AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్ ఇంత కథ ఉందా.. కార్డు పెట్టగానే ఏటీఎంలో ఏం జరుగుతుంది..? పక్కా లెక్కతో నోట్లు ఎలా వస్తాయి..!

ఏటీఎంలో కార్డు పెట్టడం.. పిన్ నంబర్ ఎంటర్ చేయడం.. కావాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేయడం.. క్షణాల్లో డబ్బు చేతికి వచ్చేస్తుంది. ఇదంతా మనకు చాలా నార్మల్‌గా అనిపిస్తంది. కానీ మనం అడిగిన మొత్తాన్ని ఏటీఎం కచ్చితంగా ఎలా లెక్కపెడుతుంది? ఏ నోటు ఎంత విలువైనదో దానికి ఎలా తెలుస్తుంది? అసలు ఏటీఎం లోపల ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే.. మీరు ఆశ్చర్యపోతారు.

బాబోయ్ ఇంత కథ ఉందా.. కార్డు పెట్టగానే ఏటీఎంలో ఏం జరుగుతుంది..? పక్కా లెక్కతో నోట్లు ఎలా వస్తాయి..!
How Atm Machines Work
Krishna S
|

Updated on: Nov 09, 2026 | 3:20 PM

Share

బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునే సౌకర్యాన్ని ఏటీఎంలు అందిస్తున్నాయి. కార్డు పెట్టడం, పిన్ నంబర్ ఎంటర్ చేయడం, కావాల్సిన మొత్తాన్ని నమోదు చేయడం.. క్షణాల్లో మన చేతికి నగదు వచ్చేస్తుంది. అయితే ఏటీఎంలో డబ్బులు ఎక్కడ దాచిపెడతారు? మనం అడిగిన మొత్తమే ఎలా బయటకు వస్తుంది? ఒకటి కంటే ఎక్కువ నోట్లు కలిసిపోకుండా యంత్రం ఎలా గుర్తిస్తుంది? డబ్బులు లెక్కపెట్టే వ్యక్తి లేకుండానే ఈ ప్రక్రియ ఎలా సాధ్యమవుతుంది? దీని వెనుక ఆసక్తికరమైన సాంకేతిక వ్యవస్థ పనిచేస్తుంది. ఏటీఎం బయటకు చూస్తే చిన్న కంప్యూటర్‌లా కనిపిస్తుంది. కానీ దాని లోపల అత్యంత భద్రత కలిగిన ప్రత్యేక క్యాష్ స్టోరేజ్ వ్యవస్థ ఉంటుంది. ఇందులో డబ్బులను ఫ్రీగా ఉంచరు. ప్రత్యేక క్యాసెట్లలో వేర్వేరుగా భద్రపరుస్తారు. ఒక్కో క్యాసెట్‌లో ఒక్కో విలువ కలిగిన నోట్లను ఉంచుతారు. ఉదాహరణకు ఒక ఏటీఎంలో రూ.500 నోట్లు ఒక క్యాసెట్‌లో, రూ.200 నోట్లు మరో క్యాసెట్‌లో, రూ.100 నోట్లు ఇంకో క్యాసెట్‌లో ఉండవచ్చు. ఏటీఎం నిర్వహణ సంస్థ, యంత్రం సామర్థ్యాన్ని బట్టి ఈ ఏర్పాటు మారుతుంది. ఈ క్యాసెట్లలో ఎన్ని నోట్లు ఉన్నాయో కూడా యంత్రంలోని సాఫ్ట్‌వేర్‌కు సమాచారం ఉంటుంది.

మన అకౌంట్‌లో డబ్బులు ఉన్నాయో లేదో ఎలా తెలుస్తుంది?

మనం ఏటీఎంలో డెబిట్ కార్డు పెట్టగానే అసలు ప్రక్రియ మొదలవుతుంది. మొదట కార్డు రీడర్ ద్వారా కార్డు వివరాలను యంత్రం చదువుతుంది. అనంతరం పిన్ నంబర్‌ను నమోదు చేయమని అడుగుతుంది. మనం ఎంటర్ చేసిన వివరాలు బ్యాంకింగ్ నెట్‌వర్క్ ద్వారా సంబంధిత బ్యాంకుకు చేరతాయి. అక్కడ కార్డు వివరాలు, పిన్ ధ్రువీకరణ, అకౌంట్‌లో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్, నగదు ఉపసంహరణ పరిమితులు వంటి అంశాలను పరిశీలిస్తారు. లావాదేవీకి అనుమతి లభిస్తే ఏటీఎంకు సమాచారం వస్తుంది. ఆ తర్వాతే నగదు బయటకు తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఏటీఎం తనంతట తాను తెలుసుకోదు. బ్యాంక్ సర్వర్‌తో అనుసంధానమై సమాచారాన్ని పొందుతుంది.

మనం అడిగిన మొత్తాన్నే ఎలా లెక్కపెడుతుంది?

ఇక్కడే అసలు టెక్నాలజీ దాగి ఉంది. ఉదాహరణకు మనం ఏటీఎంలో రూ.4,700 విత్‌డ్రా చేయాలనుకుంటే.. యంత్రంలో అందుబాటులో ఉన్న నోట్ల విలువలు, వాటి సంఖ్య ఆధారంగా ఎంతెన్ని నోట్లు ఇవ్వాలో సాఫ్ట్‌వేర్ నిర్ణయిస్తుంది. ఒకవేళ రూ.500, రూ.200 నోట్లు అందుబాటులో ఉంటే.. 9 రూ.500 నోట్లు, ఒక రూ.200 నోటు కలిపి మొత్తం రూ.4,700 ఇవ్వవచ్చు. అయితే ఏటీఎంలో ఉన్న నోట్ల విలువలు, క్యాసెట్లలో మిగిలిన నగదు, యంత్రం కాన్ఫిగరేషన్‌ను బట్టి ఈ లెక్క మారుతుంది. అందుకే ఏటీఎంలో డబ్బులు ఉన్నప్పటికీ, మనం అడిగిన ప్రతి మొత్తాన్ని ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు.

ఒక్కో నోటును ఎలా బయటకు తీస్తుంది?

ఏటీఎంలో మనం అడిగిన మొత్తానికి అనుగుణంగా సాఫ్ట్‌వేర్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత క్యాష్ డిస్పెన్సర్ పనిచేయడం ప్రారంభిస్తుంది. క్యాసెట్‌లోని నోట్లను ప్రత్యేకమైన రోలర్లు, పికింగ్ మెకానిజం సహాయంతో ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంది. అక్కడి నుంచి నోట్లు ప్రత్యేకమైన బెల్టుల ద్వారా నగదు బయటకు వచ్చే భాగానికి చేరుకుంటాయి. ఈ ప్రక్రియలో ప్రతి నోటు కదలికను సెన్సార్లు పర్యవేక్షిస్తాయి.

రెండు నోట్లు కలిసివస్తే ఎలా గుర్తిస్తుంది?

ఏటీఎంలో అత్యంత కీలకమైన వ్యవస్థల్లో సెన్సార్లు ఒకటి. కొన్ని సందర్భాల్లో రెండు నోట్లు ఒకదానికొకటి అతుక్కుని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మడతపడిన నోట్లు, చిరిగిన నోట్లు లేదా సరిగ్గా కదలని నోట్లు కూడా సమస్య సృష్టించవచ్చు. ఇలాంటి పరిస్థితులను గుర్తించడానికి డబుల్ పిక్ డిటెక్షన్, థిక్నెస్ సెన్సర్లు, నోట్ పాసేజ్ సెన్సర్లు వంటి వ్యవస్థలు పనిచేస్తాయి. రెండు నోట్లు కలిసివస్తున్నట్లు లేదా నోటు సరిగా కదలడం లేదని గుర్తిస్తే.. ఆ నోట్లను కస్టమర్‌కు ఇవ్వకుండా ప్రత్యేకమైన రిజెక్ట్ బిన్‌లోకి మళ్లిస్తాయి. ఆ తర్వాత అవసరమైన సంఖ్యలో నోట్లు వచ్చేలా యంత్రం ప్రయత్నిస్తుంది. అంటే ఏటీఎంలో డబ్బులు కేవలం బయటకు నెట్టే యాంత్రిక వ్యవస్థ మాత్రమే కాదు. ప్రతి నోటు కదలికను గమనించే సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉంటుంది.

డబ్బులు బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది?

మనం అడిగిన మొత్తానికి సరిపడా నోట్లు లెక్కించిన తర్వాత క్యాష్ డిస్పెన్సర్ వాటిని నగదు బయటకు వచ్చే భాగంలో ఉంచుతుంది. ఆ తర్వాత షట్టర్ తెరుచుకుని మనం డబ్బులు తీసుకునే అవకాశం కల్పిస్తుంది. లావాదేవీ వివరాలు కూడా యంత్రంలో నమోదు అవుతాయి. అవసరమైతే రసీదు ప్రింట్ అవుతుంది.

చివరిగా..

మనం కొన్ని సెకన్లలో పూర్తి చేసే ఏటీఎం లావాదేవీ వెనుక బ్యాంకింగ్ నెట్‌వర్క్, సాఫ్ట్‌వేర్, ప్రత్యేక క్యాష్ క్యాసెట్లు, సెన్సార్లు, యాంత్రిక వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తాయి. అందుకే ఏటీఎం అనేది కేవలం డబ్బులు ఇచ్చే యంత్రం కాదు.. బ్యాంకింగ్ సేవలను మన దగ్గరకు తీసుకొచ్చిన ఒక చిన్న ఆటోమేటెడ్ వ్యవస్థ.

Follow Us