Viral Wedding: పెళ్లిలో ఫిఫా సందడి.. వెరైటీగా అభిమానం చాటుకున్న కేరళ నూతన జంట.. ఫిదా అవుతోన్న నెటిజన్లు..
Fifa World Cup 2022: అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు ప్రపంచం సిద్ధమైన తరుణంలో, కేరళలోని ఒక జంట మాత్రం అభిమానాన్ని వెరైటీగా చాటుకున్నారు.
France vs Argentina: ఫిఫా ప్రపంచ కప్ 2022లో సందడి ముగిసింది. ఎట్టకేలకు ఫైనల్లో ఫ్రాన్స్‌తో తలపడిన అర్జెంటీనా జట్టు విజయం సాధించి, మూడో సారి ట్రోఫీని దక్కించుకుంది. అయితే, క్రికెట్ అంటే ఎక్కువ ఆసక్తి చూపించే భారత్‌లో.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రమైన కేరళలో మాత్రం ఫుట్‌బాల్ క్రేజ్ మాములుగా ఉండదు. ఫుట్ బాల్ అభిమానులు ఎప్పుడూ తమ ఇష్టమైన క్రీడపై ఎన్నో రకాలుగా తమ అభిమానాన్ని చూపిస్తుంటారు.
కాగా, ఆదివారం జరిగిన అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్‌ల మ్యాచ్ కోసం తాత్కాలిక స్క్రీన్‌లను ఏర్పాటు చేసి, జెండాలను రెపరెపలాడిస్తూ ఫైనల్‌ను చూస్తూ కేరళ ఫ్యాన్స్ సందడి చేశారు. అయితే, ఇదే సమయంలో ఫుట్‌బాల్ ఫ్యాన్ అయిన ఓ పెళ్లి జంట తమ అభిమానాన్ని వెరైటీగా చూపించింది. ఫైనలిస్టుల ఫుట్‌బాల్ జెర్సీలను ధరించి పెళ్లి పీటలు ఎక్కారు. దీంతో వీరి ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ జంటే సచిన్.ఆర్, ఆర్.అథిరాలు.
ఓ నివేదిక ప్రకారం, సచిన్ అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీకి వీరాభిమాని కాగా, అథిరా ఫ్రెంచ్ ఫుట్‌బాల్ జట్టుకు మద్దతుదారు. ఈ క్రమంలోనే ఈ జంట ఆయా టీంల జెర్సీలను ధరించి, పెళ్లి పీటలు ఎక్కారు. దీంతో ఈ జంట ధరించిన జెర్సీలే పెళ్లి దుస్తులుగా మారాయి. ఈ ఫొటోలను నెట్టింట్లో షేర్ చేయగానే, విపరీతంగా వైరల్ అయ్యాయి.
ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత సంచలనాత్మక ఫైనల్స్‌లో ఖతార్‌లోని లుసైల్ స్టేడియంలో ఇరు జట్లు తలపడటానికి కొన్ని గంటల ముందు కొచ్చిలో జరిగిన వేడుకలో ఈ జంట వివాహం జరిగింది.
వీరిద్దరూ 10వ నంబర్ జెర్సీని ధరించి, వేదికపైకి చేరారు. పెళ్లి కూతరు అథిరా ఫ్రెంచ్ ఫార్వర్డ్ కైలియన్ ఎంబాప్పే జెర్సీ ధరించగా, పెళ్లి కుమారుడు సచిన్ అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీ జెర్సీ ధరించాడు. ఇక పెళ్లి తంతు ముగిసిన తర్వాత, ఫైనల్ పోరును చూసేందుకు పోటీపడ్డారంట.
ఫైనల్‌లో అర్జెంటీనా 4-2తో పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించింది. తన చివరి ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు మెస్సీకి అవకాశం లభించింది. మెస్సీకి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న దక్షిణాది రాష్ట్రం, ఆదివారం రాత్రి నుంచి అర్జెంటీనా విజయాన్ని భారీగానే సెలబ్రేట్ చేసుకుంది. అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా బాణాసంచా కాల్చి, అర్జెంటీనా జెండాలను రెపరెపలాడించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..