AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: 134 సార్లు 50 ప్లస్ స్కోర్లు.. సచిన్ మరో రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

Virat Kohli: న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ 74 పరుగులతో అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో SENA దేశాలపై అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికసార్లు 50కి పైగా స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించి 134 సార్లు ఈ ఘనత సాధించాడు.

Virat Kohli: 134 సార్లు 50 ప్లస్ స్కోర్లు.. సచిన్ మరో రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ
Sachin Tendulkar
Rakesh
|

Updated on: Nov 04, 2026 | 6:43 PM

Share

Virat Kohli: విరాట్ కోహ్లీ మైదానంలో నిలదొక్కుకుంటే రికార్డులు బద్దలవ్వాల్సిందే. న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలోనూ ఇదే జరిగింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ 51 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అతడి ఇన్నింగ్స్‌తో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ వన్డే కెరీర్‌లో 80వ హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌తో అతడు సాధించిన మరో ఘనత ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

SENA దేశాలపై సచిన్ రికార్డు

సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలను కలిపి SENA దేశాలుగా పిలుస్తారు. ఈ జట్లపై అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికసార్లు 50కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 320 మ్యాచ్‌ల్లో 133 సార్లు 50కి పైగా స్కోర్లు సాధించగా, కోహ్లీ 320 మ్యాచ్‌ల్లోనే 134 సార్లు ఈ ఘనత అందుకున్నాడు. ఇందులో కోహ్లీ 89 అర్ధ సెంచరీలు, 45 సెంచరీలు సాధించాడు. సచిన్ ఖాతాలో 83 హాఫ్ సెంచరీలు, 50 సెంచరీలు ఉన్నాయి.

టాప్ 10 జాబితాలో దిగ్గజాలు

SENA దేశాలపై అత్యధిక 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ మొదటి స్థానానికి చేరాడు. సచిన్ 133 స్కోర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా 100 స్కోర్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంక ఆటగాళ్లు కుమార సంగక్కర 97, మహేల జయవర్ధనే 87 స్కోర్లతో జాబితాలో ఉన్నారు. రాహుల్ ద్రవిడ్ 89, శివనారాయణ్ చంద్రపాల్ 89 స్కోర్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ 83 సార్లు 50కి పైగా పరుగులు చేసి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కోహ్లీ అగ్రస్థానానికి చేరడం అతడి స్థిరమైన ఆటతీరుకు నిదర్శనం.

ఛేజింగ్‌లోనూ సచిన్‌ను దాటిన విరాట్

కేవలం SENA రికార్డుతోనే కోహ్లీ ఆగలేదు. వన్డేల్లో లక్ష్య ఛేదన సమయంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా సచిన్‌ను వెనక్కి నెట్టాడు. ఛేజింగ్‌లో కోహ్లీ ఇప్పటివరకు 8,741 పరుగులు సాధించగా, సచిన్ 8,720 పరుగులు చేశాడు. కోహ్లీ ఈ పరుగులను 66.21 సగటుతో, 95.03 స్ట్రైక్ రేట్‌తో సాధించాడు. సచిన్ సగటు 42.33, స్ట్రైక్ రేట్ 88.44గా ఉంది. దీంతో లక్ష్య ఛేదనలో కోహ్లీ ఆధిపత్యం మరోసారి స్పష్టమైంది.

నంబర్ 3లో 13 వేల పరుగుల మైలురాయి

వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 13 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ మరో ఘనత సాధించాడు. ఈ స్థానంలో అతడి పరుగులు 13,000 మార్కును దాటాయి. మరోవైపు న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ కోహ్లీ రికీ పాంటింగ్‌తో సమానంగా నిలిచాడు. ఇద్దరూ 1,971 పరుగులు సాధించారు. టెస్టు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్నాడు. ఈ ఫార్మాట్‌లోనూ రికార్డుల వేట కొనసాగిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us