AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer : ధోనీ, కోహ్లీ సరసన అరుదైన రికార్డు.. పంజాబ్ కింగ్స్ సారథి సరికొత్త చరిత్ర

Shreyas Iyer : పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన ఐదో ఆటగాడిగా అరుదైన రికార్డు సృష్టించారు. ధోనీ, రోహిత్, కోహ్లీ సరసన అయ్యర్ చేరారు. 31 ఏళ్ల వయసులోనే అయ్యర్ ఈ రేంజ్ రికార్డు అందుకోవడం విశేషం.

Shreyas Iyer : ధోనీ, కోహ్లీ సరసన అరుదైన రికార్డు.. పంజాబ్ కింగ్స్ సారథి సరికొత్త చరిత్ర
Shreyas Iyer
Rakesh
|

Updated on: May 18, 2026 | 11:55 AM

Share

Shreyas Iyer : భారత క్రికెట్ స్టార్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరిగిన మ్యాచ్‌లో టాస్ వేయడానికి మైదానంలోకి అడుగుపెట్టగానే, అయ్యర్ ఒక ప్రత్యేకమైన క్లబ్‌లో సభ్యుడయ్యారు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 100 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన ఐదో ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఈ ఘనత కేవలం ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ వంటి దిగ్గజాలకు మాత్రమే సాధ్యమైంది. 31 ఏళ్ల వయసులోనే అయ్యర్ ఈ రేంజ్ రికార్డు అందుకోవడం విశేషం.

శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ ప్రయాణం 2018లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్)తో మొదలైంది. గౌతమ్ గంభీర్ మధ్యలో తప్పుకోవడంతో పగ్గాలు అందుకున్న అయ్యర్, అతి తక్కువ కాలంలోనే ఆ జట్టు దశను మార్చేశారు. 2019లో ఢిల్లీని ప్లేఆఫ్స్‌కు, 2020లో తొలిసారి ఫైనల్‌కు తీసుకెళ్లి తన సత్తా చాటారు. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి, 2024లో ఆ జట్టుకు మూడో ఐపీఎల్ టైటిల్‌ను అందించి చాంపియన్‌గా నిలిచారు. తాజాగా 2025 వేలంలో రూ.26.75 కోట్లతో పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకున్న ఈ కెప్టెన్ పంజాబ్‌ను 11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కు చేర్చి తన విలువ ఏంటో నిరూపించుకున్నారు.

ఐపీఎల్ కెప్టెన్ల జాబితాలో ఎంఎస్ ధోనీ 235 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ శర్మ (158), విరాట్ కోహ్లీ (143), గౌతమ్ గంభీర్ (129) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు 100వ మ్యాచ్ పూర్తి చేసుకున్న అయ్యర్ వీరి సరసన చేరారు. ఈ 100 మ్యాచ్‌లలో అయ్యర్ 54 విజయాలు సాధించి మంచి విన్నింగ్ పర్సంటేజీని కొనసాగిస్తున్నారు. ధోనీ, రోహిత్ ఐదేసి టైటిల్స్ గెలవగా, గంభీర్ రెండు, అయ్యర్ ఒక టైటిల్ గెలిచారు. విరాట్ కోహ్లీకి మాత్రం కెప్టెన్‌గా టైటిల్ దక్కలేదు. టాస్ గెలిచిన సమయంలో ఈ రికార్డు గురించి స్పందిస్తూ.. “నాకు ఈ విషయం తెలియదు, కానీ 100వ మ్యాచ్‌లో కెప్టెన్‌గా గెలవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను” అని అయ్యర్ సంతోషం వ్యక్తం చేశారు.

ధర్మశాల వేదికగా జరిగిన ఈ పోరులో ఆర్సీబీ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. విరాట్ కోహ్లీ (58) తన ఫామ్‌ను కొనసాగించగా, వెంకటేష్ అయ్యర్ (73 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వీరికి తోడు టిమ్ డేవిడ్ చివర్లో మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ వికెట్లు తీసినా పరుగులు ధారాళంగా సమర్పించుకున్నారు. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్‌కు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. శ్రేయాస్ అయ్యర్ తన 100వ మ్యాచ్‌ను గుర్తుండిపోయే విజయంతో ముగిస్తారా లేదా అన్నది అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us