Sanju Samson : చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఇలా
Sanju Samson : ముంబై ఇండియన్స్‌పై సెంచరీ బాదిన తొలి చెన్నై బ్యాటర్‌గా సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026లో రెండో సెంచరీతో రోహిత్ శర్మ రికార్డులను కూడా సమం చేశాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబై పై సెంచరీ బాదిన తొలి చెన్నై బ్యాటర్‌గా సంజూ శాంసన్ రికార్డు సృష్టించాడు.

Sanju Samson : ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్రలో ఏ చెన్నై బ్యాటర్‌కు సాధ్యం కాని రికార్డును సంజూ శాంసన్ తన ఖాతాలో వేసుకున్నాడు. వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ వీరవిహారం చేశాడు. కేవలం 54 బంతుల్లోనే 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో సంజూ కేవలం తన జట్టును గెలిపించడమే కాకుండా, ఐపీఎల్ చరిత్రలో చెన్నై తరపున ఎవరికీ సాధ్యం కాని సరికొత్త రికార్డులను సృష్టించాడు.
ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఎన్నో హోరాహోరీ పోరులు జరిగాయి. కానీ 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌పై సెంచరీ బాదిన తొలి చెన్నై బ్యాటర్‌గా సంజూ శాంసన్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ముంబైపై రుతురాజ్ గైక్వాడ్ చేసిన 88 పరుగులే అత్యధికం. ఇప్పుడు ఆ రికార్డును చెరిపివేసి సంజూ చరిత్ర పుటల్లోకెక్కాడు.
సంజూ శాంసన్ ఐపీఎల్ 2026లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఆయనకు ఇది రెండో సెంచరీ. చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో ఒకే సీజన్‌లో రెండు సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా సంజూ నిలిచాడు. 2018లో షేన్ వాట్సన్ ఈ ఘనత సాధించగా, ఇప్పుడు సంజూ ఆ క్లబ్‌లో చేరాడు. ముంబై బౌలర్లను చీల్చి చెండాడుతూ ఆయన చేసిన 101 పరుగుల ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉన్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో సంజూ శాంసన్ ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకున్నాడు. మురళీ విజయ్, షేన్ వాట్సన్, రుతురాజ్ గైక్వాడ్ తలో రెండు సెంచరీలు చేయగా, సంజూ కూడా తన రెండో సెంచరీతో వారి సరసన చేరాడు. వాంఖడే స్టేడియం సంజూకి బాగా కలిసొస్తుందని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది.
కేవలం ఐపీఎల్ లోనే కాకుండా ఓవరాల్ టీ20 క్రికెట్‌లో కూడా సంజూ శాంసన్ రికార్డులు సృష్టిస్తున్నాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయ బ్యాటర్ల జాబితాలో సంజూ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆయన ఖాతాలో ఇప్పుడు 8 సెంచరీలు ఉన్నాయి. దీనితో రోహిత్ శర్మ రికార్డును ఆయన సమం చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ చెరో 9 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. సంజూ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే వారి రికార్డులను కూడా త్వరలోనే అధిగమించేలా కనిపిస్తున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
