AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 1st ODI : భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వన్డే సిరీస్‎కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. బుమ్రా రీ ఎంట్రీ.. మ్యాచ్ ఎప్పుడు? ఏ టైంకి ?

IND vs ENG 1st ODI : టీ20 సిరీస్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీతో తొలి వన్డేపై ఆసక్తి పెరిగింది. మ్యాచ్ సమయం, లైవ్ ప్రసార వివరాలు తెలుసుకుందాం.

IND vs ENG 1st ODI : భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వన్డే సిరీస్‎కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. బుమ్రా రీ ఎంట్రీ.. మ్యాచ్ ఎప్పుడు? ఏ టైంకి ?
Ind Vs Eng 1st Odi
Rakesh
|

Updated on: Jul 12, 2026 | 3:50 PM

Share

IND vs ENG 1st ODI : ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా వన్డే ఫార్మాట్‌లో ప్రతీకారం తీర్చుకోవడానికి కసితో సిద్ధమవుతోంది. టీ20ల్లో క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్‌కు వన్డేల్లో అంత సులువు కాదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే భారత జట్టులోని ఇద్దరు దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే సిరీస్ కోసం జట్టులోకి తిరిగి రానున్నారు. వీరితో పాటు చాలా రోజులుగా విరామం తీసుకుంటున్న స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా బౌలింగ్ విభాగాన్ని నడిపించడానికి సిద్ధమయ్యాడు. దీంతో టీ20 సిరీస్ ఓటమికి వన్డేల్లో టీమిండియా గట్టి సమాధానం ఇస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

సరికొత్త వ్యూహాలతో వన్డే వేట

ఈ వన్డే సిరీస్‌కు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. టీ20 జట్టుతో పోలిస్తే వన్డే జట్టులో ఏకంగా ఏడుగురు కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రాకతో భారత బ్యాటింగ్ లైనప్ ఎంతో బలంగా మారింది. వీరితో పాటు యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ కూడా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అరంగేట్రం చేసిన గుర్నూర్ బ్రార్ 3 మ్యాచుల్లో 7 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. బుమ్రా, గుర్నూర్ రాకతో టీ20ల్లో బలహీనంగా కనిపించిన భారత బౌలింగ్ ఇప్పుడు పటిష్టంగా మారింది.

మ్యాచ్ ఎప్పుడు? ఏ సమయంలో ప్రారంభమవుతుంది?

క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, ఇంగ్లండ్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ మంగళవారం, జూలై 14న జరగనుంది. ఈ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని ప్రసిద్ధ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. అంతకంటే ముందు మధ్యాహ్నం 3:00 గంటలకు టాస్ వేస్తారు. ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్‌లో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. ఇక్కడ భారత్ ఇప్పటివరకు 12 వన్డే మ్యాచ్‌లు ఆడగా, అందులో 8 మ్యాచుల్లో విజయం సాధించింది. గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. అయితే ఇంగ్లండ్‌తో ఇక్కడ జరిగిన చివరి వన్డేలో మాత్రం భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది.

లైవ్ ప్రసారాలు ఎక్కడ చూడాలి?

భారతదేశంలోని క్రికెట్ అభిమానులు ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ను టీవీ, మొబైల్స్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. భారత్-ఇంగ్లండ్ మొదటి వన్డే మ్యాచ్ లైవ్ ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది. అభిమానులు సోనీ స్పోర్ట్స్ ఛానెళ్లలో ఈ మ్యాచ్‌ను లైవ్‌గా చూడవచ్చు. ఒకవేళ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లలో డిజిటల్ పద్ధతిలో మ్యాచ్‌ను చూడాలనుకునే వారి కోసం జియోహోట్‌స్టార్ యాప్, వారి అధికారిక వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us