Paralympics 2024: రజతం గెలిచిన భారత అథ్లెట్.. కట్‌చేస్తే.. బంగారు పతకం అందించిన పారాలింపిక్ కమిటీ
Indian Medals In Paralympics: నవదీప్, సిమ్రాన్‌ల పతకాలతో పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 29కి చేరుకుంది. ఇది టోక్యోలో జరిగిన గత పారాలింపిక్స్ కంటే 10 ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు భారత్ 7 బంగారు పతకాలు, 13 కాంస్య పతకాలు, 9 రజత పతకాలు సాధించింది.
Indian Medals In Paralympics: పారిస్ పారాలింపిక్ గేమ్స్ 2024లో భారత్ పతకాలు సాధిస్తూనే ఉంది. ఈ గేమ్స్ ముగిసేందుకు ఒకరోజు ముందు సెప్టెంబర్ 7వ తేదీ శనివారం భారత్‌కు 1 స్వర్ణం సహా మరో 2 పతకాలు వచ్చాయి. రెండు పతకాలు అథ్లెటిక్స్‌లో వచ్చాయి. ఇందులో బంగారు పతకాన్ని గెలుచుకున్న జావెలిన్ త్రోయర్ నవదీప్‌కు అతిపెద్ద విజయం లభించింది. పురుషుల జావెలిన్ త్రో F41 విభాగంలో నవదీప్ సింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అయితే, స్వర్ణం గెలిచిన ఇరాన్ అథ్లెట్ ఈవెంట్ తర్వాత అనర్హుడయ్యాడు. నవదీప్ సింగ్ రజతాన్ని స్వర్ణానికి అప్‌గ్రేడ్ చేశాడు. కాగా, మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో స్ప్రింటర్ సిమ్రాన్ శర్మ ఫైనల్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో భారత్ పతకాల సంఖ్య 29కి చేరుకుంది. ఇది గత పారాలింపిక్స్ కంటే 10 ఎక్కువగా వచ్చాయి.
సెప్టెంబరు 8 ఆదివారంతో ముగియనున్న పారిస్ గేమ్స్.. దానికి ఒకరోజు ముందు కూడా భారత అథ్లెట్ల బలం కనిపించింది. స్విమ్మింగ్, సైక్లింగ్, కానోయింగ్‌లో భారత్ నిరాశను ఎదుర్కొంది. అయితే, అథ్లెటిక్స్‌లో మరోసారి భారత ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శన కనిపించింది. అదే స్టేడియంలో ఓ వైపు నవదీప్ సింగ్ జావెలిన్ త్రోలో పతకం వైపు దూసుకెళ్తుండగా, మరోవైపు రేసింగ్ ట్రాక్ పై తన స్పీడుతో సిమ్రాన్ దూసుకెళ్లింది. యాదృచ్ఛికంగా వీరిద్దరి పతకాలు కూడా దాదాపు ఒకే సమయంలో రావడం గమనార్హం.
నవదీప్ రజతం స్వర్ణంగా మార్పు..
జావెలిన్ త్రోలో, నవదీప్ తన రెండవ త్రోలో 46.39 మీటర్లతో ముందంజలో ఉన్నాడు. అయితే, ఇరాన్‌కు చెందిన సదేగ్ బెట్ సయా 46.84 మీటర్లతో అతని నుంచి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తర్వాతి త్రోలో పునరాగమనం చేసిన నవదీప్ మళ్లీ 47.32 మీటర్లతో మొదటి స్థానానికి చేరుకున్నాడు. నాలుగో త్రోలో కూడా ఎవరూ అతన్ని అధిగమించలేకపోయారు. కానీ, ఐదో త్రోలో ఇరాన్ అథ్లెట్ మళ్లీ 47.64 మీటర్లు విసిరి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. చివరికి స్వర్ణం, నవదీప్ రజత పతకం సాధించాడు. అయితే, కొద్దిసేపటికే పారాలింపిక్ కమిటీ ఈ ఫలితాన్ని మార్చింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఇరాన్ అథ్లెట్‌ను దోషిగా గుర్తించి, అతనిని అనర్హులుగా ప్రకటించింది.
PTI నివేదిక ప్రకారం, సయాహ్ పదేపదే అభ్యంతరకరమైన జెండాను ప్రదర్శించినందుకు అనర్హుడిగా పేర్కొన్నారు. ఇది ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు పరిగణిస్తున్నారు. పారాలింపిక్స్ నిబంధనలకు విరుద్ధమైన ఈ జెండాతో సయాహ్ రాజకీయ సందేశాన్ని పంపాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. సయాహ్ ఇలా చేయడంతో, అతని ఫలితం రద్దు చేశారు. దీంతో నవదీప్ బంగారు పతక విజేతగా ప్రకటించారు. కాంస్యం నెగ్గిన చైనాకు చెందిన పెంగ్జియాంగ్‌కు రజతం, నాలుగో స్థానంలో నిలిచిన ఇరాక్‌కు చెందిన నుఖైలావి వైల్డెన్‌కు కాంస్యం దక్కింది.
100 మీటర్లలో నిరాశ, 200 మీటర్లలో మెరిసిన సిమ్రాన్..
మరోవైపు పారిస్ పారాలింపిక్స్‌లో పతకం సాధించాలనే కోరికను సిమ్రాన్ ఎట్టకేలకు తీర్చుకుంది. రెండు రోజుల క్రితమే 100 మీటర్ల ఫైనల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చి నాలుగో స్థానంలో నిలిచింది. ఈసారి ఆ లోటును కూడా భర్తీ చేసింది. సిమ్రాన్ తన గైడ్ అభయ్ సింగ్‌తో కలిసి 200 మీటర్ల రేసును 24.75 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్‌లో క్యూబాకు చెందిన ఒమారా డురాండ్ (23.62 సెకన్లు) స్వర్ణం, వెనిజులాకు చెందిన అలెజాండ్రా పెరెజ్ (24.19) రజతం గెలుచుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..