AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ఏషియన్ గేమ్స్ హిస్టీరీలోనే సరికొత్త రికార్డు

Vaibhav Sooryavanshi: ఏషియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ గోల్డ్ మెడల్ సాధించింది. ఈ విజయంతో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన అతి పిన్న వయసుగల భారతీయ ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. షూటర్ సౌరభ్ చౌదరి పేరిట ఉన్న రికార్డ్‌‌ను బ్రేక్ చేసిన వైభవ్, పతక ప్రదానోత్సవంలో జై షా పాదాలకు నమస్కరించి అందరి మనసులు గెలుచుకున్నాడు.

Vaibhav Sooryavanshi: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ఏషియన్ గేమ్స్ హిస్టీరీలోనే సరికొత్త రికార్డు
Vaibhav Sooryavanshi
Rakesh
|

Updated on: Oct 03, 2026 | 5:52 PM

Share

Vaibhav Sooryavanshi: భారత క్రీడా చరిత్రలో మరో అద్భుతమైన మైలురాయి నమోదైంది. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్ పోరులో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. ఈ ఉత్కంఠభరిత పోరులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోగా, సరికొత్త చరిత్ర సృష్టించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తుతం అంతటా మారుమోగుతోంది.

రికార్డు బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ

పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ విజయంతో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత సాధించాడు. ఆసియా క్రీడలు చరిత్రలో భారత్ తరఫున గోల్డెన్ మెడల్ సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన అథ్లెట్‌గా వైభవ్ రికార్డులకెక్కాడు. ఈ రికార్డును ఇంతకుముందు ప్రముఖ షూటర్ సౌరభ్ చౌదరి పేరిట ఉండేది. 2018 ఆసియా క్రీడలలో సౌరభ్ పతకం గెలిచినప్పుడు ఆయన వయసు 16 సంవత్సరాలు. కానీ వైభవ్ సరిగ్గా 15 ఏళ్ల 190 రోజుల వయసులోనే ఈ అరుదైన మైలురాయిని అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఫైనల్ మ్యాచ్ హోరాహోరీ పోరు

స్వర్ణ పతకం కోసం జరిగిన ఈ తుది పోరులో భారత్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటతీరుతో 61 పరుగులు చేయగా, తిలక్ వర్మ 51 పరుగులతో అజేయంగా నిలిచారు. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ జట్టు కూడా గట్టి పోటీనిచ్చింది. హసన్ నవాజ్ 96 పరుగులతో చివరి వరకు పోరాడినప్పటికీ, భారత బౌలర్లు కట్టడి చేయడంతో పాక్ జట్టు నిర్ణీత లక్ష్యానికి 20 పరుగుల దూరంలో ఆగిపోయింది. భారత్ తరఫున శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తలా 2 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ అద్భుత విజయం అనంతరం భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత విజేతలకు పతకాలు అందజేసే కార్యక్రమంలో ఐసీసీ ఛైర్మన్ జై షా చేతుల మీదుగా పతకాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ అత్యంత వినయంగా జై షా పాదాలకు నమస్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ దేశం గర్వపడేలా చేస్తున్న వైభవ్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని క్రీడా నిపుణులు కొనియాడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us