Shardul : 33 వికెట్లు, 400 పైగా పరుగులు.. కట్ చేస్తే.. ఆ సిరీస్ లో చోటు నోచుకోని ధోని శిష్యుడు!
రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన శార్దూల్ ఠాకూర్, భారత జట్టులో తిరిగి స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు. 33 వికెట్లు, 402 పరుగులతో ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ టూర్, ఐపీఎల్, ఛాంపియన్స్ ట్రోఫీపై దృష్టి పెట్టిన అతను, తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తిరిగి జట్టులోకి రావాలని ఆశిస్తున్నాడు. బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.

భారత క్రికెట్‌లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు చాలా అరుదు. కానీ, అలాంటి కొద్దిమందిలో శార్దూల్ ఠాకూర్ ఒకరు. ముంబై తరఫున రంజీ ట్రోఫీలో అతను అద్భుతమైన ప్రదర్శన చేసి జాతీయ జట్టులో తన స్థానాన్ని తిరిగి సంపాదించాలనే పట్టుదలతో ఉన్నాడు.
రంజీ ట్రోఫీలో ఠాకూర్ రికార్డు ప్రదర్శన
రంజీ ట్రోఫీలో 33 వికెట్లు, 402 పరుగులు చేసిన శార్దూల్, ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే, భారత జట్టు ఇటీవల జరిగిన ఆసీస్ టెస్టు సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయలేదు. దీనిపై స్పందించిన అతను, “జట్టు ఎంపికలో నా పేరు లేకపోవడం బాధగా అనిపించింది. కానీ, ఇది ప్రొఫెషనల్ క్రికెట్లో సహజం. నా దృష్టిని ఇతర టోర్నమెంట్లపై పెట్టి ముందుకు వెళ్లాలని అనుకున్నా,” అని చెప్పాడు.
ఠాకూర్ తన బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ, జట్టులో స్థానం కోసం సిద్ధమవుతున్నాడు. “నేను వికెట్లు తీయగలను, బౌలింగ్‌లో కన్సిస్టెన్సీ చూపగలను. బ్యాటింగ్‌లో కూడా నాకు నమ్మకం ఉంది. జట్టుకు అవసరమైన సమతుల్యతను అందించగలననే నమ్మకం ఉంది,” అని శార్దూల్ తెలిపారు.
అతను ఐపీఎల్ 2025, ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ పై దృష్టి పెట్టాడు. “ఇంగ్లాండ్ పర్యటన చాలా కీలకం. విదేశాల్లో ఆడేటప్పుడు, 7 లేదా 8వ స్థానంలో బ్యాటింగ్ చేయగల బౌలర్ ఉండటం జట్టుకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇదే విధంగా ఆటకు మద్దతు ఇచ్చారు. నేను కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వగలనని నమ్ముతున్నాను,” అని ఆయన అన్నారు.
తాను కొత్త బంతితో బౌలింగ్ చేయడంలో మంచి అనుభవం సంపాదించానని, ముంబై తరఫున లీడ్ బౌలర్‌గా తన పాత్రను నెరవేర్చినట్టు ఠాకూర్ వెల్లడించాడు. “బుమ్రా ఒక వైపు బౌలింగ్ చేస్తుంటే, నేను మరోవైపు నుండి కొత్త బంతిని స్వింగ్ చేయగలను. టెస్టుల్లో కూడా నేను కొత్త, పాత బంతితో సమర్థంగా బౌలింగ్ చేయగలను. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడమూ నాకు అలవాటు,” అని ఆయన వివరించారు.
ఇంగ్లాండ్ పర్యటనలో తనకు అవకాశం వస్తే, తన ప్రతిభను మరోసారి నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని షార్దూల్ స్పష్టం చేశాడు. జట్టుకు తాను విలువైన ఆటగాడినని నిరూపించుకోవాలనుకుంటున్నాను అని, బ్యాట్‌తో కొన్ని అదనపు పరుగులు చేయగలను, బౌలింగ్‌లో పట్టు సాధించగలనుఅ ని, ఇది జట్టు విజయానికి ఎంతగానో సహాయపడుతుంది అని ఆయన అన్నారు.
ఇంగ్లాండ్ టూర్ ద్వారా శార్దూల్ మరోసారి జాతీయ జట్టులో స్థానం సంపాదిస్తాడా? అనేది వేచిచూడాలి. అయితే, రంజీ ట్రోఫీలో చూపించిన ప్రదర్శన అతనికి భవిష్యత్తులో మళ్లీ తలుపులు తెరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



