకు రవాణా వ్యయాలు, నిర్వహణ వ్యయాల ప్రభావంతో తయారీ సంస్థలు ధరల సవరణలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కియా కూడా తాజా ధరల పెంపును ప్రకటించింది. మాస్ మార్కెట్‌తో పాటు లగ్జరీ కార్ కంపెనీలు కూడా కారు ధరలను పెంచుతూ కస్టమర్లకు వరుస షాక్‌లు ఇస్తున్నాయి. ఇటీవల మారుతి సుజుకి పలు వేరియంట్లపై రూ.30 వేల వరకు పెంచగా..హ్యుందాయ్ మోటార్ ఇండియా కొన్ని మోడళ్లపై రూ.12,800 వరకు పెంచింది. జూన్ నుంచి ఈ పెంచిన ధరలు అమలులోకి వచ్చాయి. అలాగే BYD కూడా తమ కంపెనీ కార్లపై 3 శాతం మేర ధర పెంచింది.
లగ్జరీ సెగ్మెంట్‌లో ఆడి ఇండియా, మెర్సిడీస్ బెంజ్ ఇండియా తమ కార్ల ధరలను 2 శాతం మేర పెంచింది. టాటా మోటార్స్ కంపెనీ తమ ప్యాసింజర్ వాహనాల ధరలను సరాసరిగా 0.5 శాతం మేర పెంచింది.
తరచూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు (FAQs)
ప్రశ్న: కియా కార్ల ధరల పెంపు ఎప్పటి నుంచి అమలులోకి రానుంది? జవాబు: జూలై 1, 2026 నుంచి కియా కార్ల ధరల పెంపు అమలులోకి వస్తుంది
ప్రశ్న: కియా కార్ల ధరలు ఎంత మేరకు పెరగనుంది..? జవాబు: అన్ని మోడళ్లపై గరిష్ఠంగా 2% వరకు ధరలు పెరుగుతాయి
ప్రశ్న: పలు కార్ల కంపెనీలు ఎందుకు ధరలు పెంచుతున్నాయి? జవాబు: ముడి పదార్థాలు, నిర్వహణ వ్యయాలు పెరగడం కారణమని కార్ల కంపెనీలు చెబుతున్నాయి
