AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు.. కేకేఆర్ దిగ్గజం పై షారుఖ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్

IPL 2026 : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరేన్ తన బౌలింగ్‌తో మళ్లీ మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు.

IPL 2026 : ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు.. కేకేఆర్ దిగ్గజం పై షారుఖ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్
Sunil Narine Shah Rukh Khan
Rakesh
|

Updated on: May 04, 2026 | 9:39 AM

Share

IPL 2026 : ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అంటే గుర్తుకువచ్చే పేర్లలో సునీల్ నరేన్ ఒకరు. దశాబ్ద కాలంగా తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన ఈ వెస్టిండీస్ దిగ్గజం, తాజాగా మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నరేన్ తన ఐపీఎల్ కెరీర్‌లో 200 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ చారిత్రక ఘట్టంపై కేకేఆర్ యజమాని, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అత్యంత భావోద్వేగంతో స్పందించారు.

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరేన్ తన బౌలింగ్‌తో మళ్లీ మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. ఈ అద్భుతమైన ఘనతపై షారుఖ్ ఖాన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “సునీల్, మై ఫ్రెండ్.. ఇది మన 15వ సీజన్. 200కు పైగా వికెట్లు, 3 ఐపీఎల్ టైటిళ్లు.. ప్రపంచవ్యాప్తంగా కేకేఆర్ ఫ్రాంచైజీకి ఎన్నో విజయాలు అందించావు. నువ్వు ఒక మెజీషియన్‎వి. నిన్ను మేం మా కుటుంబ సభ్యుడిలా ప్రేమిస్తాం. ఎప్పుడూ నవ్వుతూ, ఆరోగ్యంగా ఉండు” అంటూ ఆత్మీయంగా రాసుకొచ్చారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో నరేన్ తన విశ్వరూపం చూపాడు. ఓవర్ తొలి బంతికి సలీల్ అరోరాను అవుట్ చేసి తన 200వ ఐపీఎల్ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత అదే ఓవర్ చివరి బంతికి డేంజర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను పెవిలియన్‌కు పంపి 201వ వికెట్‌ను అందుకున్నాడు. మొత్తంగా 4 ఓవర్లలో 31 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. 2012లో కేకేఆర్ ద్వారా ఐపీఎల్ ఆరంగేట్రం చేసిన నరేన్, ఇప్పటివరకు 197 మ్యాచుల్లో 6.79 అత్యుత్తమ ఎకానమీతో ఈ ఘనత సాధించడం విశేషం.

ఐపీఎల్‌లో 200 వికెట్ల మార్కును దాటిన బౌలర్ల జాబితాలో నరేన్ ఇప్పుడు మూడో స్థానానికి చేరాడు. ఇతనికంటే ముందు యుజ్వేంద్ర చాహల్ (228 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (215 వికెట్లు) మాత్రమే ఉన్నారు. అయితే, వీరిద్దరికంటే సునీల్ నరేన్ ఎకానమీ రేట్ (6.79) చాలా మెరుగ్గా ఉండటం గమనార్హం. కేకేఆర్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నరేన్ రికార్డు ఇప్పట్లో ఎవరూ చెరిపివేయలేనిది.

సునీల్ నరేన్ కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు, కేకేఆర్ జట్టుకు ఒక నమ్మకం. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణిస్తూ ఆల్ రౌండర్ అంటే ఇలా ఉండాలని నిరూపిస్తున్నాడు. షారుఖ్ ఖాన్ చెప్పినట్లుగా, నరేన్ నిజంగానే ఒక క్రికెట్ మాంత్రికుడు . ఈ సీజన్ ముగిసేలోపు నరేన్ మరిన్ని వికెట్లు తీసి జాబితాలో ఇంకా పైకి ఎగబాకాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us