Video: సెంచరీ ప్లేయర్ ఇలా ఔట్ అయ్యాడేంటి భయ్యా.. ఇంతకుముందెన్నడూ ఇలాంటి వీడియో చూసి ఉండరంతే
Steve Smith Out Video: మెల్ బోర్న్ టెస్ట్ ఆసక్తిగా మారింది. స్టీవ్ స్మిత్ అద్భుత సెంచరీతో భారీ స్కోర్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. తొలి రెండు రోజుల్లో ఆధిపత్యం చూపించింది. ఇక మొత్తంగా ఆసీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 474 పరుగులకు ముగించుకుంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్‌కు అప్పుడే రెండు కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో కూరుకపోయింది.
Steve Smith Out Video: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ విచిత్రమైన రీతిలో అవుటయ్యాడు. స్టీవ్ స్మిత్ MCG టెస్ట్‌లో అద్భుతమైన ఆటతీరుతో సెంచరీ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ హై-వోల్టేజ్ ఆటతో తనలో ఇంకా క్రికెట్ మిగిలే ఉందని చూపిస్తూ.. 34వ సెంచరీతో పాటు ఎన్నో రికార్డులను తన పేరటి లిఖించాడు.
ఈ ఆసీస్ సీనియర్ బ్యాటర్ ఎంతో అద్బుతమైన సెంచరీ చేసినా.. చివరకు మాత్రం ఊహించన విధంగా పెవిలియన్ చేరడం గమనార్హం. టీమిండియా బౌలర్ ఆకాష్ దీప్ బౌలింగ్‌లో . ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 115వ ఓవర్‌లో ఈ వింత ఔట్ చోటు చేసుకుంది. నాథన్ లియాన్‌తో కలిసి స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
లంచ్ విరామం తర్వాత రవీంద్ర జడేజా మిచెల్ స్టార్క్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఎండ్ నుంచి ఆకాష్ దీప్‌ను రంగంలోకి దింపాడు. మ్యాచ్‌లో కీలకమైన సమయంలో రైట్ ఆర్మ్ పేసర్ ఆకాష్ దీప్ ఆసీస్ తరపున సెంచరీ ఇన్నింగ్స్ ఆడిన స్మిత్‌కు పెవిలియన్ బాట చూపించాడు.
స్టీవ్ స్మిత్ ఔట్ అయిన వీడియో..
Oh dear Steve Smith!
That is as bizarre as it gets 😳 #AUSvIND pic.twitter.com/ZDUWggwBq4
— cricket.com.au (@cricketcomau) December 27, 2024
128.5 కి.మీ.ల బ్యాక్-ఆఫ్-ది-లెంగ్త్ డెలివరీని అర్థం చేసుకోవడంతో విఫలమైన స్మిత్.. ఆఫ్ సైడ్ ద్వారా భారీ షాట్ ఆడేందుకు క్రీజ్ నుంచి బయటికి వచ్చాడు. అయితే, బంతి బ్యాట్‌కు తగిలి ఆ తర్వాత స్మిత్ ప్యాడ్‌కు బలంగా తగిలి వికెట్ల వైపు వెళ్లి స్టంప్‌లను పడగొట్టింది. దీంతో షాక్‌కు గురైన స్మిత్, పెవిలియన్‌కు విచారంగా నడిచాడు.
వార్త రాసే సమయానికి భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. రోహిత్ 3, కేఎల్ రాహుల్ 24 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. అంతకుముందు ఆస్ట్రేలియా 474 పరుగులకే ఆలౌట్ అయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..