265 కి.మీ రేంజ్‌తో Mahindra UDO.. అయిదేళ్లలో ఎంత ఆదా చేయొచ్చో తెలిస్తే ఎగిరిగంతేస్తారు
పెరుగుతున్న పెట్రోల్, CNG ధరలతో ఆటో డ్రైవర్లకు నిర్వహణ ఖర్చులు భారంగా మారుతున్నాయి. రోజంతా వాహనం నడిపినా ఇంధన ఖర్చులు పోను చేతికి మిగిలే ఆదాయం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ ఆటోలు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఈ క్రమంలో Mahindra Last Mile Mobility తన కొత్త ఎలక్ట్రిక్ ఆటో Mahindra UDOను పరిచయం చేసింది. కంపెనీ దీనిని ‘ఆటోప్లేన్’గా అభివర్ణిస్తోంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో సుమారు 200 కిలోమీటర్ల సాధారణ రేంజ్, ఆధునిక ఫీచర్లు దీని ప్రత్యేకతలుగా ఉన్నాయి.

ఆటో డ్రైవర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని Mahindra UDO వాహనాన్ని రూపొందించినట్లు మహీంద్రా కంపెనీ తెలిపింది. ఇందులో 11.7 kWh లిథియం అయాన్ బ్యాటరీని అందించారు. దీని ARAI సర్టిఫైడ్ రేంజ్ 265 కిలోమీటర్లుగా ఉంది. అలాగే హిల్ హోల్డ్, క్రీప్ మోడ్, మూడు డ్రైవింగ్ మోడ్‌లు వంటి సదుపాయాలు ఉన్నాయి. సౌకర్యవంతమైన సీటింగ్, ప్రత్యేకమైన సస్పెన్షన్ వ్యవస్థతో పాటు నిర్వహణ ఖర్చులను తగ్గించేలా ఈ ఎలక్ట్రిక్ ఆటోను తీసుకొచ్చారు.
ట్రాఫిక్‌కు ప్రత్యేక ఫీచర్లు!
Mahindra UDOలోని 11.7 kWh బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 5 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. సాధారణ వినియోగంలో 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఇందులో 10 kW పీక్ పవర్, 52 Nm టార్క్ అందించారు. హిల్ హోల్డ్ ఫీచర్ ఎత్తైన రహదారులపై ఆటోను ఆపినప్పుడు వెనక్కి జారకుండా సహాయపడుతుంది. రేస్ మోడ్‌లో గరిష్ఠంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.
ట్రాఫిక్‌లో ఆటోను నెమ్మదిగా ముందుకు కదిలించేందుకు క్రీప్ మోడ్ ఉపయోగపడుతుంది. ఇరుకైన ప్రదేశాల్లో వెనక్కి తీసుకెళ్లేందుకు రివర్స్ థ్రోటిల్ సదుపాయం ఉంది. ఇందులో Range, Ride, Race అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. డ్రైవర్ సౌకర్యం కోసం మందంగా ఉండే పైలట్ సీటు, ముందు డ్యూయల్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక ఇండిపెండెంట్ రియర్ సస్పెన్షన్ అందించారు. డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు కూర్చోవచ్చు.
ఐదేళ్లలో ఎంత ఆదా?
ధర విషయానికి వస్తే Mahindra UDO ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.3,58,999గా ఉంది. ఇది ప్రారంభ ఆఫర్ ధర కాగా, సాధారణ ఎక్స్‌షోరూమ్ ధర రూ.3,84,299. అంటే ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలు చేస్తే సుమారు రూ.25,300 వరకు తగ్గింపు లభిస్తుంది.
నిర్వహణ ఖర్చుల విషయంలో ఈ ఎలక్ట్రిక్ ఆటో ద్వారా ఐదేళ్లలో రూ.5 లక్షల వరకు ఆదా చేయవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. ఏడాదికి రూ.1 లక్ష వరకు ఇంధన ఖర్చు తగ్గవచ్చని తెలిపింది. అలాగే 1 లక్ష కిలోమీటర్ల వరకు ఉచిత సర్వీస్ సదుపాయం అందిస్తోంది. బ్యాటరీ, వాహనానికి 6 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిలోమీటర్లు, ఏది ముందైతే అది, వారంటీ ఇస్తోంది. అయితే వాస్తవ ఆదా విద్యుత్ ఛార్జీల ధర, రోజువారీ ప్రయాణ దూరం, వాహన వినియోగంపై ఆధారపడి ఉంటుంది.
