ఇందిరమ్మ ఇళ్లలో ఈ దీపావళి డబుల్ ధమాకా.. 2.21 లక్షల కుటుంబాల్లో పండుగ వెలుగులు!
రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ఈ దీపావళి పండుగను ప్రత్యేకంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే గృహప్రవేశాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ పేరుతో వేడుకలు నిర్వహించాలని సూచించారు.

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ఈ దీపావళి పండుగను ప్రత్యేకంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే గృహప్రవేశాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ పేరుతో వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు పాల్గొనాలని కోరారు. పేదల ఇళ్లలో వెలిగే ప్రతి దీపం ప్రజాప్రభుత్వ సంకల్పానికి ప్రతీకగా నిలవాలని పేర్కొన్నారు.
బుధవారం (నవంబర్ 04) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి పొంగులేటి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఇద్దరు మంత్రులు ఆవిష్కరించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని పొంగులేటి తెలిపారు. తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయగా, ఇప్పటివరకు 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తయ్యాయని వెల్లడించారు. మరో 1.90 లక్షల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని చెప్పారు.
తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లు, రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లతో పాటు హైదరాబాద్ క్యూర్ ఏరియా పరిధిలో లక్ష ఇళ్లను మంజూరు చేసినట్లు వివరించారు. హైదరాబాద్ తరహాలోనే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ కార్పొరేషన్లలోనూ జీ+5 విధానంలో ఇందిరమ్మ టవర్లు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్మాణాలకు సంబంధించి దీపావళిలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్ల నుంచి వచ్చే ఏడాది బోనాల వేడుకలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.40 వేల కోట్ల వ్యయంతో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేసే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రతి సోమవారం నేరుగా నిధులు జమ చేస్తున్నామని, ఈ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని వివరించారు. పట్టణాలు, గ్రామాలతో పాటు మారుమూల ప్రాంతాలు, తండాల్లోనూ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. దీపావళి వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి పండుగ జరుపుకోవాలని మంత్రి కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
