AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fossils of Dinosaur Egg: అరుదైన డైనోసార్ గుడ్డు శిలాజం.. ఏడు కోట్ల ఏళ్లయినా.. చెక్కుచెదరని రూపం..

డైనొసార్స్ గురించి ఎన్నో విన్నాం. కోట్లాది సంవత్సరాల ముందు జీవించిన ఈ అతిపెద్ద జీవులు కాల క్రమంలో వచ్చిన ఉపద్రవాల్లో కనుమరుగైపోయాయి. అయితే, ఇప్పటికీ డైనోసార్స్ కు సంబంధించిన అనేక ఆనవాళ్ళు అక్కడక్కడా దొరుకుతూ వస్తున్నాయి.

Fossils of Dinosaur Egg: అరుదైన డైనోసార్ గుడ్డు శిలాజం.. ఏడు కోట్ల ఏళ్లయినా.. చెక్కుచెదరని రూపం..
Fossils Of Dinosaur Egg
KVD Varma
|

Updated on: Dec 23, 2021 | 9:00 AM

Share

Fossils of Dinosaur Egg: డైనొసార్స్ గురించి ఎన్నో విన్నాం. కోట్లాది సంవత్సరాల ముందు జీవించిన ఈ అతిపెద్ద జీవులు కాల క్రమంలో వచ్చిన ఉపద్రవాల్లో కనుమరుగైపోయాయి. అయితే, ఇప్పటికీ డైనోసార్స్ కు సంబంధించిన అనేక ఆనవాళ్ళు అక్కడక్కడా దొరుకుతూ వస్తున్నాయి. శిలాజాలుగా ఇప్పటి వరకూ ఎన్నో డైనోసార్స్ లభించాయి. వాటిని బట్టె ఈ జీవులకు సంబంధించిన ఎన్నో విశేషాలను శాస్త్రవేత్తలు బయతకు తీసుకువచ్చారు. తాజాగా కోట్లాది ఏళ్ల క్రితం నాటి డైనొసార్స్ గుడ్డు ఒకటి దొరికింది.

దక్షిణ చైనా శాస్త్రవేత్తలు డైనోసార్ గుడ్డుకు సంబంధించిన శిలాజాన్ని కనుగొన్నారు. దీనిలో విశేషమేమిటంటే.. దాదాపు 7 కోట్ల సంవత్సరాలు గడిచినా గుడ్డులోపల డైనోసార్ పిండం శిలాజం ఏమాత్రం పాడవకుండా చక్కగా ఉంది. శాస్త్రవేత్తలు ఈ శిలాజ పిండానికి ‘బేబీ యింగ్లియాంగ్’ అని పేరు పెట్టారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సుమారు 7 కోట్ల సంవత్సరాల వయస్సు గల గుడ్డులో కనిపించిన ఈ పిండం శిలాజం ఇప్పటివరకు తెలిసిన అత్యంత పూర్తి డైనోసార్ పిండం. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ శాస్త్రవేత్తల చెబుతున్న దాని ప్రకారం ఈ పిండం ఓవిరాప్టోరోసార్ జాతికి చెందినది.

చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లోని గన్‌జౌ నగరంలో ‘హెకౌ ఫార్మేషన్’ రాళ్లలో బేబీ యింగ్లియాంగ్ కనుగొన్నారు. ఇది గుడ్డు నుంచి బయటపడటానికి చాలా దగ్గరగా ఉంది . చైనా, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన చేశారు. ఈ డైనోసార్ పిండం అరుదైన శిలాజాలలో ఒకటి అని వారు అంటున్నారు. గుడ్డు ఒక రకమైన ప్రకృతి వైపరీత్యానికి గురైనప్పుడు బేబీ యింగ్లియాంగ్ పుట్టడానికి చాలా దగ్గరగా ఉందని పరిశోధనలో తేలింది. ఈ గుడ్డు సుమారు 7 అంగుళాల పొడవు ఉంటుంది. అయితే, దాని లోపల ఉన్న పిల్ల డైనోసార్ శిలాజం తల నుండి తోక వరకు 11 అంగుళాల పొడవు ఉంటుంది. పెద్దయ్యాక ఈ డైనోసార్ 2 నుంచి 3 మీటర్ల పొడవు పెరిగేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

శాస్త్రవేత్తల ప్రకారం, ఈ రెక్కల డైనోసార్ ఓవిరాప్టోరోసార్ జాతికి చెందినది. ఈ జాతికి దంతాలు ఉండవు. ఇవి ముక్కులు, ఈకలతో కూడిన డైనోసార్‌లు. అవి ఆసియా, ఉత్తర అమెరికా రాళ్లపై కనిపించాయి. శాస్త్రవేత్తల ప్రకారం, ఓవిరాప్టోరోసార్‌ల ముక్కు, శరీరం ఆకారం అవి అనేక రకాల ఆహారాన్ని స్వీకరించగలవని నిర్ధారిస్తున్నాయి.

ఆధునిక పక్షుల వలె..

శిలాజ శాస్త్రవేత్తల ప్రకారం, ప్రస్తుతం దొరికిన శిలాజం పిండం దాని శరీరం క్రింద తలని కలిగి ఉంది. గుడ్డు ఆకారం ప్రకారం దాని వీపు వంగి ఉంది. అలాగే, రెండు పాదాలు తల వైపు ఉన్నాయి. నేటి పక్షులలో ఈ భంగిమను ‘టకింగ్’ అంటారు. కోడిపిల్లలు విజయవంతంగా పొదిగేందుకు ఈ భంగిమ అవసరం. ఈ డైనోసార్‌లు తమ గుడ్లపై కూర్చుని ఆధునిక పక్షుల్లా పొదిగేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Pushpa: The Rise: హిందీలోనూ తగ్గేదే లే అంటున్న ‘పుష్ప’రాజ్.. భారీ వసూళ్లు దిశగా..

Viral Video: చలికాలం అవస్థలు.. కింద మంట పైన స్నానం.. వీడియో చూస్తే షాక్‌..

Viral Video: ఈ భారతీయుడి డ్యాన్స్‌ చూస్తే ప్రభుదేవా కూడా ఫిదా అవుతాడు..!