Vaibhav Suryavanshi : కోహ్లీ వారసుడు తనేనా ? వైభవ్ కోసం ఆర్సీబీ స్కెచ్.. కోచ్ మనీష్ ఓజా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi :టీవీ9కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో మనీష్ ఓజా ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. భవిష్యత్తులో విరాట్ కోహ్లీ ఐపీఎల్ నుంచి తప్పుకుంటే, ఆర్సీబీకి ఒక కొత్త రోల్ మోడల్ కావాలని, ఆ స్థానాన్ని భర్తీ చేసే సత్తా వైభవ్ సూర్యవంశీకి మాత్రమే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ.. భారత క్రికెట్ ఆకాశంలో ధ్రువతారలా మెరుస్తున్న 15 ఏళ్ల వండర్ కిడ్. ఒక్క ఏడాదిలోనే ప్రపంచ క్రికెట్ చూపు తనవైపు తిప్పుకున్న ఈ కుర్రాడు ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. అయితే భవిష్యత్తులో వైభవ్ ఏ జట్టుకు ఆడనున్నాడు? రాజస్థాన్‌లోనే కొనసాగుతాడా లేక మరేదైనా పెద్ద టీమ్ అతడిని ఎగరేసుకుపోతుందా? అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా వైభవ్ తర్వాతి మకాం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కావచ్చని వినిపిస్తున్న వార్తలు ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
కోహ్లీ వారసుడిగా వైభవ్?
బీహార్ రాజధాని పాట్నాలో జెనెక్స్ అకాడమీ నడుపుతున్న మనీష్ ఓజా దగ్గరే వైభవ్ క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. వైభవ్ టాలెంట్ గురించి మనీష్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. తాజాగా టీవీ9కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో మనీష్ ఓజా ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. భవిష్యత్తులో విరాట్ కోహ్లీ ఐపీఎల్ నుంచి తప్పుకుంటే, ఆర్సీబీకి ఒక కొత్త రోల్ మోడల్ కావాలని, ఆ స్థానాన్ని భర్తీ చేసే సత్తా వైభవ్ సూర్యవంశీకి మాత్రమే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రాండ్ వాల్యూ పరంగా కోహ్లీ ఇమేజ్‌ను కొనసాగించే సత్తా వైభవ్‌కు ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
మెగా వేలంలో ఆర్సీబీ భారీ స్కెచ్
2028 సీజన్ కంటే ముందు జరిగే మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైభవ్ కోసం సర్వశక్తులు ఒడ్డుతుందని కోచ్ మనీష్ ఓజా జోస్యం చెప్పారు. “ప్రతి టీమ్‌కు ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి. రాజస్థాన్ రాయల్స్‌లో వైభవ్, యశస్వి బ్యాటింగ్ చేసినంత సేపు టీవీ చూసి తర్వాత ఆపేసే వారు చాలా మంది ఉన్నారు. చెన్నైలో ధోనీ తర్వాత టీమ్‌ను ఎవరు చూస్తారు? అందుకే ఆర్సీబీ తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వైభవ్‌ను కొనుగోలు చేసేందుకు ఎంతకైనా తెగిస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
రాజస్థాన్ రాయల్స్ అంత తేలికగా వదులుతుందా?
కోచ్ మాటలు వినడానికి ఆసక్తికరంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఇది అంత సులభం కాదు. ఏ జట్టు అయినా తమ వద్ద ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లను వదులుకోవడానికి ఇష్టపడదు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ లాంటి అరుదైన ప్రతిభను వెలికితీసి అతనికి గుర్తింపు తెచ్చింది. మెగా వేలం నిబంధనల ప్రకారం ప్రతి టీమ్ 4 నుంచి 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రాజస్థాన్ ఖచ్చితంగా వైభవ్‌ను రిటైన్ చేసుకునేందుకే మొగ్గు చూపుతుంది. వైభవ్ కూడా ఒకవేళ తనకు తానుగా రిలీజ్ చేయమని కోరితే తప్ప, అతను జట్టును వీడే అవకాశం లేదు.
భవిష్యత్తుపై భారీ అంచనాలు
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వయస్సు కేవలం 15 ఏళ్లే. అంటే అతని ముందు సుదీర్ఘమైన కెరీర్ ఉంది. 2027 చివరిలో జరిగే మెగా వేలం నాటికి వైభవ్ మరింత రాటుదేలే అవకాశం ఉంది. అప్పుడు అతని ధర రూ.10 నుంచి 12 కోట్ల పైమాటే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఆర్సీబీ ఆశలు నెరవేరుతాయా? లేదా రాజస్థాన్ తన స్టార్ ప్లేయర్‌ను భద్రంగా కాపాడుకుంటుందా? అనేది వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
