LPL 2023 Auction: లంక ప్రీమియర్ లీగ్ వేలంలో సురేశ్ రైనా.. భారీగా ధర పలికే అవకాశం..
LPL 2023 Player Auction: లంక ప్రీమియర్ లీగ్ జులై 31 నుంచి ప్రారంభంకానుంది. కొలంబోలో జూన్ 14 నుంచి ఎల్‌పీఎల్ ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనే దేశీ, విదేశీ ఆటగాళ్ల జాబితాలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కూడా ఉన్నారు.
Suresh Raina: భారత మాజీ స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా శ్రీలంకలో జరిగే లంక ప్రీమియర్ లీగ్(LPL 2023)లో ఆడనున్నాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు విడుదల చేసిన ఎల్పీఎల్ 2023 ఆటగాళ్ల వేలంలో పాల్గొనే పలువురు దేశీ, విదేశీ ఆటగాళ్ల జాబితాలో 36 ఏళ్ల సురేశ్ రైనా పేరు కూడా ఉంది. ఈ లీగ్‌లో బాబర్ అజమ్‌తో పాటు మరికొందరు పాకిస్థాన్ క్రికెటర్లు కూడా పాలుపంచుకోనున్నారు. కొలంబోలో జూన్ 14న ఎల్‌పీఎల్ ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. టీ20 ఫార్మట్ క్రికెట్‌లో పరుగుల వరద పారించే సొగసరి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌గా రైనా ఓ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఐపీఎల్‌లో CSK టీమ్‌లో 2008 నుంచి 2021 వరకు రైనా ఆడాడు. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఒక్క 2020 సీజన్‌లో మాత్రం వ్యక్తిగత కారణాలతో యూఏఈ నుంచి రైనా వెనక్కి వచ్చేశారు. సీఎస్కే జట్టులోకి తీసుకోకపోవడంతో సురేశ్ రైనా రిటైర్మెంట్ ప్రకటించారు. 205 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన రైనా 5500కి పైగా పరుగులు చేశాడు. సీఎస్కేతో పాటు గుజరాత్ లయన్స్ జట్టుకు కూడా ఆడిన సురేష్ రైనా.. జాతీయవాళీ క్రికెట్‌లో ఉత్తర ప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యంవహించాడు.
బీసీసీఐ నిబంధనల ప్రకారం దేశీయవాళీ క్రికెట్‌లోని అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ పలికిన తర్వాత భారత క్రికెటర్లు విదేశీ ఫ్రాంచైజీ లీగుల్లో ఆడొచ్చు. మాజీ భారత అండర్ -19 క్రికెటర్ ఉన్‌ముక్త్ చంద్, హర్మీత్ సింగ్ తదితర ఆటగాళ్లు దేశీయవాళీ క్రికెట్‌లోని అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించి.. అమెరికాలో ఫ్రాంచైజీ లీగ్ మ్యాచ్‌లు ఆడుతున్నారు. వారి బాటలోనే సురేశ్ రైనా.. లంక ప్రీమియర్ లీగ్‌లో పాలుపంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది.
లంక ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాళ్లలో సురేశ్ రైనా పేరు కూడా వినిపిస్తోంది. లంక ప్రీమియర్ లీగ్‌లో సురేశ్ రైనా ఆడనుండటంతో భారత క్రికెట్ అభిమానులు కూడా ఎక్కువ సంఖ్యలో ఈ మ్యాచ్‌లను వీక్షించే అవకాశముంది. లంక ప్రీమియర్ లీగ్ జులై 31 నుంచి ప్రారంభంకానుంది.
మరిన్ని క్రికెట్ వార్తలు చదవండి..