Khelo India University Games 2022: రేపటి నుంచే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్.. పూర్తి వివరాలు ఇదిగో..
ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ (KIUG) మరోసారి సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. 2021లో జరగాల్సిన ఈ ఈవెంట్ కోవిడ్-19 కారణంగా ఆలస్యమైంది. చివరకు బెంగళూరులో నిర్వహించనున్నా
ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ (KIUG) మరోసారి సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. 2021లో జరగాల్సిన ఈ ఈవెంట్ కోవిడ్-19 కారణంగా ఆలస్యమైంది. చివరకు బెంగళూరులో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 24 నుంచి మే 3 వరకు బెంగళూరులో జరిగే ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్‌లో స్టార్ షూటర్ మను భాకర్, స్ప్రింట్ క్వీన్ ద్యుతీ చంద్, స్విమ్మర్ శ్రీహరి నటరాజ్‌తో సహా పలువురు ఒలింపియన్లు పాల్గొననున్నారు. పర్యావరణాన్ని ప్రోత్సహించే అంశంపై ‘గ్రీన్ గేమ్స్’గా నిర్వహించనున్న ఈ గేమ్‌లలో యోగాసన్, మల్కాంబ్ అనే రెండు దేశీయ ఆటలు ప్రారంభమవుతాయి. ఈ ఈవెంట్‌లో 20 విభాగాలు ఉంటాయి. 257 బంగారు పతకాలు సాధించేందుకు వీలుంది. విలువిద్య, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, ఫీల్డ్ హాకీ, జూడో, కబడ్డీ, షూటింగ్, స్విమ్మింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, కరాటే, యోగా, మల్కాంబ్ లాంటి క్రీడలకు చోటు దక్కింది.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి..
దాదాపు రూ.35 కోట్లతో నిర్వహిస్తున్న ఈ క్రీడల ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొననున్నారు. ముగింపు కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) క్రీడల సందర్భంగా ఆటగాళ్లకు డోపింగ్‌పై అవగాహన కల్పిస్తుంది.
హరిత క్రీడల నేపథ్యంలో..
కర్నాటక రాష్ట్రం ఈ గేమ్‌లను ‘గ్రీన్ స్పోర్ట్స్’గా మార్చడానికి పర్యావరణ అనుకూల వ్యవస్థను అమలుచేయనుంది. దీని కింద ‘జీరో వేస్ట్’, ‘జీరో ప్లాస్టిక్’ ను ఉపయోగించనున్నారు. ఈ గేమ్‌ల మొదటి సీజన్ ఫిబ్రవరి 2020లో భువనేశ్వర్‌లో జరిగింది. ఇందులో 158 విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి 3182 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పంజాబ్ 17 బంగారు పతకాలతో 46 పతకాలతో ఛాంపియన్‌గా నిలిచింది.
ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ 2022 ఈవెంట్ గురించి పూర్తి వివరాలు:
ఎప్పటి నుంచి ప్రారంభం?
ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఏప్రిల్ 24 నుంచి మే 3 వరకు జరగనున్నాయి.
KIUGలో ఏ క్రీడలకు చోటుంది?
ఈ ఈవెంట్‌లో 20 విభాగాలు ఉంటాయి. 257 బంగారు పతకాలు సాధించేందుకు వీలుంది. విలువిద్య, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, ఫీల్డ్ హాకీ, జూడో, కబడ్డీ, షూటింగ్, స్విమ్మింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, కరాటే, యోగా, మల్కాంబ్ లాంటి క్రీడలకు చోటు దక్కింది.
ఆటలు ఎక్కడ నిర్వహిస్తున్నారు?
బెంగళూరులోని ఐదు వేదికలు KIUG 2022 కోసం కేటాయించారు. జైన్ గ్లోబల్ యూనివర్సిటీ క్యాంపస్, జైన్ స్పోర్ట్స్ స్కూల్, కంఠీరవ స్టేడియం, ఫీల్డ్ మార్షల్ కరియప్ప హాకీ స్టేడియం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఈ గేమ్స్ జరగనున్నాయి.
KIUG నిర్వహణకు ఎంత ఖర్చు చేస్తున్నారు?
క్రీడల కోసం మొత్తం రూ.52 కోట్లు ఖర్చు చేయనున్నారు. రూ.35 కోట్లను క్రీడా మంత్రిత్వ శాఖ భరిస్తుందని సమాచారం.
ఎంత మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు?
క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలోని 189 విశ్వవిద్యాలయాల నుంచి 4,529 మంది అథ్లెట్లు ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. అలాగే అథ్లెట్ల కోసం 3,500 గదులు, 1,500 ఆర్ట్ ఆఫ్ లివింగ్ గదులు కేటాయించారు.
KIUG 22 ఎందుకంత ప్రాముఖ్యత?
KIUG ’22 జూన్ 26 నుంచి చైనాలోని చెంగ్డూలో జరగనున్న వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్‌కు క్వాలిఫైయర్‌గా పనిచేస్తుంది. KIUG ’22 ఒక మొబైల్ అప్లికేషన్‌ను సిద్ధం చేశారు. ఇందులో అన్ని వివరాలు అందించారు.
టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు ఎన్ని ఎడిషన్లు జరిగాయి?
ఇప్పటి వరకు ఒక్కటే సీజన్ జరిగింది. ఖేలో యూనివర్శిటీ గేమ్స్ 2020లో ప్రారంభించారు. 2021 ఎడిషన్‌కు కోవిడ్-19 ఆటంకం కలిగింది. ప్రస్తుతం రెండో సీజన్ జరుగుతోంది.
మునుపటి ఎడిషన్‌ను ఎవరు గెలుచుకున్నారు?
17 స్వర్ణాలు, 19 రజతాలు, 10 కాంస్యాలతో 46 పతకాలతో 2020లో ఖేలో యూనివర్శిటీ గేమ్స్ టైటిల్‌ను పంజాబ్ యూనివర్సిటీ గెలుచుకుంది. సావిత్రీబాయి ఫూలే పూణే యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీలు వరుసగా 2వ, 3వ స్థానాల్లో నిలిచాయి.
ఈ గేమ్స్‌ను ఎక్కడ చూడొచ్చు?
ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ 2022ను ఆల్ ఇండియా రేడియోలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దూరదర్శన్ ఛానల్‌లో ఈ టోర్నమెంట్ ఈవెంట్‌లను కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
Also Read: Watch Video: విరాట్ కోహ్లీకి ఏమైంది? వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గోల్డెన్ డక్..
RCB vs SRH Live Score, IPL 2022: మొదలైన హైదరాబాద్ బ్యాటింగ్.. టార్గెట్ 69..