Team India: ఎవర్రా రోహిత్, కోహ్లీ.. మా ప్రిన్స్ ఉండగా.. ఊహించని షాక్ ఇవ్వనున్న బీసీసీఐ?
Team India: డిసెంబర్ 22న జరగనున్న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కాంట్రాక్టు గ్రేడ్‌లను తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు పదోన్నతి లభించే అవకాశం ఉంది.

Team India: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) త్వరలో ప్రకటించబోయే 2024-25 వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 22న జరగనున్న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కాంట్రాక్టు గ్రేడ్‌లను తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు పదోన్నతి లభించే అవకాశం ఉంది.
రోహిత్, కోహ్లీల జీతాల్లో కోత?
ప్రస్తుత సమాచారం ప్రకారం, సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వార్షిక రిటైనర్‌షిప్‌లో రూ. 2 కోట్ల మేర కోత పడే అవకాశం ఉంది.
గత ఏడాది కాలంలో రోహిత్, కోహ్లీ ఇద్దరూ టెస్టులు, టీ20 ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం వారు కేవలం వన్డే (ODI) ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు.
గ్రేడ్ మార్పు: ప్రస్తుతం వీరిద్దరూ అత్యున్నత ‘ఎ+’ (A+) కేటగిరీలో ఉన్నారు. దీని ద్వారా వారికి ఏడాదికి రూ. 7 కోట్లు లభిస్తున్నాయి. అయితే, వారు పరిమిత క్రికెట్ మాత్రమే ఆడుతుండటంతో, వారిని ‘ఎ’ (Grade A) కేటగిరీకి మార్చే అవకాశం ఉంది. అదే జరిగితే, వారి వార్షిక వేతనం రూ. 5 కోట్లకు తగ్గుతుంది.
శుభ్‌మన్ గిల్‌కు ‘ఎ+’ గ్రేడ్? మరోవైపు, భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ తీపి కబురు చెప్పేలా కనిపిస్తోంది.
ప్రస్తుతం ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న గిల్‌ను ‘ఎ+’ (A+) కేటగిరీకి ప్రమోట్ చేసే అవకాశం ఉంది.
అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తుండటం, జట్టు పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో అతనికి ఈ గౌరవం దక్కనుంది.
గిల్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ‘ఎ+’ కేటగిరీలో కొనసాగే అవకాశం ఉంది.
డిసెంబర్ 22న నిర్ణయం: డిసెంబర్ 22న వర్చువల్‌గా జరిగే బీసీసీఐ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) ఈ కాంట్రాక్టులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో అంపైర్లు, మ్యాచ్ రిఫరీల వేతనాల సవరణ, మహిళా క్రికెటర్ల కాంట్రాక్టులపై కూడా చర్చించనున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




