Milkha Singh: మిల్కా సింగ్‌ను ‘ఫ్లయింగ్ సిక్కు’ అని ఎందుకు పిలుస్తారో తెలుసా..? కారణం ఇదే..!

నాలుగుసార్లు ఆసియా ఛాంపియన్ సాధించిన ప్రఖ్యాత అథ్లెట్ మిల్కా సింగ్ శుక్రవారం రాత్రి చండీగఢ్‌లో మరణించారు. కోవిడ్‌ బారిన పడి కోలుకున్న ఆయన.. మరలా ఆరోగ్యం క్షీణించడంతో చనిపోయారు. అయితే మిల్కా సింగ్‌ ను 'ఫ్లయింగ్ సిక్కు' అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

Milkha Singh: మిల్కా సింగ్‌ను 'ఫ్లయింగ్ సిక్కు' అని ఎందుకు పిలుస్తారో తెలుసా..? కారణం ఇదే..!
Milkha Singh
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Jul 05, 2021 | 5:51 PM

Milkha Singh: భారత అథ్లెటిక్స్ లెజెండ్ మిల్కా సింగ్ కోవిడ్ -19 అనంతర పరి‎ణామాలతో శుక్రవారం రాత్రి ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన భార్య నిర్మల్ సింగ్ సైనీ కూడా గత ఆదివారం కరోనా వైరస్ బారిన పడ్డారు. క్రీడలలో భారతదేశానికి తొలి సూపర్ స్టార్లలో మిల్కా సింగ్ కచ్చితంగా ఒకరు. భారతదేశాన్ని రెండుగా విభజించిన సమయంలో పాకిస్తాన్ నుంచి వలస వచ్చారు మిల్కాసింగ్. అనంతరం భారత సైన్యంలో చేరాడు. ఆర్మీ తరుపునుంచే అథ్లెటిక్స్‌లో పోటీ చేసి, స్టార్ ప్లేయర్‌గా ఎదిగారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు ఆయన. అయితే, నాలుగుసార్లు ఆసియా ఛాంపియన్ గా నిలిచిన మిల్కా సింగ్‌కు ‘ఫ్లయింగ్ సిక్కు’ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

మిల్కా సింగ్ 1956 మెల్బోర్న్ గేమ్స్‌లో మొట్టమొదటి సారి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ టైంలో ఆయన ఎన్నో అనుభవాలను చవిచూశాడు. అలాగే 1958 వ సంవత్సరం ఆయన జీవితం ఎంతో మలుపు తిరిగింది. జాతీయ క్రీడలలో 200 మీ, 400 మీటర్ల స్ప్రింట్లలో రికార్డులు సృష్టించాడు. అదే సంవత్సరం టోక్యోలో జరిగిన ఆసియా క్రీడలలో 200 మీ, 400 మీటర్లలో ఆసియా ఛాంపియన్‌గా నిలిచాడు. అలాగే కార్డిఫ్‌లో జరిగిన 1958 కామన్వెల్త్ క్రీడలలో మిల్కా సింగ్ బంగారు పతకం సాధించాడు.

దీంతో మిల్కా సింగ్ జాతీయ హీరోగా మారిపోయాడు. కానీ, ఫ్లయింగ్ సిక్కు అనే బిరుదు మాత్రం 1960వ సంవత్సరంలో వచ్చింది. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ లాహోర్లో జరిగిన ఇండో-పాక్ క్రీడా సమావేశానికి భారత అథ్లెట్లను ఆహ్వానించారు. మిల్కా సింగ్ పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ, అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పట్టుబట్టడంతో భారత దళానికి నాయకుడిగా పాకిస్తాన్ వెళ్లారు.

లాహోర్‌లో, 200 మీటర్ల స్ప్రింట్‌లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆటగాడిగా పేరుగాంచిన పాకిస్థాన్‌కు చెందిన అబ్దుల్ ఖలీక్‌పై మిల్కా సింగ్ తలపడాల్సి వచ్చింది. పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం అంటే సింగ్‌కు నచ్చేది కాదు. దీంతో ఆయనపై చాలా ఒత్తిడి ఉంది. కానీ రేసు రోజున, ఖలీక్‌ను సులభంగా ఓడించాడు మిల్కాసింగ్. ఒత్తిడిని దరిచేరనీయకుండా పట్టుదలతో ఆడాడు. పతాక వేడుకల్లో అయూబ్ ఖాన్.. మిల్కా సింగ్ ను ‘ఫ్లయింగ్ సిక్కు’గా మారుపేరు పెట్టాడు.

ఫ్లయింగ్ సిక్కు ఫ్లయింగ్ సిక్కుగా పేరు గాంచిన మిల్కా సింగ్, ఆసియా క్రీడలతో పాటు కామన్వెల్త్ క్రీడల్లోనూ 400 మీటర్ల రేసులో బంగారు పతకం సాధించిన ఏకైక భారత అథ్లెట్. 1958 టోక్యో ఆసియా క్రీడల్లో 200 మీటర్లు, 400 మీటర్లలో మిల్ఖా సింగ్ బంగారు పతకాలు సాధించారు. అలాగే 1962 జకార్తా ఆసియా క్రీడల్లో 400 మీటర్లలో, 4 X 400 మీటర్ల రిలే రేసుల్లోనూ స్వర్ణ పతకాలు గెలిచారు. ఇక 1958 కార్డిఫ్ కామన్వెల్త్ క్రీడల్లో 440 యార్డ్ రేసులోనూ బంగారు పతకాన్న గెలిచారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల రేసులో కాంస్య పతకాన్ని స్వల్ప తేడాతో గెలుచుకోలేకపోయాడు. రోమ్ ఒలింపిక్స్‌లో మిల్కా సింగ్ 400 మీటర్ల రేసును 45.73 సెకన్లలో పూర్తి చేశారు. జర్మన్ అథ్లెట్ కార్ల్ కౌఫ్మన్ కన్నా సెకెండులో వందో వంతు వెనుకబడ్డారు. కానీ, ఈ టైమింగ్ మరో 40 సంవత్సరాల వరకు నేషనల్ రికార్డుగా నిలిచింది.

Also Read:

Milka Singh : ‘భాగ్ మిల్కా భాగ్’ కోసం మిల్కా సింగ్ ఒప్పుకోలేదట..! చివరికి ఆ వ్యక్తి ఒత్తిడి వల్ల ఓకే అన్నాడట..

PM Narendra Modi : మిల్కా సింగ్ మృతిపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. దేశం గొప్ప క్రీడాకారుడిని కోల్పోయిందని వ్యాఖ్య..

Milkha Singh : 80 రేసుల్లో 77 గెలిచిన మిల్కాసింగ్.. కానీ ఒలంపిక్ కల మాత్రం అలాగే మిగిలిపోయింది..