Tokyo Olympics 2021: దారులన్నీ అటువైపే.. కసితో పడుతున్న అడుగులు.. పతకాల కోసం పరుగులు..
Tokyo Olympics 2021: ఒలింపిక్స్‌కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. ప్రతి అథ్లెట్ ఒలింపిక్ మెడల్ సాధించాలన్న కసితో టోక్యోలో అడుగుపెడుతున్నారు. ప్రతీ ఈవెంట్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి స్వర్ణం, రజతం, కాంస్య పతకాలు అందజేస్తారనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పతకాల ఖరీదు ఎంత..?
ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ క్రీడలు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. కొవిడ్ ఎఫెక్ట్‌తో ఏడాది పాటు వాయిదా పడిన విశ్వక్రీడలు, ఎట్టకేలకు మొదలు కాబోతున్నాయి. ఈ క్రీడల్లో ప్రతి అథ్లెట్ ఒలింపిక్ మెడల్ సాధించాలన్న కసితో ఉన్నారు. ప్రతీ ఈవెంట్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి స్వర్ణం, రజతం, కాంస్య పతకాలు అందజేస్తారని మనకు తెలిసిందే. ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఓ ప్రశ్న ఆసక్తికరంగా మారింది. విజేతలకు ఇచ్చే పతకాల ఖరీదు ఎంత..? అని.
టోక్యో ఒలింపిక్స్‌లో ప్రదానం చేయనున్న పతకాలను జపాన్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ జునిచీ కవానిషి రూపొందించారు. దేశవ్యాప్తంగా పతకాల డిజైన్లకు ఆహ్వానించగా.. వందలాది మంది నుంచి వడపోసి చివరకు జునిచీకి ఈ డిజైనింగ్ బాధ్యతలు కట్టబెట్టారు. ప్రతీ మెడల్ రాతి నుంచి చెక్కబడినట్లుగా అనిపిస్తుంది. అంత ధృఢంగా రూపొందించారు. అంతే కాకుండా పూర్తిగా పాలిష్ చేయబడి ఉండటంతో మెరుస్తూ ఉంటుంది. ప్రతీ మెడల్ ముందు భాగంలో గ్రీకు విజయ దేవత ‘నైకి’ బొమ్మ చెక్కబడింది. ఆమె ఏథెన్సులోని పనథినైకోస్ స్టేడియం ముందు నిలబడి ఉంటుంది. ఇక వెనుక భాగంలో టోక్యో 2020 లోగోను చెక్కారు.
గోల్డ్ మెడల్ 556 గ్రాముల బరువు ఉంటుంది. సిల్వర్ మెడల్ 550 గ్రాములుంటే.. బ్రాంజ్ 450 గ్రామల బరువు ఉంటుంది. ప్రస్తుతం మన భారత్‌లో ఉన్న బంగారం రేటు ప్రకారం గోల్డ్ మెడల్ దక్కించుకున్న అథ్లెట్‌కు 26 లక్షల వరకు దక్కునున్నాయ్. కానీ విజేతకు మాత్రం కేవలం 65 వేల 790 రూపాయల మాత్రమే లభించనున్నాయ్.
ఏంటీ.. 556 గ్రాముల బంగారానికి కేవలం అంతేనా దక్కేది అనుకుంటున్నారా..? అయితే, అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. గోల్డ్, సిల్వర్ మెడల్‌లో 550 గ్రాముల స్వచ్ఛమైన వెండిని ఉపయోగించారు. కాకపోతే స్వర్ణ పతకం వెండితో రూపొందించి పైన 6 గ్రాముల బంగారు పూతను పూశారు. దీంతో గోల్డ్ మెడల్ వాల్యూ కేవలం 65 వేల 790 రూపాయల మాత్రమేనట.