ODI Cricket: వన్డే క్రికెట్ నుంచి భారత స్టార్ ఆల్ రౌండర్ రిటైర్మెంట్.. ఎప్పుడంటే? రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్..
రాబోయే కాలంలో చాలా మంది ఆటగాళ్లు వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలకవచ్చని భారత మాజీ క్రికెటర్, కోచ్ రవిశాస్త్రి పేర్కొనడంతో వన్డే ఫార్మాట్‌పై ఆందోళన కలిగించేలా చేస్తోంది.
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఇటీవల వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అతను క్రికెట్‌లోని మిగిలిన రెండు ఫార్మాట్‌లు అంటే టీ20, టెస్ట్‌లను ఆడటం కొనసాగించనున్నాడు. స్టోక్స్ రిటైర్మెంట్ తర్వాత వన్డే క్రికెట్ భవిష్యత్తుపై అనేక చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది మాజీ ఆటగాళ్లు ఈ ఫార్మాట్ క్రికెట్‌ను త్వరలో పక్కన పెట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లిస్టులో భారత వెటరన్ రవిశాస్త్రి పేరు కూడా చేరింది. వన్డే క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడనుందని అభిప్రాయపడ్డాడు. దీనితో పాటు, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు కూడా త్వరలో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతారని కీలక వ్యాఖ్యలు చేశాడు.
స్కై స్పోర్ట్స్‌తో రవిశాస్త్రి మాట్లాడుతూ, ’50 ఓవర్ల ఫార్మాట్‌ను పక్కన పెట్టొచ్చు. అయితే ప్రపంచకప్‌పైనే దృష్టి పెడితే ఈ ఫార్మాట్ నిలదొక్కుకోగలదు. ప్రపంచకప్‌కు ఐసీసీ అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. టెస్ట్ క్రికెట్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఇది క్రికెట్‌లో ముఖ్యమైన భాగం. అయితే ఇది కాకుండా, ఇతర ఫార్మాట్లలో, కొంతమంది ఆటగాళ్లు వారు ఏ ఫార్మాట్‌లో ఆడాలనుకుంటున్నారో ఇప్పటికే నిర్ణయించుకుంటున్నారు’ అంటూ తెలిపాడు.
ఇక్కడ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి రవిశాస్త్రి మాట్లాడుతూ, ‘హార్దిక్ పాండ్యాను మాత్రమే తీసుకోండి. అతను T20 క్రికెట్ ఆడాలనుకుంటున్నాడు. “నేను ఇంకేమీ ఆడకూడదనుకుంటున్నాను” అని అతని మనస్సులో చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు అతను 50 ఓవర్ల క్రికెట్ ఆడతాడు. ఎందుకంటే వచ్చే ఏడాది భారతదేశంలో ప్రపంచ కప్ ఉంది. అయితే ఆ తర్వాత అతడు వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకడాన్ని మీరు చూడొచ్చు. ఇతర ఆటగాళ్లతో కూడా ఇది జరగడాన్ని మీరు త్వరలోనే చూస్తారు. వారు తమకు ఇష్టమైన ఫార్మాట్‌ను ఎంచుకోవడం ప్రారంభించే ఛాన్స్ ఉంది’ అంటూ పేర్కొన్నాడు.