Gmail: జీమెయిల్ బాగా వాడుతున్నారా..? ఎగిరి గంతేసే వార్త చెప్పిన గూగుల్
ఒకసారి క్రియేట్ చేసుకున్న జీమెయిల్ ఐడీని మార్చుకునే అవకాశం ఇప్పటివరకు లేదు. మధ్యలో మీరు మార్చుకోవలంటే అది కుదరని పని. కానీ ఇప్పటినుంచి ఆ రూల్ మారింది. ఇక నుంచి మీరు జీమెయిల్ ఐడీ నేమ్‌ను మార్చుకోవచ్చు. కొత్తగా గూగుల్ ఈ ఆప్షన్‌ను తీసుకొచ్చింది.

ఈ రోజుల్లో ఈమెయిల్ అనేది ప్రతీఒక్కరికీ అవసరమే. మీరు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగ అవససరాలు లేదా వ్యాపారం చేస్తుంటే బిజినెస్ అవసరాల కోసం మెయిల్ అనేది తప్పనిసరి. ఇక విద్యార్థులకు కూడా ఫైల్స్‌ను భద్రపర్చుకోవడానికి, విద్యాపరంగా ఇతర పనుల మెయిల్ అనేది ఉపయోగపడుతుంది. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది జీమెయిల్ అనేది వాడుతూ ఉంటారు. గూగుల్‌కు చెందిన జీమెయిల్ ఎప్పటినుంచో ఉండగా.. ఇది బాగా పాపులర్ అయింది. ఇప్పుడు మార్కెట్లో యాహూ, ఔట్‌లుక్ లాంటి ఎన్నో మెయిల్ ఫ్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నా.. జీమెయిల్‌కు అందరూ అలవాటు పడి అదే ఎక్కువగా వాడుతున్నారు. యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ఏదోక ఫీచర్‌ను జీమెయిల్ తీసుకొస్తోంది. అందులో భాగంగా తాజాగా మరో అదిరిపోయే ఆప్షన్ ప్రవేశపెట్టింది.
మెయిల్ ఐడీ నేమ్ ఛేంజ్
ఇప్పటివరకు జీమెయిల్ ఐడీ నేమ్‌ను మార్చుకునే వెసులుబాటు అందుబాటులో లేదు. మీరు జీమెయిల్ కొత్తగా క్రియేట్ చేసే సమయంలో ఏ నేమ్‌తో మెయిల్ ఐడీ అయితే ఎంచుకున్నారో.. అది తర్వాత మార్చుకోవడానికి కుదరదు. కొంతమంది తమ నేమ్‌పై మెయిల్ ఐడీ అందుబాటులో లేకనే లేదా ఇతర అవసరాల కోసమే వేరే వేరే పేర్లతో జీమెయిల్ క్రియేట్ చేసుకుని ఉంటారు. అలాంటివారు తర్వాత దానిని మార్చుకోవాలంటే అసలు కుదరదు. దాంతో కొత్తగా మరో ఐడీని యూజర్లు క్రియేట్ చేసుకుంటున్నారు. పాత మెయిల్ ఐడీలో తమ డేటా ఉంటుంది గనుక ఆ ఐడీని అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు.
ఇక ఐడీ మార్చుకోవచ్చు
ఇక నుంచి మీరు మెయిల్ ఐడీని మార్చుకోవచ్చు. అవును జీమెయిల్ కొత్తగా ఈ ఫీచర్ తీసుకొచ్చింది. గూగుల్ సపోర్ట్ పేజీలో ఈ ఆప్షన్ ప్రస్తుతం కనిపిస్తుంది. ఒకసారి మీరు ఐడీ నేమ్ మార్చుకున్న తర్వాత ఏడాది వరకు మార్చుకోవడానికి కుదరదు. అంతేకాకుండా ఇలా కేవలం మూడుసార్లు మాత్రమే జీమెయిల్ ఐడీ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కొందరి యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా.. త్వరలో అందరికీ రానుందని తెలుస్తోంది. మీరు మెయిల్ ఐడీ నేమ్‌ను మార్చుకున్నా మీ డేటా అలాగే ఉంటుంది. లాస్ట్‌లో ఉండే @జీమెయిల్ తప్ప మిగతాది మీరు మార్చుకోవచ్చు. మనిషికి రెండు పేర్లు ఉన్నట్లే ఇక నుంచి జీమెయిల్‌కు కూడా రెండు యూజర్ నేమ్‌లు ఉండేలా ఈ ఆప్షన్ అభివృద్ది చేశారు.
