IPL Media Rights: ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో మొదలైన పోటీ.. పత్రాలు కొనుగోలు చేసిన 5 బడా కంపెనీలు..
IPL 2023 నుంచి 2027 వరకు మీడియా ప్రసార హక్కుల వేలం జూన్ 2022లో నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు ప్రారంభించింది. ఐపీఎల్ 15వ సీజన్ నుంచి 10 జట్లు పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2023 నుంచి 2027 వరకు మీడియా, ప్రసార హక్కుల(IPL Media Rights) కోసం క్రికెట్ బోర్డ్ ఆఫ్ ఇండియా (BCCI) టెండర్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీంతో బడా కంపెనీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అయ్యాయి. డిస్నీ, టీవీ-18 వయాకామ్, సోనీ, జీ, అమెజాన్ ప్రైమ్ మీడియా ప్రసార హక్కుల వేలంలో పాల్గొనేందుకు అవసరమైన పత్రాలను కొనుగోలు చేశాయి. ప్రస్తుతం ఐపీఎల్ ప్రసార హక్కులు స్టార్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే. మీడియా, ప్రసార హక్కుల ఆన్‌లైన్ వేలం జూన్ 2022లో జరగనుంది. మే 10 వరకు అవసరమైన పత్రాలను కొనుగోలు చేయవచ్చని బీసీసీఐ ప్రకటించింది. క్రికెట్ బోర్డు ఆఫ్ ఇండియా వర్గాల సమాచారం ప్రకారం, ఈ వేలంలో బడా టెక్ కంపెనీ ఆపిల్ కూడా పాల్గొనవచ్చని తెలుస్తోంది. అంతకుముందు, బీసీసీఐ సెక్రటరీ జై షా మాట్లాడుతూ, “ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా ఉంచనున్నాం. మేము ఎంత ఆదాయాన్ని ఆర్జించినా, భారత దేశవాళీ క్రికెట్ మౌలిక సదుపాయాలపై మాత్రమే పెట్టుబడి పెడతాం” అని తెలిపాడు.
ఈసారి మీడియా, ప్రసార హక్కుల వేలం చాలా ప్రత్యేకం. ఇది 4 సెట్లలో జరగనుంది. ఇందులో డిజిటల్ ప్రసార హక్కులు, టీవీ ప్రసార హక్కులు (భారత ఉపఖండం), 18 మ్యాచ్‌ల ప్రత్యేక సెట్, భారత ఉపఖండం వెలుపల, ఈ సెట్‌లన్నీ విడిగా వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇవన్నీ పూర్తిగా కలిసి వేలం వేశారు. రాబోయే ఏడాదికి మాత్రం విడివిడిగా వేలం వేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. మొత్తం రూ.32 వేల కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని బోర్డు ఉంచింది.
ఐపీఎల్ 15వ సీజన్ నుంచి లీగ్‌లో 10 జట్లు చేరాయి. ఈసారి 74 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాబట్టి 2023 నుంచి 2027 వరకు ఐదేళ్లలో 370 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ వేలంలో ముందుగా ప్రసార హక్కులు, టీవీ ప్రసార హక్కులు (భారత ఉపఖండం) వేలం వేయనున్నారు. ఆ తర్వాత మిగిలిన రెండు సెట్లను వేలం వేయనున్నారు.