ఇంగ్లాండ్ తీసుకెళ్లి నా ఇజ్జత్ తీశారు.. గిల్, గంభీర్‌లపై టీమిండియా ప్లేయర్ సంచలన ఆరోపణలు..!
Shardul Thakur Blames Shubman Gill Gautam Gambhir: శార్దూల్ ఠాకూర్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న అసంతృప్తిని బయటపెట్టాయి. రాబోయే న్యూజిలాండ్ సిరీస్ నాటికి దేశీవాళీ క్రికెట్‌లో రాణించి మళ్లీ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని శార్దూల్ భావిస్తున్నప్పటికీ, గిల్, గంభీర్ ద్వయంపై అతను చేసిన వ్యాఖ్యలు అతని కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.

Shardul Thakur Blames Shubman Gill Gautam Gambhir: భారత క్రికెట్ జట్టులో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో తనను సరిగ్గా వాడుకోలేదని, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాల వల్లే తనకు అన్యాయం జరిగిందని ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
నన్ను తక్కువ అంచనా వేశారు: శార్దూల్ ఆవేదన..
ఇటీవల ముగిసిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో లీడ్స్, మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లలో మాత్రమే శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం దక్కింది. అయితే, ఈ రెండు మ్యాచ్‌లలోనూ ఇతర బౌలర్లతో పోలిస్తే అతనికి చాలా తక్కువ ఓవర్లు ఇచ్చారు. కేవలం 27 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం కల్పించడంపై శార్దూల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో ముంబై తరపున 9 మ్యాచ్‌ల్లో 35 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, జట్టు మేనేజ్‌మెంట్ తనపై నమ్మకం ఉంచకపోవడం తనను ఎంతో బాధించిందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శార్దూల్ బహిరంగంగానే పెదవి విరిచాడు.
ఆ నిర్ణయం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది..!
లీడ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 373 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినప్పుడు, శార్దూల్ ఒకే ఓవర్లో ప్రమాదకరమైన బెన్ డకెట్, హ్యారీ బ్రూక్‌లను అవుట్ చేసి భారత్‌ను రేసులోకి తెచ్చాడు. కానీ, ఆ వెంటనే అతన్ని బౌలింగ్ దాడి నుండి తప్పించడంపై శార్దూల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. “ఆ సమయంలో నాకు మరికొన్ని ఓవర్లు ఇచ్చి ఉంటే, ఖచ్చితంగా మరో వికెట్ తీసేవాడిని. అది మ్యాచ్ ఫలితాన్ని మార్చేసేది. కానీ నన్ను ఆపడం వల్ల ఇంగ్లాండ్‌పై ఒత్తిడి తగ్గింది” అని శార్దూల్ ఆరోపించాడు. కెప్టెన్ గిల్, కోచ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయాలు జట్టు ఓటమికి, సిరీస్ 2-2తో డ్రా కావడానికి దారితీశాయని పరోక్షంగా నిందించాడు.
ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్‌కు దూరం.. భవిష్యత్తుపై నీలినీడలు..
ఈ వివాదాస్పద సిరీస్ తర్వాత శార్దూల్ ఠాకూర్‌ను సెలెక్టర్లు పూర్తిగా పక్కన పెట్టారు. ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు అతనికి చోటు దక్కలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ తీవ్ర పోటీ ఉండటంతో శార్దూల్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే, జట్టులో తలెత్తిన ఈ అంతర్గత విభేదాలపై స్పందించిన శార్దూల్, తాను నేరుగా కెప్టెన్‌తో గానీ, కోచ్‌తో గానీ మాట్లాడలేదని, ఆటగాడిగా తనకు ఇచ్చిన బాధ్యతను మాత్రమే నిర్వర్తించానని స్పష్టం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




