IND vs AUS: ఒకే ఒక్క కౌంటర్.. 2గంటలు..15వేల టికెట్లు..క్లోజ్.. నిరాశ, ఆగ్రహం, తొక్కిసలాట, లాఠీచార్జ్.. చేతులు దులుపుకున్న హెచ్‌సీఏ.. ఇది నేటి కథ..
టికెట్ల అమ్మకం స్లోగా జరగడం, ఆన్‌లైన్ పేమెంట్స్‌కు అనుమతించకపోవడంతో అభిమానుల్లో కోపం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా గేటెక్కి లోపలికి తోసుకుపోయేందుకు ప్రయత్నించడంతో..
అభిమానం గాయపడింది. క్రికెట్‌ని ఒక మతంగా భావించి.. పిచ్చిగా అభిమానించే హార్డ్‌కోర్ ఫ్యాన్స్‌ని ఆస్పత్రి పాలయ్యేలా చేసింది HCA పెద్దల నిర్వాకం. జింఖానాలో క్రికెట్ అభిమానుల ప్రాణాలతో టి-20 ఆడింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఒక్క టిక్కెట్ ప్లీజ్ అంటూ ఆర్తిగా, ఆశగా ఎదురుచూసిన అభిమానులకు చుక్కలు చూపించారు.. HCA అధ్యక్షుల వారు మహ్మద్ అజారుద్దీన్. ఈనెల 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్.. పైగా మూడేళ్ల గ్యాప్ తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఇంటర్నేషన్ ట్వంటీ20 మ్యాచ్.. అందుకే.. మ్యాచ్‌ని లైవ్‌లో చూసే ఆ ఫీల్‌ని మిస్ కాకూడదని ఎంతో ఆశగా టిక్కెట్ల కోసం ఎగబడ్డారు ఫ్యాన్స్. నిన్న అర్ధరాత్రి నుంచి వేలాది మంది అభిమానులు రావడంతో జింఖానా గ్రౌండ్ నుంచి ప్యారడైజ్ వరకూ క్యూ లైన్లు నిండిపోయాయి.
టికెట్ల అమ్మకం స్లోగా జరగడం, ఆన్‌లైన్ పేమెంట్స్‌కు అనుమతించకపోవడంతో అభిమానుల్లో కోపం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా గేటెక్కి లోపలికి తోసుకుపోయేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్నా HCA పెద్దలు పట్టించుకోలేదు. పోలీసులు కన్నెత్తి చూడలేదు. ఇంకేముంది.. అదుపు తప్పి.. తొక్కిసలాట జరిగి.. జింఖానా మొత్తం హాహాకారాలతో నిండిపోయింది. లాఠీచార్జిలో పదిమందికి గాయాలయ్యాయి. బాధితుల్లో నలుగురు మహిళలు.
జింఖానాగ్రౌండ్ తొక్కిసలాటపై సీరియస్‌గా స్పందించింది తెలంగాణా సర్కార్. టిక్కెట్ల కేటాయింపుపై వెంటనే సమీక్షకు రావాలని HCAను ఆదేశించింది. స్టేడియం కెపాసిటీ ఎంత, ఎన్ని టిక్కెట్లు ఉన్నాయి, ఎన్నిటిని ఆన్‌లైన్‌లో పెట్టారు… టోటల్ సినారియో చెప్పాలని ఆదేశించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
రివ్యూ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి… ఇటువంటి ఘటనలు రిపీట్ కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. తెలంగాణా ప్రతిష్టను మసకబారిస్తే సహించబోమన్నారు. అటు.. పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా HCAనే తప్పుబడుతోంది. ఘటన మొత్తంలో హెచ్‌సీఏ నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు అడిషనల్ డీసీపీ. బాధ్యులెవరైనా యాక్షన్ తీసుకునే తీరతామన్నారు.
టోటల్ ఎపిసోడ్‌లో కరడు గట్టిన విలన్‌గా కనిపిస్తోంది అజారుద్దీన్ ఒక్కరే. ఎన్నెన్నో ఎత్తుగడల్ని, కోర్టు కేసుల్ని దాటుకుని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన అజారుద్దీన్.. ఆ తర్వాత అసోసియేషన్ కార్యకలాపాల్లో మాత్రం పూర్తిగా విఫలమైనట్టు తెలుస్తోంది. క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సర్‌గా మచ్చ తెచ్చుకున్నారు. ఆ తర్వాత పాలిటిక్స్‌లో వర్కవుట్ కాక.. ఇప్పుడు క్రికెట్ పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆఫ్‌గ్రౌండ్‌లో అజార్ ఆడుతున్న గేమ్స్ గురించి కథలుకథలుగా చెప్పుకుంటారు.
అజర్ పాలనలో అవినీతి పేరుకు పోయిందని శివలాల్ యాదవ్ లాంటి కొలీగ్స్ చెబుతారు. హెచ్సీఏలో జూనియర్ సెలక్షన్ కమిటీని నియమించి నియంతలా వ్యవహరిస్తున్నారన్న అభియోగం కూడా ఉంది. ఇప్పుడు టికెట్ల ఇష్యూ. ఇదే మ్యాచ్ లు దేశంలో మరో రెండు చోట్ల జరిగాయి. అక్కడా టికెట్లు అమ్మాయి ఆయా క్రికెట్ అసోసియేషన్లు. కానీ ఎలాంటి గొడవలూ జరగలేదు. హైదరాబాద్‌లో మాత్రం టికెట్ల విషయంలో రచ్చ అవుతోంది.
తాజా ఘటనతో క్రికెట్ సర్కిల్స్‌లో అజారుద్దీన్ పూర్తిగా కార్నర్ అయ్యారు. టీ20 మ్యాచ్ టిక్కెట్ల అమ్మకంలో 40 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురవారెడ్డి. అజారుద్దీన్ వన్ మ్యాన్ షో వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
క్యూలైన్లో ఇంతింత ఘోరాలు జరుగుతుంటే.. ఖాకీలు మాత్రం తాపీగా షార్ట్‌కట్‌లో టిక్కెట్ల కోసం వెంపర్లాడారు. కౌంటర్ల వెనకవైపు నుంచి టిక్కెట్లు తీసుకుని.. తమ చేతివాటం ప్రదర్శించినట్టు కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సివిల్ డ్రెస్‌లో వచ్చిన కొందరికి.. యూనిఫాంలో ఉన్న పోలీసులు టికెట్లు ఇప్పించారనే విమర్శలు వస్తున్నాయి.
తొక్కిసలాటలో పద్మ అనే మహిళ స్పృహ తప్పిపోయింది. వెంటనే ఆమెకు సీపీఆర్ ట్రీట్‌మెంట్ ఇచ్చి ఊపిరందేలా చేశారు అక్కడే ఉన్న లేడీ కాన్‌స్టబుల్. సకాలంలో ఫస్ట్ఎయిడ్ ఇచ్చిన లేడీ కాన్‌స్టబుల్… ఆ తర్వాత ప్రశంసలందుకున్నారు.
ఒక ప్రాణాన్ని కాపాడిన అనుభూతి.. మాటలకు అందనిది. ఆ ఫీలింగ్‌నే టీవీ9తో షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు లేడీ కాన్‌స్టబుల్. జింఖానా గ్రౌండ్‌లో ఇవాళ్టికి టిక్కెట్లు అయిపోయాయంటూ కౌంటర్ మూసేశారు HCA అధికారులు. పూర్తిస్థాయిలో టిక్కెట్లు అమ్మకుండానే అబద్ధం చెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్యూలో నిల్చున్నవాళ్లను వెనక్కి పంపించేశారు. టిక్కెట్లు అందనివారు నిరుత్సాపడకుండా.. అరటిపండు, సమోసాలిచ్చి చల్లబరిచారు పోలీసులు.
అటు.. నో మోర్ టిక్కెట్స్ అని తేల్చేశారు HCA ప్రెసిడెంట్ అజారుద్దీన్. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో జరిగిన సమావేశంలో ఓపెన్‌గా చెప్పేశారాయన. తొక్కిసలాటలో గాయపడిన పదిమందీ కోలుకుంటున్నారు. కానీ.. టిక్కెట్ల అమ్మకంలో ఘోరంగా ఫెయిలైన HCA.. దేశవ్యాప్తంగా అభాసుపాలైంది. మిస్టర్ అజార్ ఈ ప్రశ్నలకు బదులిస్తావా అంటూ.. మిలియన్ డాలర్ల ప్రశ్నల్ని సంధిస్తున్నారు దగాపడ్డ అభిమానులు.
మరిన్ని తెలంగాణ, క్రీడా వార్తల కోసం