AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫేస్‌వాష్ కావాలంటూ షాప్‌లోకి వచ్చాడు.. ఇచ్చేందుకు వెనక్కి తిరిగిన మహిళ.. అంతే వెనుక నుంచి..

ఉప్పల్‌లోని ఓ కాస్మొటిక్‌ దుకాణంలో కస్టమర్‌గా నటిస్తూ ఓ యువకుడు మహిళ మెడలోని 37 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. బాధితురాలు, మరో కస్టమర్‌తో పాటు స్థానికుల అప్రమత్తత, తక్షణ స్పందనతో నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. చోరీకి గురైన మంగళసూత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని, దొంగను రిమాండ్‌కు తరలించారు.

ఫేస్‌వాష్ కావాలంటూ షాప్‌లోకి వచ్చాడు.. ఇచ్చేందుకు వెనక్కి తిరిగిన మహిళ.. అంతే వెనుక నుంచి..
Uppal Gold Chain Snatching
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jun 20, 2026 | 11:50 AM

Share

కస్టమర్‌గా నటిస్తూ ఓ కాస్మొటిక్‌ దుకాణంలోకి ప్రవేశించిన యువకుడు మహిళ మెడలోని బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. ఈ ఘటన ఉప్పల్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రామంతాపూర్‌ వెంకటరెడ్డి నగర్‌కు చెందిన కాసుల సంధ్య (35) హనుమాన్‌సాయినగర్‌లోని ఓ కాస్మొటిక్‌ షాపులో పనిచేస్తోంది. గురువారం మధ్యాహ్నం సుమారు 12.50 గంటల సమయంలో ఓ యువకుడు కస్టమర్‌‌గా నటిస్తూ దుకాణంలోకి వచ్చి ఫేస్‌వాష్‌ ధర గురించి అడిగాడు. సంధ్య అతడికి ఆ ప్రొడక్ట్ చూపించేందుకు వెనక్కి తిరిగిన క్షణంలోనే ఆమె మెడలో ఉన్న సుమారు 37 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యాడు.

ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురైన సంధ్య గట్టిగా కేకలు వేస్తూ నిందితుడి వెంట పరుగెత్తింది. అదే సమయంలో దుకాణంలో ఉన్న మరో కస్టమర్‌ కూడా ఆమెకు సాయం చేసేందుకు అరస్తూ అతని వెంట పరిగెత్తాడు. వారి అరుపులు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై ఉప్పల్‌ మండే మార్కెట్‌ ప్రాంతంలో నిందితుడిని పట్టుకుని తిరిగి దుకాణం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఉప్పల్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందితుడు కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం యాచారం గ్రామంలోని సజ్జనాయక్‌ తండాకు చెందిన బానోతు శ్రీనివాస్‌ (21)గా గుర్తించారు.

ప్రస్తుతం అతడు ఎస్ఆర్‌ నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన మొత్తం దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డైంది. నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన మంగళసూత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించింది. స్థానికుల అప్రమత్తత, వేగవంతమైన స్పందన వల్లే నిందితుడిని వెంటనే పట్టుకుని బంగారు మంగళసూత్రాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యమైందని పోలీసులు అభినందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us