కొనాల్సిన పనిలేదు.. జస్ట్ 200తో ఇంట్లోనే బిర్యానీ ఆకు మొక్కను ఇలా పెంచండి..
మీ వంటింట్లో ఘుమఘుమలాడే బిర్యానీ ఆకులు మార్కెట్ నుంచి కొంటున్నారా? అయితే ఇకపై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయక్కర్లేదు. కేవలం రూ.200 రూపాయల చిన్న పెట్టుబడితో.. మీ ఇంటి బాల్కనీ లేదా టెర్రస్‌పైనే బిర్యానీ ఆకు మొక్కను ఎలా పెంచుకోవచ్చో తెలుసా? ఒక్కసారి నాటితే చాలు.. జీవితాంతం రసాయనాలు లేని తాజా ఆకులు మీ సొంతం.. ఆ సులభమైన గార్డెనింగ్ సీక్రెట్ ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటి పైన లేదా బాల్కనీలో చిన్నపాటి గార్డెన్ మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా ఇంట్లోకి అవసరమైన తాజా కూరగాయలు, ఆకుకూరలను అందిస్తుంది. ముఖ్యంగా ప్రతి వంటింట్లో ఘుమఘుమలాడే బిర్యానీలు, కూరల నుంచి ఉదయం తాగే ప్రత్యేకమైన మసాలా టీ వరకు విరివిగా వాడే సుగంధ ద్రవ్యం బిర్యానీ ఆకు. మార్కెట్లో కొనుగోలు చేసే ఎండిన ఆకుల్లో చాలావరకు నిల్వ రసాయనాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాంటిది ఒక్కసారి కాస్త శ్రద్ధ పెట్టి ఇంట్లోనే ఒక బిర్యానీ ఆకు మొక్కను నాటుకుంటే జీవితాంతం స్వచ్ఛమైన, సేంద్రీయ బిర్యానీ ఆకులను పొందవచ్చని గార్డెనింగ్ నిపుణులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా రకరకాల మొక్కలను పెంచుతూ తోటపనిలో విశేష అనుభవం సంపాదించిన ఆరాధనా దేవి వంటి నిపుణుల ప్రకారం.. బిర్యానీ ఆకు మొక్కను పెంచడానికి భారీ తోటలు లేదా విస్తారమైన స్థలం అక్కర్లేదు. కేవలం బాల్కనీలో ఒక పెద్ద సైజు కుండీ ఉంటే చాలు. ప్రారంభంలో స్థానిక నర్సరీ నుంచి ఆరోగ్యంగా ఉన్న ఒక బిర్యానీ ఆకు మొక్కను సుమారు రూ.200 వెచ్చించి కొనుగోలు చేయవచ్చు. ఒకసారి వేర్లు బలంగా పాతుకుంటే, మార్కెట్‌పై ఆధారపడే అవసరం శాశ్వతంగా తప్పుతుంది.
ఎక్కడ నాటాలి? ఎంత ఎత్తు పెరుగుతుంది?
కుండీల్లో పెంపకం: బాల్కనీ లేదా టెర్రస్ గార్డెన్‌లో పెంచాలనుకుంటే కనీసం 18 నుంచి 24 అంగుళాల లోతు, వెడల్పు ఉన్న పెద్ద సిమెంట్ లేదా మట్టి కుండీని ఎంచుకోవాలి. కుండీలో పెరిగే మొక్క సుమారు 10 నుంచి 15 అడుగుల వరకు పెరుగుతుంది.
నేలలో నాటితే: ఇంటి పెరట్లో ఖాళీ స్థలం ఉండి నేరుగా మట్టిలో నాటితే, ఈ మొక్క 20 అడుగుల వరకు ఏపుగా పెరిగి పెద్ద వృక్షంగా మారుతుంది.
నాటిన రెండు మూడేళ్లలోనే ఇది అనేక కొమ్మలతో విస్తరించి, ఏడాదంతా అవసరమైన తాజా ఆకులను పుష్కలంగా అందిస్తుంది.
మట్టి మిశ్రమం – సూర్యరశ్మి అనుకూలత
బిర్యానీ ఆకు మొక్క ఆరోగ్యంగా పెరగడానికి నీరు నిలవకుండా బయటకు పోయేలా డ్రైనేజీ వ్యవస్థ ఉన్న మట్టి మిశ్రమం అవసరం. సాధారణ తోట మట్టికి సమాన నిష్పత్తిలో కోకోపీట్, వర్మీ కంపోస్ట్ లేదా బాగా చివికిన ఆవు పేడను కలిపి కుండీని నింపుకోవాలి. ఈ మొక్కకు రోజుకు కనీసం 4 నుంచి 6 గంటల పాటు నేరుగా సూర్యరశ్మి తగిలేలా ఉంచితే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో, బలమైన సువాసనతో పెరుగుతాయి.
రసాయనాలు లేని సహజ ఎరువులు
ఈ మొక్కకు ఖరీదైన రసాయన ఎరువులు వేయాల్సిన పనిలేదు. పూర్తిగా వంటింటి వ్యర్థాలు, సహజ ఎరువులతోనే దీనిని సంరక్షించవచ్చు.
ఆవు పేడ ఎరువు: ఎండిన పాత ఆవు పేడను నెలకొకసారి వేర్ల చుట్టూ మట్టిని తేలికగా తవ్వి కలపాలి.
కిచెన్ వేస్ట్ వాటర్: ఇంట్లో కూరగాయలు, పండ్ల తొక్కలను నీటిలో 2-3 రోజులు నానబెట్టి, ఆ పోషకాల నీటిని వేర్లకు అందిస్తే మొక్కకు అవసరమైన పొటాషియం, నైట్రోజన్ లభిస్తాయి. బియ్యం కడిగిన నీళ్లు కూడా మొక్క పెరుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి.
నీటి యాజమాన్యం – కత్తిరింపులు
కుండీలోని పై మట్టి పొడిగా మారినప్పుడే నీరు పోయాలి. అధికంగా నీరు పోస్తే వేరుకుళ్లు తెగులు వచ్చే ప్రమాదం ఉంది. వారానికి ఒకసారి మొక్కను గమనిస్తూ ఎండిన, పండిన ఆకులను కత్తిరిస్తూ ఉండాలి. ఇలా కత్తిరించిన ఆకులను శుభ్రం చేసి నీడలో ఆరబెట్టుకుంటే, వాటిని వంటల్లో లేదా సుగంధభరిత టీ తయారీలో సులభంగా వాడుకోవచ్చు. ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తూ సరైన సంరక్షణ అందిస్తే.. కేవలం రూ.200 పెట్టుబడితో పెరట్లోనే సేంద్రీయ సంపదను సృష్టించుకోవచ్చు. మార్కెట్ ఖర్చు ఆదా అవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు కల్తీ లేని స్వచ్ఛమైన ఆహారాన్ని అందించే అద్భుతమైన మార్గమిది.
