ఇన్నాళ్లు మీరు ఇదే తప్పు చేశారా.. చికెన్ లివర్, మటన్ లివర్ గురించి ఈ నిజాలు తెలుసుకోండి..
వీకెండ్ వచ్చిందంటే చాలు.. చాలా మందికి లివర్ ఫ్రై లేదా మసాలా ఉండాల్సిందే.. కానీ చికెన్ లివర్ మంచిదా? లేక మటన్ లివర్ తింటే ఎక్కువ బలం వస్తుందా? రక్తహీనతను తగ్గించే శక్తి దేనికి ఉంది? క్యాన్సర్ కణాలను అడ్డుకునే గుణం ఎందులో దాగుంది? అసలు ఈ రెండింటిలో ఏది బెస్ట్.. ఎవరు అస్సలు తినకూడదో వంటి విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం

వీకెండ్ వచ్చిందంటే నాన్‌వెజ్ ప్రియులకు పండుగే. కొందరికి మటన్ గ్రేవీ ఇష్టమైతే, మరికొందరికి చికెన్ బిర్యానీ ఇష్టం. అయితే వీటన్నింటిలో నాన్ వెజ్ లవర్స్ ప్రత్యేకంగా ఇష్టపడే ఆహారం లివర్. రెస్టారెంట్లలో అయినా, ఇంట్లో అయినా లివర్ ఫ్రై లేదా మసాలా పేరు వినగానే చాలా మందికి నోరూరిపోతుంది. కాలేయం కేవలం నాలుకకు రుచినివ్వడమే కాకుండా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందించే పోషకాల గనిగా పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరోగ్య పరంగా చూస్తే ఏ లివర్ తినడం మంచిది? కోడి కాలేయమా లేక మటన్ కాలేయమా? అనే విషయంలో చాలా మందిలో సందేహాలు ఉంటాయి. చికెన్ లివర్ త్వరగా జీర్ణమవుతుందని కొందరు, మటన్ లివర్ తింటేనే ఎక్కువ బలం వస్తుందని మరికొందరు భావిస్తారు. ఈ రెండింటిలో ఉండే పోషకాలు, వాటి మధ్య ఉన్న తేడాలు, ఎవరు తినాలి, ఎవరు తినకూడదో తెలుసుకోవడం ముఖ్యం.
చికెన్ లివర్ ప్రయోజనాలు
పరిమాణంలో చిన్నదైనా చికెన్ లివర్ అందించే ఆరోగ్య ప్రయోజనాలు మెండు. ఇందులో సెలీనియం అనే శక్తివంతమైన మూలకం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకోవడంలో తోడ్పడుతుంది. విటమిన్ ఎ, విటమిన్ బి12 ఇందులో సమృద్ధిగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడటంతో పాటు మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఇది సహకరిస్తుంది. సరిగ్గా ఉడికించిన చికెన్ లివర్ తింటే శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది తేలికైన ఎంపిక.
మటన్ లివర్ విశిష్టత
చాలా మంది తమ ఆహారంలో మటన్ లివర్‌ను అమితంగా ఇష్టపడతారు. మటన్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, దాని కాలేయంలో శరీరానికి మేలు చేసే పోషకాలు మెండుగా ఉంటాయి. అనీమియా లేదా రక్తహీనతతో బాధపడేవారికి మటన్ లివర్ అత్యుత్తమ ఆహారం. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాలను, రక్త పరిమాణాన్ని వేగంగా పెంచి శరీరానికి ఆక్సిజన్ సరఫరా సజావుగా సాగేలా చేస్తుంది. ఇందులో జింక్, రాగి, విటమిన్ డి, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. శారీరక బలాన్ని, దృఢత్వాన్ని పెంచుకోవాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక.
ఈ రెండింటిలో ఏది బెస్ట్?
చికెన్, మటన్ రెండింటి కాలేయాల్లోనూ ప్రోటీన్, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. జీర్ణవ్యవస్థ కాస్త బలహీనంగా ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు తక్కువ కొవ్వు ఉండే చికెన్ లివర్‌ను ఎంచుకోవచ్చు. రక్తహీనతను అధిగమించి, శారీరక శక్తిని పుంజుకోవాలనుకునే వారికి మటన్ లివర్ మేలు చేస్తుంది.
ఎవరు తినకూడదు?
కాలేయం ఎంతటి పోషకాహారమైనప్పటికీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు: యూరిక్ యాసిడ్ సమస్యలు, కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు కాలేయాన్ని దూరం పెట్టాలి.
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు: రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు దీనిని తీసుకోకూడదు.
గుండె జబ్బులు ఉన్న రోగులు: గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి.
గర్భిణీ స్త్రీలు: కాలేయంలో విటమిన్ ఎ చాలా ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో విటమిన్ ఎ అధికంగా తీసుకుంటే పిండంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నందున గర్భిణులు దీనిని ఎక్కువగా తినకూడదు.
వారానికి ఒకసారి లేదా అవసరాన్ని బట్టి పరిమిత మోతాదులో కాలేయాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఎటువంటి మందుల అవసరం లేకుండానే శరీరానికి అవసరమైన సంపూర్ణ పోషణ లభిస్తుంది.
(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణీ స్త్రీలు తమ ఆహారంలో మార్పులు చేసుకునే ముందు తప్పనిసరిగా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.)
