AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో చలి పంజా.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు !!

తెలంగాణలో చలి పంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోగా.. ఈ సీజన్‌లో తొలిసారిగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ కేంద్రం గణాంకాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 9.6, కోహిర్‌లో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

తెలంగాణలో చలి పంజా.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు !!
Telangana Weather Update
Korivi Jayakumar
|

Updated on: Nov 20, 2026 | 10:38 AM

Share

తెలంగాణలో చలి పంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోగా.. ఈ సీజన్‌లో తొలిసారిగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఉత్తర దిశ నుంచి వీస్తున్న పొడి చల్లటి గాలుల ప్రభావంతోనే పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణ కేంద్రం గణాంకాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 9.6, కోహిర్‌లో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ మేరకు చలి తీవ్రత దృష్ట్యా పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అలానే కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 10.5, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 10.7, వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో 11, మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 12, నిజామాబాద్ జిల్లా వర్నిలో 12.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వచ్చే మూడు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లో సైతం చలి ప్రభావం క్రమక్రమంగా పెరుగుతోంది. నగరంలో సాధారణంగా కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 10 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇక నగర శివారు ప్రాంతాలు, ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు 12 నుంచి 16 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల వరకు చలి తీవ్రత తగ్గకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు స్వెట్టర్లు, మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. అలానే పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో మధ్యాహ్నం వేళల్లో సైతం చల్లని గాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణ మార్పుల వల్ల చిన్నపిల్లలు, వృద్ధుల్లో శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మరోవైపు అక్వాన్ తుపాను ప్రభావం తెలంగాణపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తుపాను కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే తుపాను తీరం దాటిన తర్వాత నుంచి హైదరాబాద్ ‌లో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందన్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల సెల్సియస్‌ కు చేరవచ్చని స్పష్టం చేసింది.

Follow Us