AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ టు కర్ణాటక.. అర్థరాత్రి ఇదేం పనిరా..? పోలీసులు ఛేజ్ చేస్తుంటే.. వాళ్లు ఏం చేశారంటే

**Telugu Excerpt:** జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌లో పందుల దొంగలను పట్టుకునేందుకు పోలీసులు అర్థరాత్రి సాహసోపేతంగా ఛేజ్ చేశారు. బొలెరో వాహనంలో పందులను ఎత్తుకెళ్తున్న దొంగలు పోలీసులపై రాళ్లు, ఖాళీ బీర్ సీసాలు, పందులను విసిరి దాడికి పాల్పడ్డారు. చివరకు తమ వాహనాన్ని వదిలేసి, కోళ్ల ఫారం నుంచి మరో బొలెరోను అపహరించి కర్ణాటకలోని రాయచూర్ వైపు పరారయ్యారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది.

తెలంగాణ టు కర్ణాటక.. అర్థరాత్రి ఇదేం పనిరా..? పోలీసులు ఛేజ్ చేస్తుంటే.. వాళ్లు ఏం చేశారంటే
Crime News
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Jun 20, 2026 | 12:33 PM

Share

జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌లో అర్థరాత్రి పందుల దొంగలు హల్‌చల్ చేశారు. పందులను దొంగతనం చేసి బొలెరో వాహనంలో పరారవుతుండగా పోలీసుల కంటపడ్డారు. దీంతో అప్రమత్తమైన ఖాకీలు దొంగలను వెంబడించారు. వెంటపడుతున్న పోలీసులను తప్పించుకునేందుకు దొంగలు ఏకంగా పోలీస్ వాహనంపైనే రాళ్లు, ఖాళీ బీర్ సీసాలు, ఎత్తుకెళ్తున్న పందులను విసిరి దాడికి పాల్పడ్డారు. అయినా పోలీసులు వెనక్కు తగ్గకపోవడంతో చివరకు బొలెరో వాహనాన్ని వదిలేసి మరో వాహనాన్ని అపహరించి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 18 అర్థరాత్రి దాటిన తర్వాత అలంపూర్ ప్రాంతంలో పందుల దొంగతనం జరిగింది. అయితే సదరు వాహనాన్ని గుర్తించిన పందుల యజమానులు.. దొంగలు బొలెరో వాహనంలో రాయచూర్ వైపు పారిపోతున్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే డీఎస్పీ మొగులయ్య అప్రమత్తమై అలంపూర్, ఉండవెల్లి, శాంతినగర్, ఐజ పోలీసులను అలర్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసుల కంటికి చిక్కిన దొంగల వాహనాన్ని పోలీసులు వెంబడించారు. అయితే, వెనుక నుంచి పోలీస్ వాహనం వస్తున్నట్లు గమనించిన దొంగలు రాళ్లు, ఖాళీ మద్యం సీసాలు విసురుతూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాటిని తప్పించుకుంటూ పోలీసులు అలానే ముందుకు సాగారు. ఇక చేసేది లేక బొలెరోలో ఉన్న పందులను సైతం పోలీస్ వాహనంపై విసిరి వేస్తూ పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గకుండా దొంగలను చేజ్ చేస్తూనే ఉన్నారు.

చివరకు దొంగలు పందులు ఉన్న బొలెరో వాహనాన్ని మధ్యలో వదిలేసి కొంత దూరం వెళ్లి ఓ కోళ్ల ఫారం వద్దకు చేరుకున్నారు. అక్కడి కోళ్లు ఫారం వాళ్ళను బెదిరించి అక్కడున్న మరో బొలెరో వాహనాన్ని తీసుకుని రాయచూర్ వైపునకు పరారయ్యారు.

వీడియో చూడండి..

ఇక వాహనంలో ముగ్గురు దొంగలు ఉన్నట్లు గుర్తించామని, వీరు గతంలో కూడా గద్వాల్ జిల్లాలో పందుల దొంగతనాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నామని డీఎస్పీ మోగులయ్య తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టామని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us