NatWest Trophy 2002: నాట్‌వెస్ట్ సిరీస్‌లో ఆసక్తికర సన్నివేశం.. ఇప్పుడు రివీల్ చేసిన క్రికెట్ గాడ్..!

NatWest Trophy 2002: 20 ఏళ్ల క్రితం భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన నాట్‌వెస్ట్‌ సిరీసు ఫైనల్‌ గుర్తుందా. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్‌..

NatWest Trophy 2002: నాట్‌వెస్ట్ సిరీస్‌లో ఆసక్తికర సన్నివేశం.. ఇప్పుడు రివీల్ చేసిన క్రికెట్ గాడ్..!
Sachin Tendulkar
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 14, 2022 | 7:06 PM

NatWest Trophy 2002: 20 ఏళ్ల క్రితం భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన నాట్‌వెస్ట్‌ సిరీసు ఫైనల్‌ గుర్తుందా. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్‌ క్రికెట్ ప్రేమికులతోపాటు కెప్టెన్ గంగూలీకి కూడా ఎంతో సంతోషాన్ని అందించింది. విజయంతో ఉప్పొంగిపోయిన దాదా లార్డ్స్ స్టేడియంలో చొక్కా విప్పి తన ఆనందాన్ని ప్రదర్శించాడు. ఈ ఘటన ఇప్పటికీ దాదా అభిమానుల మదిలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్‌‌కు సంబంధించి దాదా తన టీ షర్ట్ విప్పి సంతోషం వ్యక్తం చేయడం మాత్రమే అందరికీ తెలుసు. అయితే, దాంతో పాటు మరో ఆసక్తికర సన్నివేశం కూడా చోటు చేసుకుందని తాజాగా టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వెల్లడించారు. నాటి పైనల్ మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటూ ఆయన ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతకూ ఆయన రివీల్ చేసిన విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆ మ్యాచ్‌లో 326 పరుగుల లక్ష్య చేధనకు దిగిన టీమిండియా 146 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆనాటి యువ ఆటగాళ్లు యూవీ, కైఫ్ అద్భుతంగా ఆడి మంచి భాగస్వామ్యంతో మ్యాచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మలచడంతో రికార్డు నెలకొల్పారు.

అసలు విషయానికి వస్తే.. లార్డ్స్‌ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ మొదట బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్లు కొల్పోయి 325 పరుగులు చేసింది. అనంతరం 326 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు వీరేంద్ర సెహ్వాగ్‌ (45; 49 బంతుల్లో 7×4), సౌరవ్‌ గంగూలీ (60; 43 బంతుల్లో 10×4, 1×6) మంచి ఆరంభాన్ని అందించారు. వీరు పెవిలియన్ చేరిన తరువాత దినేశ్‌ మోంగియా (9), సచిన్‌ (14), ద్రవిడ్‌ (5) వికెట్లు వెంట వెంటనే కోల్పోయారు. 146/5 తో ఇబ్బందుల్లో కూరుకపోయింది జట్టు. ఇక టీమిండియా గెలవడం చాలా కష్టమనుకున్నారు. కానీ, యంగ్ బ్యాట్స్‌మెన్స్ యువరాజ్‌ సింగ్‌ (69; 63 బంతుల్లో 9×4, 2×6), మహ్మద్‌ కైఫ్‌ (87 నాటౌట్; 75 బంతుల్లో 6×4, 2×6), హర్భజన్ 13 బంతుల్లో 15 పరుగులు చేసి టీమిండియాకు అద్భుతమైన విజయం అందించారు. మరో 3 బంతులు మిగిలుండగానే 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది టీమిండియా. దాంతో గంగూలీ ఆనందంతో చొక్కా విప్పి గిరగిరా తిప్పుతూ హల్‌చల్ చేశాడు.

డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏం జరిగిందంటే.. అయితే, ఇదంతా బయటకు కనిపించిన దృశ్యాలు మాత్రమే. డ్రెస్సింగ్ రూమ్‌లో మరో సీన్ చోటు చేసుకుంది. యువరాజ్ సింగ్, కైఫ్ మధ్య భాగస్వామ్యం అద్భుతంగా ఉంది. వీరి భాగస్వామ్యం గురించే డ్రెస్సింగ్‌ రూమ్‌లో తీవ్రమైన చర్చ జరిగింది. జట్టులోని ప్రతి సభ్యులు వారు ఔట్ అవ్వొద్దని గట్టిగా కోరుకున్నారట. “25వ ఓవర్ ముగిసే సమయానికి, మేము ఐదు వికెట్లు కోల్పోయాము. మేజర్ వికెట్లు పడిపొవడంతో నిరాశకు గురయ్యాం. ఇక క్రీజులో బ్యాటింగ్ చేసిన ఇద్దరూ యువకులే. యువీ తన కెరీర్‌ను కేవలం 2 లేదా 2.5 సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. కైఫ్ అప్పుడే జట్టులోకి ప్రవేశించాడు” అని టెండూల్కర్ చెప్పారు.

‘‘కానీ, వారు విజృభించిన విధానం ఎంతో ఆకట్టుకుంది. వారిద్దరూ జట్టు స్కోరును అమాంతం పెంచేశారు. బౌండరీలతో విరుచుకుపడ్డారు. డ్రెస్సింగ్ రూమ్ నుండి సందేశాలు పంపుతూనే ఉన్నాం. మేము సైగలతో కమ్యూనికేషన్‌లో ఉన్నాము. యువీ బ్యాటింగ్ చేసినప్పుడు.. కైఫ్ అద్భుతంగా సహాయక పాత్రను పోషించాడు. యువీ అవుట్ అయినప్పుడు, కైఫ్ బాధ్యతలు స్వీకరించాడు. గేమ్‌ను చివరి వరకు తీసుకెళ్లాడు. ఇది ఎంతో ఉత్కంఠను రేపిన ముగింపు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎవరి ప్రదేశాలలో వారే ఉండాలని, ఎవరూ కదలకూడదని నిర్ణయించుకున్నాం. అందరికీ అదే విషయాన్ని చెప్పాను.’’ అని వివరించారు.

మరో ట్విస్ట్ కూడా.. ‘‘దాదా తన జెర్సీని తీసేశాడు. ఇది అందరికీ తెలుసు. అయితే ఎవరికీ తెలియని మరో కథ కూడా ఉంది. ఆట ముగిసిన తర్వాత యువీ, కైఫ్ నన్ను కలవడానికి వచ్చారు, ‘పాజీ, మా ఆటతీరు బాగుందా?, ఇంతకంటే మెరుగ్గా రాణించాలంటే మనం ఏం చేయాలి?’ అని అడిగారు. దానికి నేను.. ‘మీరు మా కోసం టోర్నమెంట్ గెలిచారు! మీరు ఇంకా ఏం ఏం చేయాలనుకుంటున్నారు? మీ ఆటతీరును ఇలాగే కొనసాగించండి.’ అని చెప్పారు. భారత క్రికెట్ బాగుంటుంది. వారు మమ్మల్ని ఏమాత్రం నిరాశపరచలేదు.’’ అని సచిన్ టెండూల్కర్ తన వీడియోలో చెప్పుకొచ్చారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..