T20 World Cup 2021: క్రికెట్ అభిమానులను క్షమాపణ కోరిన ఐసీసీ.. ఎందుకంటే..
టీ 20 వరల్డ్ కప్‌లో భాగంగా శుక్రవారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ జట్లు హోరాహోరీగా తలపడిన సంగతి తెలిసిందే. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం..
టీ 20 వరల్డ్ కప్‌లో భాగంగా శుక్రవారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ జట్లు హోరాహోరీగా తలపడిన సంగతి తెలిసిందే. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ మ్యాచ్‌లో పాక్ ఐదు వికెట్ల తేడాతో అఫ్గాన్‌పై విజయం సాధించింది. అయితే మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు స్టేడియంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమంది క్రికెట్ అభిమానులు టిక్కెట్ లేకుండానే గేట్లు దూకి బలవంతంగా స్టేడియంలోకి చొరబడ్డారు. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పడంతో పోలీసులు కొద్ది సేపు అన్ని గేట్లను మూసేశారు. దీంతో టిక్కెట్ కొని మ్యాచ్‌ను ఆస్వాదిద్దామనుకున్న ఫ్యాన్స్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐసీసీ స్పందించింది.
విచారణకు ఆదేశించాం.. ‘పాక్- అఫ్గాన్ మ్యాచ్ కోసం మేం 16 వేలకు పైగా టిక్కెట్లను అందుబాటులో ఉంచాం. అయితే మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి పూర్తి గందరగోళం నెలకొంది. వేలాదిమంది అభిమానులు టిక్కెట్లు లేకుండా స్టేడియంలోకి ప్రవేశించారు. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి అభిమానులను చెదరగొట్టారు. దీని వల్ల టిక్కెట్లు కొన్నవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇందుకు మేం విచారం వ్యక్తం చేస్తున్నాం. వారికి క్షమాపణలు చెబుతున్నాం. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ)ని ఆదేశించాం’ అని ఐసీసీ చెప్పుకొచ్చింది.
2019 వరల్డ్ కప్‌లోనూ.. 2019 ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. లీడ్స్ వేదికగా పాక్, అఫ్గాన్ జట్లు తలపడగా.. పాక్ 3 వికెట్ల తేడాతో విజయం చేసింది. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే స్టేడియంలోని ఇరు దేశాల అభిమానులు పరస్పరం గొడవలకు దిగారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకునే మ్యాచ్‌కు ముందే అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ‘ అభిమానులందరూ ఆనందంగా ఆటను ఆస్వాదించాలి. 2019లో మాదిరిగా జరగకూడదు’ అని తమ అభిమానులకు సూచించాడు.
Also read: