Video: తండ్రి అండదండలతో హెచ్‌సీఏ కౌన్సిల్ కొడుకు రుబాబు! వైరల్ అవుతున్న వీడియో! ఏకిపారేస్తున్న నెటిజన్లు!
హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు సునీల్ అగర్వాల్ కుమారుడు ఖుష్ అగర్వాల్ స్టేడియంలో ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతని అధికార దుర్వినియోగ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అతను హెచ్‌సీఏ అండర్-19 జట్టులో ఉండటం కూడా 'విరుద్ధ ప్రయోజనాల' అంశంగా నిలిచింది. ఈ వ్యవహారం హెచ్‌సీఏ పరిపాలనలో పారదర్శకతపై మళ్లీ అనుమానాలు కలిగిస్తోంది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మళ్లీ ఒకవైపు వివాదాల్లో చిక్కుకోగా, మరోవైపు అధికార దుర్వినియోగంపై విమర్శలతో కేంద్రంగా మారింది. ఇప్పటికే ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మేనేజ్‌మెంట్‌తో చోటుచేసుకున్న టికెట్ల వివాదం తీవ్ర దుమారం రేపింది. టికెట్ల కేటాయింపులో పారదర్శకత లేకపోవడంతో దేశవ్యాప్తంగా హెచ్‌సీఏపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత హెచ్‌సీఏ, SRH మధ్య చర్చలు జరిపి కొంతమేరకు వివాదానికి తెరపడినట్టు కనిపించింది. కానీ ఇప్పుడు మరో వివాదం హెచ్‌సీఏను మళ్లీ వార్తల్లోకి తెచ్చింది. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు సునీల్ అగర్వాల్ కొడుకు ఖుష్ అగర్వాల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
తండ్రి అండదండలతో ఖుష్ అగర్వాల్ ఉప్పల్ స్టేడియంలో విపరీతంగా ప్రవర్తించాడు. అతను తన స్నేహితులతో కలిసి స్టేడియంలోకి ప్రవేశించి అధికారిక గదుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ, తన తండ్రి కౌన్సిల్ సభ్యుడిగా వాడుకునే కుర్చీలో కూర్చుని సెల్ఫీలు, బాత్కాలు కొట్టాడు. అంతటితో ఆగకుండా స్టేడియంలో నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియా రీల్స్ చేశాడు. హెచ్‌సీఏ అండర్-19 జట్టులో సభ్యుడైన ఖుష్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతని ఈ వ్యవహార శైలి, క్రికెట్ పరిపాలనలోని పారదర్శకతపై అనుమానాలు తెచ్చింది.
తండ్రి సునీల్ అగర్వాల్ హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతుండగా, ఖుష్ అగర్వాల్ హెచ్‌సీఏ అండర్-19 జట్టులోకి ఎంపిక కావడంపై అభిప్రాయ భిన్నతలు తలెత్తాయి. ఇది “పరస్పర విరుద్ధ ప్రయోజనాల” కింద పరిగణించాలంటూ పలువురు ఎథిక్స్ కమిటీ, అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదులు చేశారు. ఈ విమర్శల దాటికి ఖుష్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న వివాదాస్పద రీల్స్‌ను తొలగించాడు.
ఇంకా, సాధారణ ప్రేక్షకులకు, ఆటగాళ్లకు కఠినంగా వ్యవహరిస్తూ స్టేడియం గేట్ల వద్ద వాహన ప్రవేశాన్ని నియంత్రించే హెచ్‌సీఏ సెక్యూరిటీ సిబ్బంది, ఖుష్ అగర్వాల్, అతని స్నేహితుల విషయంలో మాత్రం వీఐపీ ప్రోటోకాల్ అమలుచేసిన తీరు నెటిజన్ల కోపానికి గురవుతోంది. “ఒక కౌన్సిల్ సభ్యుని కొడుకుకే ఈ స్థాయి ప్రాధాన్యత అంటే, మిగిలినవాళ్లకు న్యాయం ఎక్కడ?” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఈ మొత్తం వివాదం హెచ్‌సీఏ పరిపాలనపై మరింత ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది. ఇప్పటికే విమర్శల మధ్య చిక్కుకున్న ఈ సంస్థకు మరింత అపవాది ముద్ర పడుతోంది. పాలనా వ్యవస్థలో పారదర్శకత లేకుండా అధికార దుర్వినియోగం జరిగితే, క్రికెట్‌కు నష్టం తప్పదని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. మల్టీ-కోర్ ఇనిస్టిట్యూషన్‌గా అభివృద్ధి చెందాల్సిన హెచ్‌సీఏ, ఇలా తరచూ వివాదాల్లో చిక్కుకోవడం దురదృష్టకరం.
హెచ్‌సీఏ కౌన్సిలర్ కొడుకు అధికార దుర్వినియోగం! స్టేడియంలో హంగామా.. తండ్రి చైర్లోనే కూర్చుని బాత్కాలు.. #HCA #IPL2025 #BCCI #SRH pic.twitter.com/daZnBlPnXf
— CricShiva (@shivauppala93) April 19, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..