త్రీడీ ప్లేయర్‌ అంటూ ట్రోలింగ్‌.. జట్టుకు దూరం.. కట్‌ చేస్తే 3 మ్యాచుల్లో 322 రన్స్‌.. హ్యాట్రిక్‌ సెంచరీలతో రికార్డు

అప్పటికే జట్టులో ఉన్న స్టార్‌ ప్లేయర్‌ అంబటి రాయుడును కాదని శంకర్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ సమయంలో అంబటి రాయుడు చేసిన ట్వీట్ కూడా చాలా వైరల్ అయ్యింది. '

త్రీడీ ప్లేయర్‌ అంటూ ట్రోలింగ్‌.. జట్టుకు దూరం.. కట్‌ చేస్తే 3 మ్యాచుల్లో 322 రన్స్‌.. హ్యాట్రిక్‌ సెంచరీలతో రికార్డు
Vijay Shankar
Follow us

|

Updated on: Jan 21, 2023 | 6:17 AM

విజయ్‌ శంకర్‌.. తమిళనాడుకు చెందిన ఈ ఆల్‌రౌండర్‌ 2019 వరల్డ్‌ కప్‌ టోర్నీలో టీమిండియాకు ఎంపికయ్యాడు. అతనిని త్రీడి ప్లేయర్‌ అని అభివర్ణిస్తూ అప్పటి సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్ జట్టులోకి తీసుకున్నాడు. అప్పటికే జట్టులో ఉన్న స్టార్‌ ప్లేయర్‌ అంబటి రాయుడును కాదని శంకర్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ సమయంలో అంబటి రాయుడు చేసిన ట్వీట్ కూడా చాలా వైరల్ అయ్యింది. ‘ నేను వరల్డ్ కప్ ను త్రీడీ కళ్లద్దాల్లో చూస్తాను’ అంటూ రాయుడు ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. తీరాచూస్తే వరల్డ్ కప్ లో కేవలం మూడు మ్యాచులు మాత్రమే ఆడాడు విజయ్ శంకర్. గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే తప్పుకున్నాడు. క్రమంగా  టీమిండియాలో స్థానం కూడా కోల్పోయాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో సోషల్‌ మీడియాలో అతనిని ఏకిపారేశారు. త్రీడిప్లేయర్‌ గల్లీ ప్లేయర్‌గా మారిపోయాడంటూ ట్రోలింగ్‌ చేశారు. అయితే ఇప్పుడే అదే విజయ్‌ శంకర్‌ రంజీల్లో అదరగొడుతున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23లో వరుస సెంచరీలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఎలైట్ గ్రూప్-బిలో అస్సాంతో జరిగిన మ్యాచ్ లో విజయ్ శంకర్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తం 187 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 112 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో తమిళనాడు జట్టు అస్సాంపై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఇది విజయ్‌కు హ్యాట్రిక్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్ కంటే ముందు మహారాష్ట్రపై(107), ముంబైపై(103) కూడా మూడంకెల స్కోరును నమోదు చేశాడు.

కాగా 2018-19 లో విజయ్ శంకర్ టీమిండియా తరఫున 12 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. అయితే ఎంత వేగంగా జట్టులోకి వచ్చాడో అంతే వేగంగా స్థానం కోల్పోయాడు. ఇప్పుడు రంజీ ప్రదర్శనతో మళ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. కాగా ఈ ప్రదర్శనతో టెస్టు జట్టులో విజయ్ శంకర్‌కు స్థానం దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే టీమిండియా టెస్టు స్క్వాడ్ లో హార్దిక్ పాండ్యా ప్లేస్‌ ఖాళీగానే ఉంది. దీంతో అటు బౌలర్ గా, ఇటు బ్యాటర్‌గా విజయ్‌శంకర్‌ జట్టుకు ఉపయోగపడే అవకాశం ఉంది. మరి సెలెక్టర్లు అతని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..