AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9 నెలల్లోనే రూ.132 కోట్ల నష్టం వచ్చింది.. కుప్పకూలిపోయిన భర్త.. కన్నీళ్లుపెట్టుకున్న నటి

తెలుగు సినిమాల్లో వందల సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి కవిత. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేసి ఆకట్టుకున్నారు. ఒకప్పుడు బిజీగా సినిమాలు చేసిన కవిత ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించారు. నటి కవిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

9 నెలల్లోనే రూ.132 కోట్ల నష్టం వచ్చింది.. కుప్పకూలిపోయిన భర్త.. కన్నీళ్లుపెట్టుకున్న నటి
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 04, 2026 | 6:33 PM

Share

సీనియర్ నటి కవిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 1976లో విడుదలైన తమిళ చిత్రం ‘ఓ మంజు’తో నటిగా కెరీర్ ప్రారంభించిన కవిత.. అదే ఏడాది ‘సిరిసిరిమువ్వ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘అడవి రాముడు’, ‘న్యాయవాది’, ‘విశ్వనాథ్’, ‘ఇద్దరూ అసాధ్యులే’, ‘వెంకటేశ్వర వ్రత మహత్యం’, ‘శారదా రాముడు’, ‘నకిలీ మనిషి’, ‘అల్లుడు పట్టిన భారతం’, ‘చుట్టాలున్నారు జాగ్రత్త’, ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’, ‘పెద్దరికం’, ‘ప్రెసిడెంట్ పేరమ్మ’ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.

కేవలం సినిమాలకే పరిమితం కాకుండా టెలివిజన్ రంగంలోనూ ఎన్నో సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కవిత తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా తన భర్త వ్యాపారంలో ఎదురైన భారీ నష్టం, ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన భర్త దశరథరాజు పాండిచ్చేరిలో ఆయిల్ వ్యాపారం చేసేవారని కవిత వెల్లడించారు. ఒకానొక సమయంలో వ్యాపారంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడంతో కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే ఏకంగా రూ.132 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. అయితే ఈ ఆర్థిక ఇబ్బందుల గురించి తనకు, కుటుంబ సభ్యులకు ఆయన ముందుగా ఏమీ చెప్పలేదని పేర్కొన్నారు. తాను సినిమాలతో బిజీగా ఉండటం వల్ల భర్త వ్యాపార వ్యవహారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకునేదాన్ని కాదని వివరించారు. వ్యాపారంలో వచ్చిన భారీ నష్టాన్ని తట్టుకోలేక తన భర్త ఒక్కసారిగా కుప్పకూలిపోయారని కవిత గుర్తుచేసుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా బ్రెయిన్ హెమరేజ్ (మెదడులో రక్తస్రావం) అయినట్లు వైద్యులు వెల్లడించారని చెప్పారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పినట్లు తెలిపారు.

ఆ సమయంలో తన భర్త 11 రోజుల పాటు కోమాలో ఉన్నారని కవిత వెల్లడించారు. ఆసుపత్రిలో తాను ఒక్కరే ఉండి ఆయన కోలుకోవాలని ఎదురుచూశానని తెలిపారు. మరోవైపు పిల్లలు కూడా ఆసుపత్రికి రావడానికి ఇష్టపడలేదని, తమ తండ్రి ఎప్పుడూ ఎలా ఉన్నారో అలాగే తమకు కావాలని చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో కూడా తనకు అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు ఆశలు వదులుకున్న పరిస్థితుల్లో కూడా తన భర్త కోలుకుంటారనే నమ్మకాన్ని మాత్రం వదులుకోలేదని కవిత చెప్పారు. చివరకు భగవంతుడి దయతో ఆయన ప్రాణాలతో బయటపడి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారని తెలిపారు. ఆ సమయంలో తాము ఎదుర్కొన్న పరిస్థితులు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాలని చెప్పుకొచ్చారు. అయితే ఇంతటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడిన కవిత కుటుంబానికి ఆ తర్వాత మరో విషాదం ఎదురైంది. ఆమె భర్త దశరథరాజు 2021లో కరోనా కారణంగా కన్నుమూశారు. భర్త మరణం నుంచి కోలుకోకముందే కుమారుడిని కూడా కోల్పోవడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కవిత, దశరథరాజు దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇలా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, కవిత తన నటనా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us