IPL 2026: ఐపీఎల్ వేలంలో తొలిసారి కనిపించనున్న శ్రేయాస్ అయ్యర్.. కారణం ఏంటో తెలుసా?
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 వేలానికి రంగం సిద్ధమైంది. అయితే, ఈసారి వేలంలో శ్రేయాస్ అయ్యర్ కనిపించనున్నాడు. అందుకు ఓ స్పెషల్ రీజన్ కూడా ఉందండోయ్. ఒక జట్టు కెప్టెన్ హాజరు కావడం ఇదే మొదటిసారి కాదు. రెండు సీజన్ల క్రితం, అప్పటి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా వేలానికి హాజరయ్యాడు.

IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనున్న ఈ వేలంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తొలిసారిగా వేలంపాటలో పాల్గొననున్నాడు. సాధారణంగా జట్టు యజమానులు, కోచ్‌లు వేలంలో పాల్గొంటారు. కానీ, ఈసారి కెప్టెన్ అయ్యర్ స్వయంగా వేలం టేబుల్ వద్ద కనిపించనున్నాడు.
ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే:
కోచ్ రికీ పాంటింగ్ గైర్హాజరు: పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఈ వేలానికి దూరంగా ఉండనున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ (Ashes) సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌కు కామెంటేటర్‌గా రికీ పాంటింగ్ వ్యవహరిస్తున్నాడు. ఈ బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన అబుదాబికి రాలేకపోతున్నాడు. అందుకే, జట్టు బాధ్యతలను సమన్వయం చేసుకునేందుకు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వేలంలో పాల్గొననున్నాడు.
శ్రేయాస్ అయ్యర్ గాయం: మరోవైపు, శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ ఆడుతుండగా క్యాచ్ పట్టే క్రమంలో అతని పక్కటెముకలకు గాయమైంది. దీనికి శస్త్రచికిత్స కూడా జరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్న అయ్యర్, జనవరి 2026లో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ ద్వారా మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఖాళీ సమయం ఉండటం వల్ల ఆయన వేలానికి హాజరవుతున్నాడు.
కేవలం 4 స్లాట్లు మాత్రమే: పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటికే సమతుల్యంగా ఉంది. ఈ మినీ వేలంలో వారు కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంది. పెద్దగా కొనుగోళ్లు లేకపోవడంతో కోచ్ లేకుండానే, కెప్టెన్, ఇతర సిబ్బందితో వేలం ప్రక్రియను పూర్తి చేయాలని పంజాబ్ యాజమాన్యం భావిస్తోంది.
గతంలో రిషబ్ పంత్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇలాగే వేలంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అయ్యర్ కూడా అదే బాటలో నడుస్తూ, తన జట్టు కూర్పులో కీలక పాత్ర పోషించనున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




