Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి పథకంలో జాక్‌పాట్.. మీ కుమార్తె పేరుపై రూ. 72 లక్షలు పొందే సూపర్ ఛాన్స్!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకం ఆడపిల్లల భవిష్యత్తుకు అద్భుతమైన ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ చిన్న మొత్తాల పొదుపు పథకానికి కేంద్రం 8.2 శాతం భారీ వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకంలో ప్రతి నెలా 12,500 రూపాయల చొప్పున ఏడాదికి గరిష్టంగా 1.50 లక్షల రూపాయలను 15 సంవత్సరాల పాటు పొదుపు చేయడం ద్వారా, మెచ్యూరిటీ సమయానికి చక్రవడ్డీతో కలిపి దాదాపు రూ. 72 లక్షల భారీ నిధిని సొంతం చేసుకోవచ్చు.

ప్రతి తల్లిదండ్రులు తమ కుమార్తెలకు ఉన్నత చదువులు చదివించాలని, వారి వివాహాన్ని ఘనంగా జరిపించాలని ఆశపడుతుంటారు. అయితే మారుతున్న కాలంలో పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా, ఆడపిల్లల భవిష్యత్తు కోసం ముందు నుంచే సరైన ప్రణాళికతో పొదుపు చేయడం ఎంతో అవసరం. ఇటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన చిన్న మొత్తాల పొదుపు పథకమే ‘సుకన్య సమృద్ధి యోజన’. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర పొదుపు పథకాల కంటే ఈ స్కీమ్ అత్యధికంగా సంవత్సరానికి 8.2 శాతం భారీ వడ్డీ రేటును అందిస్తూ మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద వరంగా మారింది. ప్రభుత్వ పూర్తి గ్యారెంటీతో కూడిన ఈ పథకం ద్వారా మీ కుమార్తె పేరు మీద ఎలాంటి రిస్క్ లేకుండా సుమారు ర. 72 లక్షల భారీ నిధిని ఎలా నిర్మించవచ్చో తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి యోజన నియమాలు ఈ పథకం కింద మీ కుమార్తెకు 10 ఏళ్ల వయస్సు నిండక ముందే, సమీపంలోని ఏదైనా పోస్టాఫీసు లేదా ప్రభుత్వ బ్యాంకుకు వెళ్లి చాలా సులభంగా ఖాతాను తెరవవచ్చు. బాలిక తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు మాత్రమే ఈ ఖాతాను తెరిచి నిర్వహించడానికి అర్హులు. ఒక చిన్నారి పేరు మీద కేవలం ఒకే ఒక్క ఖాతాను మాత్రమే తెరవడానికి అనుమతి ఉంటుంది. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే, ఇందులో సంవత్సరానికి కనీసం రూ.250 నుండి గరిష్టంగా 1.5 లక్షల రూపాయల వరకు పొదుపు చేసుకునే వెసులుబాటు ఉంది. పన్ను ఆదా చేసుకోవాలనుకునే వారికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇందులో పెట్టే పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది.
72 లక్షలు వచ్చే లెక్క ఇదే సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఇంతటి భారీ లాభం రావడానికి ప్రధాన కారణం ఇందులో వర్తించే ‘చక్రవడ్డీ’ (కాంపౌండ్ ఇంట్రెస్ట్) విధానమే. మీరు డిపాజిట్ చేసే అసలు మొత్తంపైనే కాకుండా, ఏటా వచ్చే వడ్డీపై కూడా తిరిగి వడ్డీ లభిస్తుంది. దీనివల్ల దీర్ఘకాలంలో మీ పెట్టుబడి ఊహించని విధంగా అనేక రెట్లు పెరుగుతుంది. ఆ జాక్‌పాట్ రూ. 72 లక్షల లెక్క వివరాలు తెలుసుకుందాం.
తల్లిదండ్రులు తమ కుమార్తె భవిష్యత్తు కోసం ఈ ఖాతాలో ప్రతి నెలా సుమారు 12,500 రూపాయలు ఆదా చేస్తున్నారని అనుకుందాం. అప్పుడు సంవత్సరానికి వారు జమ చేసే మొత్తం ఈ పథకం గరిష్ట పరిమితి అయిన 1.50 లక్షల రూపాయలు అవుతుంది. ఇలా వరుసగా 15 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తే, తల్లిదండ్రులు చెల్లించే మొత్తం పెట్టుబడి 22.50 లక్షల రూపాయలు అవుతుంది.
ఈ పథకం నిబంధనల ప్రకారం, మీరు కేవలం మొదటి 15 సంవత్సరాలు మాత్రమే డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన 6 సంవత్సరాల పాటు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఖాతాకు 21 సంవత్సరాలు నిండి మెచ్యూరిటీ సమయం వచ్చేసరికి, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రస్తుత 8.2% చక్రవడ్డీ రేటు ప్రకారం మీ కుమార్తె ఖాతాలో మొత్తం 71.82 లక్షల రూపాయలు, అంటే దాదాపు 72 లక్షల రూపాయల భారీ నిధి జమ అవుతుంది.
మీరు మీ చేతుల మీదుగా పెట్టుబడి పెట్టిన అసలు మొత్తం కేవలం 22.50 లక్షల రూపాయలు మాత్రమే అయినప్పటికీ, కేంద్రం ఇచ్చే చక్రవడ్డీ మాయాజాలం వల్ల కేవలం వడ్డీ రూపంలోనే అదనంగా 49.32 లక్షల రూపాయల భారీ లాభం మీ సొంతమవుతుంది. అంటే మీ అసలు పెట్టుబడి కంటే రెండింతల కంటే ఎక్కువ మొత్తం వడ్డీ రూపంలోనే లభిస్తుంది. ఉన్నత చదువుల కోసం లేదా వివాహ ఖర్చుల కోసం ఆర్థిక ఇబ్బందులు పడకుండా, చిన్న వయస్సు నుంచే చేసే ఇటువంటి చిన్న పొదుపులు దీర్ఘకాలంలో కొండంత అండగా మారుతాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఈ సురక్షితమైన పథకాన్ని సద్వినియోగం చేసుకుని మీ కుమార్తెల కలలకు ఆర్థిక రెక్కలను తొడగండి.
