Sachin Tendulkar: ‘నువ్వు మళ్లీ ఇలా చేస్తే ఇంటికే’.. నిర్ఘాంతపోయే విషయాన్ని బయటపెట్టిన మాస్టర్ బ్లాస్టర్..
తాను భారత జట్టు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి ఆ దేశంతో సిరీస్ ఆడుతున్నప్పుడు తన టీమ్ సభ్యుడితో కఠినంగా మాట్లాడవలసి వచ్చిందని సచిన్ అన్నాడు. ఎంతో ప్రశాంతంగా ఉండే వ్యక్తిగా, సౌమ్యుడిగా పేరున్న క్రికెట్ గాడ్..

క్రికెట్ చరిత్రలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఒక లెజెండరీ ఆటగాడు. అద్భుతమైన బ్యాటింగ్ శైలీతో ప్రపంచంలోని క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకున్న స్టార్ బ్యాట్స్‌మ్యాన్. సచిన్ టెండూల్కర్ తన సాటిలేని బ్యాటింగ్, ఆట పట్ల అతని చిత్తశుద్ధి, మైదానం వెలుపల గౌరవప్రదమైన ప్రవర్తనతో అభిమానుల అభిమానాన్ని పొందగలిగాడు. ఇప్పటికీ వన్డే, టెస్టు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు (100) చేసిన రికార్డులన్నీ సచిన్ పేరు మీదనే ఉన్నాయి. ఆటలోని తన నైపుణ్యంలో సచిన్ రెండు సార్లు టీమిండియా కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అయితే స్టార్ కెప్టెన్‌గా మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు.
అయితే మంగళవారం(డిసెంబర్ 20) జరిగిన ఓ కార్యక్రమంలో సచిన్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తాను భారత జట్టు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి ఆ దేశంతో సిరీస్ ఆడుతున్నప్పుడు తన టీమ్ సభ్యుడితో కఠినంగా మాట్లాడవలసి వచ్చిందని సచిన్ అన్నాడు. ఎంతో ప్రశాంతంగా ఉండే వ్యక్తిగా, సౌమ్యుడిగా పేరున్న క్రికెట్ లెజెండ్ చెప్పిన మాటలు విన్నవారంతా ఆశ్యర్యపోవడమేకాక నిర్ఘాంతపోయారు. మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్ సమయంలో జట్టులోని ఓ యువ ఆటగాడు వరుసగా తప్పిదాలు చేసినప్పుడు తాను కఠినంగా వ్యవహరించానని సచిన్ అన్నాడు. ఇలాగే ఫీల్డింగ్ తప్పిదాలను మళ్లీ మళ్లీ చేస్తే ఇంటికి పంపించేస్తానని ఆ ఆటగాడిని హెచ్చరించినట్లు మాస్టర్ బ్లాస్టర్ పేర్కొన్నాడు. అయితే ఆ యువ ఆటగాడు ఎవరనేది సచిన్ చెప్పలేదు.
“అప్పుడు నేను జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాను. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. జూనియర్ ఆటగాళ్ళలో ఒకరికి అది మొదటి పర్యటన. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సింగిల్ రావలసిన దానికి రెండు పరుగులు ఇచ్చాడు. ఓవర్ అయ్యాక అతన్ని పిలిచి భుజం మీద చెయ్యి వేసి ఇంకోసారి ఇలా చేస్తే నిన్ను ఇంటికి పంపిస్తాను. ఇక హోటల్‌కి తిరిగి వెళ్లకుండానే భారత్‌కు తిరిగి వెళ్తావని అన్నాను. నేను అతనితో చెప్పేది అక్కడివారిలో ఎవరూ వినలేదు’’ అని సచిన్ వెల్లడించాడు. ఇంకా ‘‘భారత్ తరఫున ఆడుతున్నప్పుడు ఎక్కడా రాజీపడలేదు. ఇది గొప్ప గౌరవం. మీ స్థానంలో ఉండాలనుకునే వారు లక్షలాది మంది ఉన్నారు. దీన్ని తేలికగా తీసుకోవద్దు’’ అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. కాగా సచిన్ కెప్టెన్‌గా ఆడిన 25 టెస్టుల్లో నాలుగింటిలో మాత్రమే టీమిండియా విజయం సాధించింది. మిగిలిన వాటిలో తొమ్మిది టెస్టులు ఓడిపోగా, 12 డ్రా అయ్యాయి.




మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
