AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమాన టికెట్లు బుక్ చేశాక రైలు టికెట్లు కన్ఫామ్.. రీఫండ్ రాక కోర్టుకెక్కిన ప్రయాణికుడు!

రైలు టికెట్లు బుక్ చేశారు కానీ వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండిపోయాయి. ప్రయాణ సమయం దగ్గరపడుతున్నా కన్ఫర్మేషన్ రాలేదు. ఇక రైలును నమ్ముకుంటే కష్టమని భావించిన తండ్రీకూతుళ్లు చివరకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. అంతా సర్దుకుందని అనుకునేలోపే రైల్వే నుంచి మెసేజ్ వచ్చింది. అప్పటివరకు వెయిటింగ్‌లో ఉన్న టికెట్లు కన్ఫామ్ అయ్యాయి! దీంతో ఒక్కసారిగా వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. రైలు టికెట్లు రద్దు చేసుకోవాలని ప్రయత్నించినా అప్పటికే రీఫండ్ పొందేందుకు నిర్ణయించిన గడువు ముగిసిపోయింది. దీంతో తమకు జరిగిన నష్టంపై వారు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

విమాన టికెట్లు బుక్ చేశాక రైలు టికెట్లు కన్ఫామ్.. రీఫండ్ రాక కోర్టుకెక్కిన ప్రయాణికుడు!
Booked Flights After Train Tickets Stayed Waitlisted Railway Ordered To Pay Passenger Rs 19700
Sharada V
|

Updated on: Nov 09, 2026 | 3:20 PM

Share

దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ కేసులో కీలక తీర్పు వెలువడింది. టికెట్లను చివరి నిమిషంలో కన్ఫామ్ చేసిన రైల్వే సేవాలోపానికి పాల్పడిందని తేల్చిన కమిషన్ ప్రయాణికుడికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

కుమార్తె ఉద్యోగ పరీక్ష కోసం ఢిల్లీకి

కేరళకు చెందిన దిలీప్ కుమార్ తన కుమార్తెతో కలిసి 2018లో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. భారత వాతావరణ శాఖ (IMD)లో అసిస్టెంట్ మెటీరియలాజికల్ ఆఫీసర్ పోస్టుకు ఆమెకు కాల్ లెటర్ వచ్చింది. జూన్ 22న న్యూఢిల్లీలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంది. తిరుగు ప్రయాణం కోసం మే 24నే ఐఆర్‌సీటీసీ ద్వారా రెండు రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఒకటి స్లీపర్ క్లాస్, మరొకటి థర్డ్ ఏసీ. వీటి ధరలు వరుసగా రూ.1,860, రూ.4,840. అయితే రెండు టికెట్లూ వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండిపోయాయి. ప్రయాణ తేదీ దగ్గరపడుతున్నా కన్ఫామ్ కాకపోవడంతో దిలీప్ ప్రతిరోజూ వాటి స్టేటస్ చెక్ చేసేవారు. టికెట్లు కన్ఫామ్ కాకపోతే రద్దు చేసుకుని రీఫండ్ తీసుకోవాలని భావించారు.

విమాన టికెట్లు బుక్ చేసిన 19 నిమిషాలకే ఊహించని ట్విస్ట్!

2018 జూన్ 22న సాయంత్రం 7.20 గంటలకు దిలీప్, ఆయన కుమార్తె ఢిల్లీలోని ఐఆర్‌సీటీసీ సేవా కేంద్రానికి వెళ్లి టికెట్ల స్థితిని పరిశీలించారు. అప్పటికీ అవి వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉన్నాయని తేలింది. దీంతో ఇక రైలు ప్రయాణం సాధ్యం కాదని భావించి తిరుగు ప్రయాణానికి విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే విమాన టికెట్లు బుక్ చేసిన కేవలం 19 నిమిషాలకే సీన్ మారిపోయింది. సాయంత్రం 7.39 గంటలకు వారి ఫోన్లకు రైలు టికెట్లు కన్ఫామ్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అప్పటికే విమాన టికెట్లు బుక్ చేసుకోవడంతో రైలు టికెట్లను రద్దు చేసుకోవాలని ప్రయత్నించారు. కానీ ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యల కారణంగా రాత్రి 8.45 గంటలకు మాత్రమే క్యాన్సిలేషన్ పూర్తయింది.

వారు ప్రయాణించాల్సిన రైలు రాత్రి 11.35 గంటలకు బయలుదేరాల్సి ఉంది. రీఫండ్ పొందాలంటే రైలు బయలుదేరడానికి కనీసం నాలుగు గంటల ముందే టికెట్లు రద్దు చేసుకోవాలి. కానీ రైల్వే నుంచి కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చేసరికి ఆ గడువు ముగిసే సమయం దగ్గరపడింది. దీంతో టికెట్లు రద్దు చేసినప్పటికీ రీఫండ్ పొందలేకపోయారు. చివరకు విమాన ప్రయాణానికి డబ్బులు చెల్లించడంతో పాటు రైలు టికెట్ల డబ్బులూ నష్టపోయారు.

రైల్వే, ఐఆర్‌సీటీసీ ఏమని వాదించాయంటే?

తమకు జరిగిన నష్టానికి రైల్వే అధికారులే బాధ్యత వహించాలని దిలీప్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై దక్షిణ రైల్వే అధికారులు తమ వాదనలు వినిపించారు. ప్రయాణికులు ఎప్పుడైనా టికెట్లు రద్దు చేసుకోవచ్చని, ఇతర ప్రయాణికులు టికెట్లు రద్దు చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్లు కన్ఫామ్ అవుతాయని చెప్పారు. రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందే చార్ట్ తయారీ పూర్తవుతుందని, బెర్తుల లభ్యత ఆధారంగా కన్ఫర్మేషన్ ఉంటుందని వివరించారు. ఈ వివాదాన్ని విచారించే అధికారం రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌కే ఉందని వాదించారు.

మరోవైపు ఐఆర్‌సీటీసీ కూడా తమకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని స్పష్టం చేసింది. రిజర్వేషన్ వ్యవస్థను ఉపయోగించుకునే సదుపాయాన్ని మాత్రమే తాము కల్పిస్తామని, బెర్తుల కేటాయింపు, చార్ట్ తయారీ, టికెట్ల కన్ఫర్మేషన్, రీఫండ్ నిర్ణయాల్లో తమ పాత్ర ఉండదని తెలిపింది.

రైల్వే సేవాలోపానికి పాల్పడింది.. రూ.19,700 చెల్లించాల్సిందే!

ఈ కేసును విచారించిన కేరళ జిల్లా వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు ఇచ్చింది. రైలు బయలుదేరడానికి నాలుగు గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్లు కన్ఫామ్ అయినట్లు సమాచారం ఇవ్వడం వల్ల ప్రయాణికుడికి రీఫండ్ పొందేందుకు అవసరమైన సమయంలో వాటిని రద్దు చేసుకునే అవకాశం లేకుండా పోయిందని పేర్కొంది. ఇది రైల్వే సేవాలోపమేనని తేల్చింది.

రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను కూడా ఆశ్రయించవచ్చన్న కారణంతో వినియోగదారుల కమిషన్ ఈ కేసును విచారించకూడదనే వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. అయితే టికెట్ల కన్ఫర్మేషన్, మెసేజ్ పంపడంలో ఐఆర్‌సీటీసీకి ప్రత్యక్ష పాత్ర లేదన్న వాదనను అంగీకరించి ఆ సంస్థకు బాధ్యత నుంచి మినహాయింపు ఇచ్చింది.

2026 అక్టోబర్ 27న ఈ తీర్పును వెలువరించిన కమిషన్.. దక్షిణ రైల్వే ప్రయాణికుడికి మొత్తం రూ.19,700 చెల్లించాలని ఆదేశించింది. ఆర్డర్ అందిన నెల రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది. గడువులోగా చెల్లించకపోతే న్యాయపరమైన ఖర్చులను మినహాయించి మిగిలిన మొత్తంపై ఏటా 9 శాతం వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

Follow Us