AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 15,000 జీతంతో కూడా అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు.. ఈ ఫార్మూలా ఫాలో అయితే చాలు..

సంపాదన తక్కువ.. ఖర్చులు ఎక్కువ.. ఈ రోజుల్లో ప్రతి సామాన్య కుటుంబం నుంచీ వినిపించే మాట ఇది. చేతిలో ఐదు పైసలు కూడా మిగలకుండా ఇల్లు గడవడం కష్టంగా మారిన తరుణంలో.. అప్పుల ఊబిలో పడకుండా ప్రశాంతంగా బతకడం ఎలాగో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. నెలకు రూ. 15,000 జీతం ఉన్న వారు సైతం ఈ ఫార్మూల్ ఫాలో అయితే అప్పు లేకుండా బతకొచ్చు..

రూ. 15,000 జీతంతో కూడా అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు.. ఈ ఫార్మూలా ఫాలో అయితే చాలు..
How To Save Money
Krishna S
|

Updated on: Jun 14, 2026 | 9:55 PM

Share

ప్రస్తుతం ఉన్న రోజుల్లో పెరుగుతున్న ధరలు, ఆకాశాన్నంటుతున్న ఖర్చుల మధ్య సామాన్యుడు సంసారాన్ని ఈదడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఎంత కష్టపడి సంపాదించినా, నెల ఆఖరు వచ్చేసరికి జేబు ఖాళీ అయిపోయి.. చేబదుళ్లు, అప్పులు చేయాల్సిన పరిస్థితి చాలా మందికి ఎదురవుతుంటుంది. ముఖ్యంగా నెలకు రూ.15,000 లోపు ఆదాయం ఉన్నవారికి కుటుంబాన్ని పోషించడమే గగనమైపోతోంది. అయితే ‘‘మన ఆదాయాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా ఖర్చు చేయాలి’’ అనే పెద్దల మాటను సరైన ఆర్థిక ప్రణాళికతో అమలు చేస్తే.. రూ.15,000 జీతంతో కూడా ఒక్క రూపాయి అప్పు లేకుండా, ప్రశాంతంగా జీవిస్తూ.. భవిష్యత్తు కోసం పొదుపు కూడా చేయవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఉపయోగపడే 60 – 30 – 10 బడ్జెట్ ఫార్ములా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

60 శాతం: నిత్యావసరాలు, అత్యవసర ఖర్చులు

ఈ బడ్జెట్ రూల్ ప్రకారం.. మీ చేతికొచ్చే రూ. 15,000 జీతంలో ముందుగా 60 శాతం అంటే రూ. 9,000* ను మీ ప్రాథమిక అవసరాల కోసం పక్కన పెట్టేయాలి. ఇందులో ఇంటి అద్దె, కిరాణా సామాగ్రి, కరెంట్ బిల్లు, నీటి బిల్లు, ఆఫీస్ లేదా వ్యాపారానికి వెళ్లడానికి అయ్యే ప్రయాణ ఖర్చులు ఉంటాయి. ఈ కేటగిరీలో డబ్బు ఆదా అవ్వాలంటే.. వీలైనంత వరకు బయట హోటళ్లలో తినడం తగ్గించి, ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మేలు చేస్తుంది.

30 శాతం: వ్యక్తిగత అవసరాలు, కోరికలు

మీ జీతంలో మిగిలిన 30 శాతం అంటే సుమారు రూ.4,500 ను మీ వ్యక్తిగత అవసరాలు లేదా ఇతర కోరికల కోసం కేటాయించుకోవచ్చు. ఈ మొత్తాన్ని కొత్త బట్టలు కొనడానికి, పండుగ ఖర్చులకు, ఇళ్లలో ఎవరికైనా చిన్నపాటి వైద్య ఖర్చులు లేదా కుటుంబంతో కలిసి వినోదం, ప్రయాణాల కోసం ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ విభాగం కోసం కేటాయించిన 30 శాతానికి మించి ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయకూడదని గట్టిగా నియమం పెట్టుకోవాలి.

10 శాతం: తప్పనిసరి పొదుపు

ఆదాయం తక్కువగా ఉంది కదా అని చాలా మంది అసలు పొదుపు చేయడమే మానేస్తుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆదాయం ఎంత తక్కువైనా సరే, పొదుపు చేయడం అస్సలు ఆపకూడదు. ఇందుకోసం మీ జీతంలో కనీసం 10 శాతం అంటే రూ. 1,500 పక్కన పెట్టాలి. ఈ రూ.1,500 ను మీరు భవిష్యత్తులో వచ్చే ఏదైనా అత్యవసర ఖర్చుల కోసం మీ బ్యాంకు అకౌంట్లోనే ఉంచేయవచ్చు. లేదా సురక్షితమైన రాబడి కోసం పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు ద్వారా ప్రతి నెలా రూ.1,000 నుండి రూ. 1,500 వరకు రికరింగ్ డిపాజిట్ పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది కొన్ని నెలల తర్వాత మీకు ఒకేసారి పెద్ద మొత్తంలో చేతికి అందుతుంది.

అప్పుల పాలు కాకుండా ఉండాలంటే ఈ 2 నియమాలు తప్పనిసరి:

ఈఎంఐ లు, క్రెడిట్ కార్డులకు దూరం: మీ ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు, వాయిదాల పద్ధతిలో అనవసరమైన వస్తువులను కొనడం మరియు క్రెడిట్ కార్డులను ఉపయోగించడం పూర్తిగా మానుకోవాలి. ఇవి మిమ్మల్ని సులభంగా అప్పుల ఊబిలోకి లాగేస్తాయి.

ఖర్చులపై నిఘా: ప్రతిరోజూ మీరు పెట్టే చిన్న ఖర్చును కూడా ఒక డైరీలో లేదా మొబైల్ యాప్‌లో నోట్ చేసి పెట్టుకోండి. నెల చివర్లో చూసుకుంటే.. అనవసరమైన చోట్ల డబ్బు ఎక్కడ వృధా అవుతుందో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. తద్వారా వచ్చే నెలలో ఆ తప్పు జరగకుండా ఆపవచ్చు.

డబ్బు ఎంత సంపాదిస్తున్నామనే దానికంటే.. ఉన్న డబ్బును ఎంత తెలివిగా మేనేజ్ చేస్తున్నామనేదే ముఖ్యం. నెలకు రూ. 15,000 జీతం ఉన్నవారు కూడా ఈ 60-30-10 మంత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తే, ఎవరి ముందూ చేయి చాపకుండా.. హ్యాపీగా అప్పుల్లేని లైఫ్ లీడ్ చేయవచ్చు.

Follow Us