T20 World Cup 2026 : గ్రూప్ స్టేజ్ ఖతం.. సూపర్-8 వార్ షురూ.. టీమిండియా ముందున్న సవాళ్లు ఇవే
T20 World Cup 2026 : 2026 టీ20 వరల్డ్ కప్ సమరం క్లైమాక్స్‌కు చేరుకుంది. లీగ్ దశలో నామమాత్రపు మ్యాచ్‌లు మినహా గ్రూప్ స్టేజ్ పోరాటాలన్నీ దాదాపుగా ముగిశాయి. గ్రూప్-బి లో నేడు (శుక్రవారం) ఆస్ట్రేలియా, ఓమన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ దశకు అధికారికంగా తెరపడనుంది.

T20 World Cup 2026 : 2026 టీ20 వరల్డ్ కప్ సమరం క్లైమాక్స్‌కు చేరుకుంది. లీగ్ దశలో నామమాత్రపు మ్యాచ్‌లు మినహా గ్రూప్ స్టేజ్ పోరాటాలన్నీ దాదాపుగా ముగిశాయి. గ్రూప్-బి లో నేడు (శుక్రవారం) ఆస్ట్రేలియా, ఓమన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ దశకు అధికారికంగా తెరపడనుంది. ఇప్పటికే సూపర్-8 చేరిన జట్లు తమ గ్రూపుల వివరాలను తెలుసుకున్నాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో అసలైన మజా రేపటి నుంచి మొదలవ్వబోతోంది.
సూపర్-8 గ్రూపుల విభజన
సూపర్-8 చేరిన 8 జట్లను ఐసీసీ సీడింగ్ ప్రకారం రెండు గ్రూపులుగా విభజించింది. ప్రతి గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
గ్రూప్-1: భారత్, సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్.
గ్రూప్-2: పాకిస్థాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక.
హోరాహోరీ షెడ్యూల్
సూపర్-8 యుద్ధం ఫిబ్రవరి 21 (శనివారం) నుంచి ప్రారంభమై మార్చి 1 వరకు సాగుతుంది. తొలిపోరు శనివారం రాత్రి 7 గంటలకు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్ vs న్యూజిలాండ్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన తొలి సూపర్-8 మ్యాచ్‌ను ఆదివారం (ఫిబ్రవరి 22) రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌతాఫ్రికాతో ఆడుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కాండీలో ఇంగ్లాండ్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేతో, మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో టీమిండియా తలపడనుంది.
పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాకింగ్ కామెంట్స్
సెమీఫైనల్ చేరే జట్లపై మాజీ క్రికెటర్లు భిన్నమైన అంచనాలు వేస్తున్నారు. యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ కైఫ్ వంటి వారు భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు టాప్-4లో ఉంటాయని చెబుతుంటే, పుజారా మాత్రం గ్రూప్-2 నుంచి శ్రీలంకకు మొగ్గు చూపారు. అయితే పాక్ మాజీ పేసర్ మొహమ్మద్ అమీర్ మాత్రం భారత్ సెమీస్ చేరదని జోస్యం చెప్పి కలకలం రేపారు. గ్రూప్-1 నుండి సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లే ముందుకు వెళ్తాయని, భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలుతోందని ఆయన విమర్శించారు.
మరోసారి భారత్-పాక్ సమరం సాధ్యమేనా?
లీగ్ దశలో భారత్ చేతిలో ఓడిపోయిన పాక్, సూపర్-8లో మాత్రం వేరే గ్రూపులో ఉంది. కాబట్టి ఈ రెండు జట్ల మధ్య పోరు కేవలం సెమీఫైనల్ లేదా ఫైనల్‌లో మాత్రమే సాధ్యమవుతుంది. భారత్ తన గ్రూపులో టాపర్‌గా ఉండి, పాక్ తన గ్రూపులో రెండో స్థానంలో నిలిచినా (లేదా వైస్ వెర్సా) సెమీస్‌లో ఢీకొంటాయి. భారత్-పాక్ మధ్య నాకౌట్ మ్యాచ్ ఎక్కడ జరిగినా అది శ్రీలంకలోని కొలంబో వేదికగానే జరుగుతుంది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ జట్టు భారత్‌కు రావడం లేదు కాబట్టి, వారు ఆడే సెమీఫైనల్ లేదా ఫైనల్ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించేలా ఐసీసీ ముందే షెడ్యూల్ ఖరారు చేసింది.
