AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: అదే జరిగితే.. సెమీస్‌లో టీమిండియా ఇంటికేనా.? ఫైనల్ ఆడబోయేది ఎవరు.?

సిడ్నీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి.. టోర్నీ నుంచి ఆస్ట్రేలియాను నాకౌట్‌ చేసింది.

T20 World Cup: అదే జరిగితే.. సెమీస్‌లో టీమిండియా ఇంటికేనా.? ఫైనల్ ఆడబోయేది ఎవరు.?
Team India
Ravi Kiran
|

Updated on: Nov 05, 2022 | 5:57 PM

Share

టీ20 వరల్డ్‌కప్‌-2022 చివరి దశకు చేరుకుంది. గ్రూప్-ఏ నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్ వెళ్లాయి. సిడ్నీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి.. టోర్నీ నుంచి ఆస్ట్రేలియాను నాకౌట్‌ చేసింది. సెమీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అద్భుతమైన పోరాటపటిమ చూపించింది. చివరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగగా.. ఆఖరికి విజయం ఇంగ్లాండ్‌నే వరించింది.

ఇక గ్రూప్-బీ విషయానికొస్తే.. తొలుత ఈ గ్రూప్ నుంచి సెమీస్ బెర్త్‌లు ఈజీగా ఖరారు అవుతాయని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత అంచనాలు తలక్రిందులయ్యాయి. చిన్న జట్లు జింబాబ్వే, బంగ్లాదేశ్‌లు.. పెద్ద జట్లపై అద్భుతంగా పోరాడటంతో.. ఈ గ్రూప్ సెమీస్ రేస్ కూడా రసవత్తరంగా మారింది. ఇక రేపు జరగబోయే మ్యాచ్‌లతో ఈ గ్రూప్‌ సెమీస్ బెర్త్‌లు ఖరారు కానున్నాయి. ప్రస్తుతం ఈ గ్రూప్-బీలో భారత్‌(6 పాయింట్లు, +0.730), సౌతాఫ్రికా(5 పాయింట్లు, +1.441), పాకిస్తాన్‌(4 పాయింట్లు, +1.117) జట్లు సెమీస్ రేసులో ఉన్నాయి. ఆదివారం జింబాబ్వేతో టీమిండియా, నెదర్లాండ్స్‌తో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ తలబడనున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే క్రికెట్ ఫ్యాన్స్ సెమీస్ ప్రిడిక్షన్స్ మొదలు పెట్టేశారు. ఒకవేళ అలా జరిగితే సెమీస్‌లోనే టీమిండియా ఇంటికి వెళ్తుందని.. ఫైనల్ ఆడబోయే జట్లు ఇవేనని అంటున్నారు. మరి అదేంటంటే.. మొదటిగా రేపు జరగబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. జింబాబ్వేపై టీమిండియా అద్భుత విజయాన్ని అందుకోవడం, నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా కూడా గెలుపొందడం పక్కా.. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ మాత్రం కొంచెం రసవత్తరంగా ఉంటుంది. ఒకవేళ టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు తమ మ్యాచ్‌లలో విజయం సాధిస్తే.. పాకిస్తాన్ తన చివరి మ్యాచ్‌లో గెలిచినా.. పెద్దగా ప్రయోజనం ఉండదు. దీంతో గ్రూపు-బీ నుంచి టీమిండియా, సౌతాఫ్రికాలు టాప్ 1, 2గా సెమీస్ చేరుకుంటాయి.

సెమీఫైనల్ ఫైట్‌లో ఇండియా వెర్సస్ ఇంగ్లాండ్(A2 Vs B1), దక్షిణాఫ్రికా వెర్సస్ న్యూజిలాండ్(A1 Vs B2) జరుగుతుంది. ఒకవేళ ఇలా జరిగితే.. టీమిండియాపై ఇంగ్లాండ్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. భారత్ జట్టులో పలు లోపాలు ఉన్నాయని, అవే టీమిండియా కొంపముంచే అవకాశం ఉందని క్రీడాభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ ఫామ్ లేమి స్పష్టంగా కనిపిస్తోందని వాపోతున్నారు. గెలుపు కోసం విరాట్ కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తే సరిపోదని.. కచ్చితంగా ఎవరో ఒకరు తోడుగా ఉండాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, రాహుల్‌ బిగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడటమే కాదు.. లోయర్‌ ఆర్డర్‌లో కార్తీక్‌ లేదా పంత్‌ మెరుపులు ఉంటేనే భారీ స్కోర్‌ సాధించగలమని.. ఇంగ్లాండ్‌ జట్టులో హిట్టర్లు ఉన్న సంగతి మర్చిపోకూడదని అంటున్నారు. సెమీస్‌లో టీమిండియా గెలిచి ఫైనల్‌ చేరాలంటే అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లలో టీమిండియా అద్భుతంగా రాణించాలంటున్నారు. ఇక టీమిండియా సెమీస్‌లో ఇంటి దారిపడితే.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..