AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : గత ఐదేళ్ల నీ టెస్ట్ రికార్డు చూసుకో.. కోహ్లీ, గంభీర్ మధ్య కోల్డ్ వార్ నిజమేనా?

Virat Kohli : విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు ఉన్నాయని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ టెస్ట్ రికార్డులను కూడా ఆయన తప్పుబట్టారు. కోహ్లీ టీమిండియా మేనేజ్‌మెంట్‌తో విభేదిస్తున్నాడని మంజ్రేకర్ ఓపెన్‌గా హింట్ ఇచ్చారు.

Virat Kohli : గత ఐదేళ్ల నీ టెస్ట్ రికార్డు చూసుకో..  కోహ్లీ, గంభీర్ మధ్య కోల్డ్ వార్ నిజమేనా?
Virat Kohli
Rakesh
|

Updated on: May 20, 2026 | 11:44 AM

Share

Virat Kohli : టీమిండియా రన్ మెషీన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి, ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ల కూటమికి మధ్య మంచి సంబంధాలు లేవనే వార్తలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో దావానంలా వ్యాపిస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఓటమి పాలైన తర్వాత కోహ్లీ హఠాత్తుగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ప్రముఖ విశ్లేషకుడు సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కోహ్లీ టీమిండియా మేనేజ్‌మెంట్‌తో విభేదిస్తున్నాడని మంజ్రేకర్ ఓపెన్‌గా హింట్ ఇచ్చారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. తాను భారత్ తరఫున ఆడిన ప్రతిసారీ ఏదో ఒక విషయాన్ని నిరూపించుకోవాల్సి రావడంపై తీవ్ర అసంతృప్తి మరియు నిరాశను వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన సంజయ్ మంజ్రేకర్, కోహ్లీ ఉద్దేశించిన ఆ ప్రతికూల వాతావరణం మరేదో కాదు.. అది కోచ్ గంభీర్, సెలెక్టర్ అగార్కర్ల వైఖరేనని కుండబద్దలు కొట్టారు. “ఈ విషయంలో నేనే విలన్‌గా మారి నిజాలు మాట్లాడతాను. రవిశాస్త్రి కోచ్‌గా, విరాట్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు వాతావరణం వేరుగా ఉండేది. శాస్త్రి కోహ్లీని గుడ్డిగా సమర్థిస్తూ, వెన్నుతట్టి ప్రోత్సహించేవాడు. కానీ రాహుల్ ద్రవిడ్ వెళ్ళిపోయి, గౌతమ్ గంభీర్ కోచ్‌గా వచ్చాక సీన్ మారింది. అటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. భారత క్రికెట్ భవిష్యత్తుపై ఆయనకు స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయి. అందుకే కోహ్లీ ఇక్కడ మునుపటిలా కంఫర్టబుల్‌గా లేడు” అని మంజ్రేకర్ విశ్లేషించారు.

కెరీర్ చివరి దశకు వచ్చేసరికి చాలా మంది ఆటగాళ్లు తమ అంతర్గత లోపాలను దాచి, బయటి వాతావరణాన్ని నిందించడం అలవాటు చేసుకుంటారని మంజ్రేకర్ కోహ్లీపై నేరుగా విమర్శలు గుప్పించారు. “విరాట్.. నువ్వు చుట్టూ ఉన్న వాతావరణాన్ని, నిన్ను ఎవరు జట్టులో ఉంచాలనుకుంటున్నారు, ఎవరు తీసేయాలనుకుంటున్నారు అనే విషయాలను పక్కన పెట్టు. ఒక్కసారి గత ఐదేళ్ల నీ టెస్ట్ క్రికెట్ రికార్డులను తీసి చూసుకో. టెస్ట్ ఫార్మాట్‌లో కేవలం 31 సగటు ఉన్న ప్లేయర్‌కు జట్టులో కొనసాగే అర్హత ఉందా? అయినా సరే, నీకున్న ఇమేజ్ కారణంగా భారత క్రికెట్ చరిత్రలోనే నీకు అత్యంత సుదీర్ఘమైన అవకాశాలు ఇచ్చారు” అంటూ మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆస్ట్రేలియా గడ్డపై ఘోర పరాజయం తర్వాత కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకోవడంతో కోచ్ గంభీర్‌తో ఉన్న పాత గొడవలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అయితే సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగబోయే రాబోయే వన్డే ప్రపంచ కప్‌లో కోహ్లీ ఆడతాడా లేదా అనే దానిపై కూడా ఇప్పుడు తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. మేనేజ్‌మెంట్‌తో సత్సంబంధాలు లేకపోతే కోహ్లీ వన్డే కెరీర్ కూడా త్వరలోనే ముగిసే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ టాక్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us