T20 World Cup 2026 : ఇండియా-పాక్ మ్యాచ్‌కు వానగండం.. మ్యాచ్ రద్దయితే ఆ మూడు జట్లు టోర్నీ నుంచి అవుట్
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబో వేదికగా జరగనున్న భారత్-పాకిస్థాన్ మహా సంగ్రామం పై ఇప్పుడు వరుణుడి నీడ కమ్ముకుంది. ఇరు జట్లు వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నప్పటికీ, కొలంబోలోని వాతావరణ పరిస్థితులు క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబో వేదికగా జరగనున్న భారత్-పాకిస్థాన్ మహా సంగ్రామం పై ఇప్పుడు వరుణుడి నీడ కమ్ముకుంది. ఇరు జట్లు వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నప్పటికీ, కొలంబోలోని వాతావరణ పరిస్థితులు క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే, అది కేవలం అభిమానులకే కాదు.. గ్రూప్-A లోని మరో మూడు జట్ల ఆశలపై కూడా నీళ్లు చల్లినట్లవుతుంది.
కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే శ్రీలంక వాతావరణ శాఖ అందించిన తాజా నివేదికల ప్రకారం.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొలంబోలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం ఏకంగా 94 శాతం ఉందని తెలుస్తోంది. స్టేడియంలో డ్రైనేజీ వ్యవస్థ అద్భుతంగా ఉన్నప్పటికీ, నిరంతరాయంగా వర్షం పడితే మ్యాచ్ నిర్వహించడం కష్టతరమవుతుంది.
ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది?
గ్రూప్ స్టేజ్ మ్యాచులకు ఐసీసీ ఎలాంటి రిజర్వ్ డే కేటాయించలేదు. కాబట్టి వర్షం వల్ల కనీసం 5 ఓవర్ల ఆట కూడా సాధ్యం కాకపోతే, ఇరు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున కేటాయిస్తారు. ప్రస్తుతం ఈ రెండు జట్లు తలా 4 పాయింట్లతో (2 మ్యాచుల్లో 2 విజయాలు) అగ్రస్థానంలో ఉన్నాయి. పాయింట్ విడిపోతే ఇద్దరికీ 5 పాయింట్లు వస్తాయి. ఇది వారు సూపర్ 8కి చేరుకోవడానికి దాదాపు సరిపోతుంది.
ఒకవేళ భారత్, పాక్ జట్లు 5 పాయింట్లకు చేరుకుంటే.. గ్రూప్-A లోని మిగిలిన మూడు జట్లు అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాలు అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. ఎందుకంటే ఆ జట్లు తమ తదుపరి మ్యాచుల్లో గెలిచినా గరిష్టంగా 4 పాయింట్లకు మించి సాధించలేవు. దీంతో పరోక్షంగా వర్షం ఈ మూడు జట్లకు మృత్యుపాశం కానుంది.
జట్ల వ్యూహాలు, ఫిట్‌నెస్
వర్షం పడి మ్యాచ్ ఓవర్లు తగ్గితే (DLS పద్ధతిలో), అది ఎవరికి లాభిస్తుందో చెప్పడం కష్టం. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఇప్పటికే ఇలాంటి షార్ట్ మ్యాచ్‌ల కోసం తమ దగ్గర పక్కా ప్లాన్ ఉందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫిట్‌నెస్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. తడి అవుట్‌ఫీల్డ్‌లో గాయాల ముప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆటగాళ్ల ఫిట్‌నెస్ కూడా ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించనుంది.
పిచ్ రిపోర్ట్, స్పిన్నర్ల పాత్ర
కొలంబో పిచ్ సాధారణంగా స్లోగా ఉంటుంది. వర్షం వల్ల పిచ్‌పై తేమ ఉంటే, అది స్పిన్నర్లకు మరింత కలిసివస్తుంది. భారత్ తరపున వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్.. పాక్ తరపున అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. టాస్ గెలిచిన జట్టు వర్షం ముప్పును దృష్టిలో ఉంచుకుని ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
