Shoaib Malik: పాపం.. దురదృష్టానికి దగ్గరి బంధువులా ఉన్నాడు.. నమ్మశక్యం కాని రీతిలో ఔటైన షోయబ్‌ మాలిక్‌

పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ స్టార్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ టైమ్ అంతగా బాగోలేదు. మైదానం వెలుపల, అతను తన భార్య, భారత టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మీర్జాతో విడాకులు తీసుకుంటున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో అంతకు ముందు టీ20 ప్రపంచకప్‌ కోసం పాక్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

Shoaib Malik: పాపం.. దురదృష్టానికి దగ్గరి బంధువులా ఉన్నాడు.. నమ్మశక్యం కాని రీతిలో ఔటైన షోయబ్‌ మాలిక్‌
Shoaib Malik
Follow us

|

Updated on: Dec 18, 2022 | 8:11 PM

పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ స్టార్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ టైమ్ అంతగా బాగోలేదు. మైదానం వెలుపల, అతను తన భార్య, భారత టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మీర్జాతో విడాకులు తీసుకుంటున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో అంతకు ముందు టీ20 ప్రపంచకప్‌ కోసం పాక్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ మైదానంలోకి దిగినా దురదృష్టం వెక్కిరించింది. లంక ప్రీమియర్ లీగ్‌లోని ఒక మ్యాచ్‌లో భాగంగా ఎవరూ నమ్మశక్యం కాని విధంగా ఔటయ్యాడు షోయబ్‌. లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్ తరఫున ఆడుతున్న షోయబ్ మాలిక్ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హిట్ వికెట్‌తో ఔటయ్యాడు. గాలే గ్లాడియేటర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో, మాలిక్ ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ సమయంలో జాఫ్నా ఇన్నింగ్స్ 14వ ఓవర్ జరుగుతోంది. గాలె పేసర్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌, షోయబ్ మాజీ సహచరుడు వాహబ్ రియాజ్ బంతిని అందుకున్నాడు. అప్పటికే ఆ ఓవర్‌లో వికెట్‌ తీసి ఉత్సాహంలో ఉన్న వాహబ్‌, మాలిక్ క్రీజులోకి వచ్చిన షార్ట్‌ బాల్‌తో దాడి చేశాడు. ఈక్రమంలో మొదటి బంతినే ఫుల్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి అతని బ్యాట్‌పైకి పూర్తిగా రాకపోవడంతో ఒక ఎడ్జ్ తీసుకొని హెల్మెట్ గ్రిల్‌ను బలంగా తాకింది.

దీంతో చెవికి రక్షణగా ఉండే హెల్మెట్ భాగం విరిగి బౌన్స్ అయింది. బౌన్సర్ దెబ్బ నుంచి మాలిక్ తేరుకోకముందే హెల్మెట్ పీస్ నేరుగా స్టంప్‌లపై పడిపోయింది. దీంతో బెయిల్స్‌ కింద పడిపోయాయి. దురదృష్టవశాత్తు మాలిక్ తలకు గాయం కావడమే కాకుండా వికెట్ కూడా కోల్పోయాడు. తన హెల్మెట్ పగిలిపోవడం, అది వికెట్లమీద పడడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు షోయబ్‌. విరిగిపోయిన హెల్మెట్‌ భాగాన్ని తీసుకుని డగౌట్‌కు వెళ్లిపోయాడు. అయితే మాలిక్‌కు దెబ్బ తగలగానే వెంటనే అతని దగ్గరకు వచ్చాడు వహాబ్ రియాజ్. ఓవైపు సహచరులు వికెట్‌ పడిపోయిన సంబరంలో ఉంటే అతను మాత్రం మాలిక్‌ తల భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. అతనిని ఓదార్చాడు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన జాఫ్నా 170 పరుగులు చేసింది, దీనికి సమాధానంగా గాలె 154 పరుగులు మాత్రమే చేసి 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..