24 వికెట్లు తీసి సంచలనం సృష్టించిన టీమిండియా మాజీ క్రికెటర్ కుమారుడు..
Virender sehwag: టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారులిద్దరూ క్రికెట్‌లో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. సెహ్వాగ్ పెద్ద కొడుకు ఇటీవల కూచ్ బెహార్ ట్రోఫీలో 297 పరుగులు చేసి వార్తల్లో నిలిచాడు, ఇప్పుడు అతని చిన్న కుమారుడు విజయ్ మర్చంట్ ట్రోఫీలో తన స్పిన్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
భారత క్రికెట్ జట్టు లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆట గూర్చి క్రికెట్ అభిమానులకు కొత్తగా పరిచయం చేయవల్సిన అవసరం లేదు. అప్పట్లో ఆయనకు మాములుగా క్రేజ్ లేదు. ఇది ఇలా ఉంటే తండ్రికి తగ్గట్లుగా కొడుకులిద్దరూ కూడా అదే బాటలో నడుస్తున్నారు. సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ ఢిల్లీ అండర్-19 జట్టుకు ఆడుతున్నాడు. మరోవైపు చిన్న కొడుకు వేదాంత్ సెహ్వాగ్ క్రికెట్ ఫీల్డ్‌లో సంచలనం సృష్టించాడు. వేదాంత్ బ్యాట్స్‌మెన్‌గా కాకుండా బౌలర్‌గా రాణిస్తున్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న విజయ్ మర్చంట్ ట్రోఫీ టోర్నీలో వేదాంత్ సెహ్వాగ్ పోటీపడుతున్నాడు. ఈ అండర్-16 టోర్నీలో ఆఫ్ స్పిన్నర్ బౌలర్‌గా కనిపించిన వేదాంత్.. ఢిల్లీ తరఫున అద్భుత బౌలింగ్‌ను ప్రదర్శించాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన 14 ఏళ్ల వేదాంత్ ఇప్పటికే మొత్తం 24 వికెట్లు పడగొట్టాడు. వీరేంద్ర సెహ్వాగ్ తన కుమారుడి బౌలింగ్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా షేర్ చేశాడు.
వీరేంద్ర సెహ్వాగ్ షేర్ చేసిన వీడియోలో వేదాంత్ సెహ్వాగ్ బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే, తన కొడుకు 5 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీసిన ఘనతపై సెహ్వాగ్ మురిసిపోతున్నాడు. 2024-25 విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఢిల్లీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వేదాంత్ సెహ్వాగ్ నిలిచాడు. ఈ టోర్నీలో వేదాంత్ ఒక ఇన్నింగ్స్‌లో రెండుసార్లు 5 వికెట్లు తీయడం విశేషం. దీంతో పాటు రెండుసార్లు తలా 4 వికెట్లు తీశాడు. వేదాంత్ సెహ్వాగ్ మినహా ఢిల్లీ బౌలర్లెవరూ 10 వికెట్లు తీయకపోవడం గమనార్హం.
వేదాంత్ కంటే ముందు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించాడు. కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ అండర్-19 జట్టు తరఫున ఆర్యవీర్ 297 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆర్యవీర్ తన తండ్రిలాగే దూకుడు బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించాడు. ఇప్పుడు వేదాంత్ కూడా 24 వికెట్లు తీసి అందరీ దృష్టి ఆకర్షించాడు.
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి