Telugu News Sports News Telangana Boxer Nikhat Zareen interesting comments after winning gold in CWG 2022 Telugu Sports News
Nikhat Zareen: ఇక ఎంచెక్కా ఐస్‌క్రీంతో పాటు అవన్నీ లాగించేస్తా.. గోల్డ్ గెలిచాక నిఖత్ ఏమందంటే?
Commonwealth Games 2022: తనపై ఉన్న అంచనాలు, అభిమానుల ఆశలను నిజం చేస్తూ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకంతో మెరిసింది తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zareen). ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల్లో..
Commonwealth Games 2022: తనపై ఉన్న అంచనాలు, అభిమానుల ఆశలను నిజం చేస్తూ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకంతో మెరిసింది తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zareen). ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల్లో తెలంగాణ బాక్సర్‌కు ఇదే మొదటి పతకం కావడం విశేషం. దీంతో ప్రస్తుతం నిఖత్ పేరు దేశమంతా మార్మోగిపోతోంది. ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా ఈ పసిడి పతకం కోసం అహర్నిశలు శ్రమించింది మన తెలుగు తేజం. అంతకుముందు స్ట్రాంజా మెమొరియల్‌లో 52 కేజీల ఈవెంట్‌లో పసిడి నెగ్గిన నిఖత్.. కామన్వెల్త్ కోసం రెండు కేజీలు తగ్గి 50 కిలోల విభాగంలో అదృష్టం పరీక్షించుకుంది. బరువు తగ్గడానికి ఇష్టమైన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటూ పూర్తిగా నోరు కట్టేసుకుంది.
అందుకే బర్మింగ్‌హామ్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న వెంటనే అక్కడున్న ఓ వ్యక్తిని ఐస్‌క్రీమ్ అడిగిందట. దీన్ని బట్టే చెప్పవచ్చు కామన్వెల్త్ కోసం నిఖత్ ఎంత కష్టపడిందో. ఎందుకంటే కామన్వెల్త్ క్రీడల్లో బరువు తగ్గించుకోవాల్సి రావడంతో ఐస్‌క్రీం తినాలనే కోరికను పూర్తిగా విరమించుకుంది జరీన్. అయితే ఇప్పుడు తన లక్ష్యం నెరవేడంతో తనకు ఇష్టమైన ఐస్‌క్రీంతో పాటు నిజామాబాద్‌లోని తీపి రుచులన్నీ ఆస్వాదిస్తానంటోందీ గోల్డెన్ గర్ల్. కాగా ఇప్పుడు ఆమె లక్ష్యమంతా 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్. అక్కడ బంగారు పతకం గెలవడం పైనే తన దృష్టి ఉంచుతానంటోంది. కాగా నిఖత్ తన తల్లి పుట్టినరోజున ఆమెతో ఉండాలనుకున్నా కామన్వెల్త్ గేమ్స్‌తో కుదరలేదు. అయితే ఇప్పుడు తను గెలిచిన గోల్డ్ మెడల్‌ని బహుమతిగా ఇవ్వడం ద్వారా ఆ లోటును భర్తీ చేస్తానంటోంది.