Tokyo Olympics 2020: మీరాబాయి చాను తరువాత ఎవరు.. పతకం తెచ్చే లిస్టులో ఎందరున్నారో తెలుసా..?

టోక్యో ఒలింపిక్స్‌ 2020లో మొదటి రోజు మహిళల 49 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను భారత దేశానికి రజత పతకం అందించి, మంచి ఆరంభం అందించింది. కానీ, ఈ ఉత్సాహాన్ని మిగతా భారత అథ్లెట్లు అందుకోలేక పోయారు.

Tokyo Olympics 2020: మీరాబాయి చాను తరువాత ఎవరు.. పతకం తెచ్చే లిస్టులో ఎందరున్నారో తెలుసా..?
Meerabai Chanu
Follow us
Venkata Chari

|

Updated on: Jul 29, 2021 | 9:28 AM

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌ 2020లో మొదటి రోజు మహిళల 49 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను భారత దేశానికి రజత పతకం అందించి, మంచి ఆరంభం అందించింది. కానీ, ఈ ఉత్సాహాన్ని మిగతా భారత అథ్లెట్లు అందుకోలేక పోయారు. మంచి ప్రదర్శన కనబరిచినా.. పతకం దక్కించుకోలేకపోయారు. ముఖ్యంగా షూటింగ్ ఈవెంట్‌లో పతకం కచ్చితంగా వస్తుందనుకున్న భారత్.. ఆశలకు గండి పడింది. మొదటి రోజు నుంచి నేటి వరకు భారత్ పతకం కోసం వేచి చూస్తూనే ఉంది. భారతదేశానికి మీరాబాయి చాను తరువాత మరో పతకం ఎవరు అందించనున్నారో చూద్దాం..

ప్రపంచ కప్ విజేతలు, అగ్రశ్రేణి షూటర్లతో భారతదేశం అతిపెద్ద షూటింగ్ బృందాన్ని ఒలింపిక్స్ బరిలో నిలిపింది. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన షూటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. షూటింగ్‌లో పతకం ఇప్పటివరకు ఖాళీగానే ఉంది. పురుషుల 10మీ. ఎయిర్ ఫిస్టల్‌లో సౌరభ్ చౌదరి మాత్రమే ఫైనల్ చేరుకున్నాడు. మను బాకర్, యషస్విని దేస్వాల్, ఎలవెనిల్ వలరివన్, దివ్యాన్ష్ పన్వర్, అభిషేక్ వర్మ, దీపక్ కుమార్, అపుర్వి చందేలా, అంజుమ్ మౌద్గిల్ లాంటి అథ్లెట్లు ఇప్పటివరకు జరిగిన పోటీల్లో పతకం సాధించలేకపోయారు. టీమ్ ఈవెంట్స్ అయిన 10 మీ. ఎయిర్ పిస్టల్, 10 మీ ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్లలో భారతదేశం తరుపున రెండు జట్లు బరిలో నిలిచాయి. కానీ, వీరి గురి పతకం చేరలేకపోయింది. పతకం పోటీల్లో నిలువలేకపోయారు. మను బాకర్ పిస్టల్ చివరి నిముషంలో పనిచేయకపోవడంపై వివాదం చెలరేగుతోంది. అయితే వ్యక్తిగత ఈవెంట్‌లో నేడు 25మీ. ఎయిర్ ఫిస్టర్ ఈవెంట్‌లో పతకం సాధిస్తుందని భారత్ ఆశపడుతుంది.

టేబుల్ టెన్నిస్‌లో మణికా బాత్రా, శరత్ కమల్ అచంతల బృందం మొదటి అడ్డంకినే దాటలేపోయింది. టీటీలో వ్యక్తిగత ఈవెంట్‌ నుంచి పతకం ఆశించిన భారత్‌కు మొండిచేయి ఎదురైంది. సథియన్ జ్ఞానశేఖరన్ మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించగా, బాత్రా, శరత్ రౌండ్ 3 వరకు చేరుకున్నారు. ఆపై వీరు సత్తా చాటలేకపోయారు. సుతీర్తా ముఖర్జీ కూడా రెండో రౌండ్‌లోనే ఇంటిబాట పట్టారు. భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ కూడా పతకం తెచ్చే లిస్టులో ఉంది. నేడు మహిళల 51 కేజీల ప్రిక్వార్టర్స్‌లో కొలంబియా బాక్సర్‌ వాలెన్సియాతో మేరీకోమ్ తలపడుతుంది. అలాగే పురుషుల 91 కేజీల విభాగం ప్రిక్వార్టర్స్‌లో బాక్సర్ సతీశ్‌ బరిలో దిగనున్నాడు. హాకీటీంలు కూడా తీవ్ర నిరాశనే మిగిలించేలా ఉన్నాయి. మహిళల హకీ టీం ఘోర పరాజయాలు పాలైంది. ఇక పురుషుల హకీ టీం నేడు అర్జెంటీనాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే క్వార్టర్స్‌ చేరే అవకాశముంది. లేదంటే పురుషుల టీం కూడా పతకం బరిలోనుంచి ఔట్ అవ్వనుంది.

బ్యాడ్మింటన్‌లో బి సాయి ప్రణీత్, డబుల్స్ జోడీ సాత్విక్ సైరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి తీవ్రంగా నిరాశ పరిచారు. ప్రస్తుతం పతకం అందించే ఆశలు పీవీ సింధు రూపంలో మిగిలి ఉన్నాయి. ప్రణీత్ తన తొలి మ్యాచ్‌లో ఇజ్రాయిల్‌కు చెందిన తన కంటే తక్కువ ర్యాంక్ కుర్రాడైన మిషా జిల్‌బర్‌మన్‌తో ఓటమి పాలై పతకం ఆశలకు గండి కొట్టాడు. రెడ్డి-శెట్టి రెండు విజయాలు సాధించినా.. పతకం పోరుకు ముందు మ్యాచ్‌లో ఓడిపోయారు. ఇక ర్యాంకింగ్ రౌండ్లలో ఆర్చర్స్ ఘోరంగా నిరాశ పరిచారు.

బ్యాడ్మింటన్ గ్రూప్ జె నుంచి టాప్ ప్లేస్‌లో నిలిచింది భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు. కరోలినా మారిన్ పాల్గొనకపోవడంతో సింధు టోక్యోలో పతకం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. రియో ఒలింపిక్స్ రజత పతకం గెలిచిన పీవీ సింధు.. టోక్యోలోనూ తన సత్తాను చాటుతున్నారు. గ్రూప్ జె రెండవ మ్యాచ్‌లో హాంకాంగ్‌కు చెందిన చెయోంగా న్గాన్‌ను వరుస సెట్లలో (21-9, 21-16) ఓడించింది. ఈ మ్యాచ్‌లో సింధు గెలవడానికి 35 నిమిషాలు పట్టింది. తొలి మ్యాచ్‌లో 21-7, 21-10తో ఇజ్రాయెల్‌కు చెందిన పోలికార్పోవా క్సేనియాను ఓడించింది. మూడవ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్‌ విజయాలతో క్వార్టర్ ఫైనల్ చేరింది.

షూటింగ్ 25 మీ పిస్టల్ రాపిడ్ / ప్రెసిషన్‌లో రూకీ మను బాకర్, వెటరన్ రాహి సర్నోబాట్‌లతో కలిసి షూటింగ్‌లో తమ ఖాతాను తెరిచేందుకు భారతదేశానికి ఇంకా అవకాశం ఉంది. బాకర్ ఇప్పటివరకు పేలవమైన ప్రదర్శన చూపించింది. ఈ ఏడాది ప్రారంభంలో న్యూ ఢిల్లీ ప్రపంచ కప్‌లో 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించింది. మరోవైపు సర్నోబాట్ క్రొయేషియాలోని ఒసిజెక్‌లో జరిగిన 2021 ISSF ప్రపంచ కప్‌లో మహిళల 25 మీ పిస్టల్‌లో స్వర్ణం సాధించింది. వీరు నుంచి కూడా పతకం రావొచ్చు.

రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 65 కిలోల విభాగంలో బజరంగ్ పునియా, మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 53 కిలోల విభాగంలో వినేష్ ఫోగాట్ కుస్తీలో పతకాలు సాధించే అవకాశం ఉంది. రియో ఒలింపిక్స్ సందర్భంగా ఫ్రీక్ గాయంతో ఫోగాట్ వీల్ చైర్లో భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. ఆమె శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం బలంగా తిరిగి వచ్చి ప్రపంచ నంబర్ వన్‌గా పోటీలోకి ప్రవేశించింది. వీరిద్దరిపై కూడా పతకం సాధిస్తారనే ఆశలు ఉన్నాయి.

బాక్సింగ్ స్క్వేర్డ్ సర్కిల్‌లో అమిత్ పంగల్ భారతదేశానికి పతకం సాధించలేకపోయాడు. సీనియర్ ప్లేయర్ మేరీ కోమ్‌పైనే పతక ఆశలు సజీవంగా ఉన్నాయి. ప్రీ-క్వార్టర్స్‌ చేరిన మేరీ కోమ్.. నేడు గెలిస్తే క్వార్టర్ ఫైనల్ చేరనుంది. ఆమె మూడో సీడ్, రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత కొలంబియాకు చెందిన ఇంగ్రిట్ వాలెన్సియాను ఢీకొనబోతోంది. ఈమ్యాచులో గెలిస్తే.. క్వార్టర్స్‌లో రెండవ సీడ్, చైనాకు చెందిన యువాన్ చాంగ్‌ను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక లోవ్లినా పతకం సాధించేందుకు కేవలం ఒక విజయం సాధించాల్సి ఉంది. జులై 30 న ఉమెన్స్ వెల్టర్ క్వార్టర్ ఫైనల్లో ఆమె ప్రపంచ మాజీ ఛాంపియన్, 4 వ సీడ్ చెన్ నీన్-చిన్‌తో తలపడనుంది.

అథ్లెటిక్స్ నీరజ్ చోప్రా ఒక పతకం కోసం అర్హత కలిగి ఉన్నాడు. ఇది సాకారమైతే అథ్లెటిక్స్‌లో భారతదేశం తరపున మొట్టమొదటి పతకం కానుంది. కరోనాతో సీజన్‌లో పోటీలు లేకపోయినప్పటికీ, టోక్యోలో తాను బాగా రాణించగలనని జాతీయ రికార్డ్ హోల్డర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో 90 మీటర్ల ప్లస్‌తో ఏడు త్రోలు విసిరాడు. అలాగే ఈ ఆటలో డిఫెండింగ్ ఛాంపియన్, జర్మనీకి చెందిన థామస్ రోహ్లెర్‌తోపాటు గాయాల కారణంగా స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగలేదు. దీంతో జావలిన్ త్రోలో పతకం రావొచ్చని తెలుస్తోంది.

ఆర్చరీ ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ ఆర్చర్‌గా దీపికా కుమారి టోక్యో ఒలింపిక్స్‌లోకి ప్రవేశించారు. కానీ, పేలవమైన ఆటతీరును కనబరించింది. మిక్స్‌డ్ ఈవెంట్‌లో ఓడిపోయింది. ప్రస్తుతం వ్యక్తిగత ఈవెంట్‌ క్వార్టర్స్‌లో టాప్ సీడ్ కొరియన్ ఆన్ శాన్‌లో తలపడనుంది. ఈ పోటీల్లో విజయం సాధిస్తే పతకం వచ్చే అవకాశం ఉంది.

హాకీ టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు గ్రూఫ్‌ మ్యాచ్‌లో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3-1 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో భారత హాకీ టీం క్వార్టర్ ఫైనల్‌కు మరింత చేరువైంది. అర్జెంటీనా తరపున కాసెల్లా స్కుత్‌ ఆట 48 వ నిమిషంలో గోల్‌ చేశాడు. తొలి భాగంలో భారత్ జట్టు వెనుకంజలో చేరింది. అనంతరం భారత జట్టు తరపున వి కుమార్‌, వీఎస్‌ ప్రసాద్‌, హర్మన్‌ప్రీత్‌సింగ్‌లు 43, 58, 59 వ నిమిషంలో గోల్స్‌ చేసి, భారత్ ఆధిక్యాన్ని పెంచేశారు. భారత జట్టు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ను జపాన్‌తో ఆడనుంది. ఇప్పటికే మూడు విజయాలు సాధించిన భారత హాకీ జట్టు క్వార్టర్స్‌కు దాదాపుగా చేరినట్లే.

Also Read: Tokyo Olympics 2020: డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై భారత్ ఘన విజయం.. క్వార్టర్ ఫైనల్‌కు చేరువలో హాకీ టీం

Tokyo Olympics 2020: హ్యాట్రిక్‌ విజయాలతో క్వార్టర్ ఫైనల్ చేరిన భారత స్టార్ షట్లర్.. డెన్మార్క్ ప్లేయర్‌పై 40 నిమిషాల్లోనే..